జనసేనకు వలసలు ఎందుకు లేవు..?

power star

ఎన్నికల టైమ్ దగ్గర పడేకొద్దీ అటు టీడీపీలోకి, ఇటు వైసీపీలోకి వలసలు జోరందుకున్నాయి. కప్పదాట్లు బాగానే జరుగుతున్నాయి.

2014లో కాంగ్రెస్ ని అంటిపెట్టుకుని ఉన్న సీనియర్లు కూడా ఈ దఫా ధైర్యం చేసి పార్టీ మారుతున్నారు. అంతా బాగానే ఉంది కానీ జనసేనలోకి ఎందుకు వలసలు లేవు.

ప్రజారాజ్యంలాగా జనసేనలోకి కూడా వలస నాయకులు వెల్లువెత్తుతారని భావించిన పవన్ కల్యాణ్ కు చివరికి ఆశాభంగమే మిగిలింది.

అప్లికేషన్లు తీసుకుంటున్నానని, ఆఖరు తేదీ వచ్చేసిందని, రెండురోజులు పొడిగించామని ప్రకటనలు చేస్తున్నా ఎవరిలో కదలికలు లేవు.

అసలు పవన్ కల్యాణ్ పై రాష్ట్రంలో ఉన్న సీనియర్ రాజకీయ నాయకులకు ఎందుకు నమ్మకంలేదు. తనకి తాను మూడో ప్రత్యామ్నాయంగా చెప్పుకుంటున్న పవన్ ని ఎవరూ ఎందుకు లెక్కలోకి తీసుకోవడం లేదు?

ప్రజారాజ్యం చేదు అనుభవం

ప్రజారాజ్యం పార్టీలో కీలకంగా పనిచేసిన పవన్ కల్యాణ్ ని ఆ పార్టీ మిగిల్చిన చేదు అనుభవాలు వెంటాడుతున్నాయి. అన్న బాటలోనే తమ్ముడు కూడా పార్టీని హోల్ సేల్ గా అమ్మేస్తాడనే ప్రచారం ఉంది.

అందులో నిజమెంత అనేది పక్కనపెడితే, ప్రతిపక్షాలకు మాత్రం ఇదొక ఆయుధంగా మారింది. గత ఎన్నికల్లో చంద్రబాబుకి మద్దతిచ్చి జనసేనాని పెద్దతప్పు చేశారు.

అందుకే ఈసారి ఎవరూ ఆయన్ను నమ్మేలా కనిపించడంలేదు, పార్టీలో చేరికలు లేకపోవడానికి ఇదే పెద్ద కారణం అంటున్నారు.

పవన్ కల్యాణ్ ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికీ తెలియదు. హడావిడిగా యాత్రలు చేస్తారు, ఆపైన కొన్నిరోజులు చప్పబడతారు. రివ్యూలు, మీటింగ్ లంటూ కొన్నిరోజులు కాలక్షేపం చేస్తారు.

ఎప్పుడూ ఎక్కడా స్థానిక నాయకులను తనతోపాటు పర్యటనల్లో తిప్పలేదు, ప్రజనీకానికి పరిచయం చేయలేదు.

తనచుట్టూ ఉన్న వారంటేనే పవన్ కు అంత అభద్రతా భావం. పార్టీ పేరు చెప్పుకుని వారు ఎక్కడ ఎదిగిపోతారో అనే ఆందోళన.

అందుకే పవన్, నాదెండ్ల మనోహర్ తప్ప జనసేన తరపున ఎవరూ ఫోకస్ కాలేదు. ఇది కూడా ఆ పార్టీకి పెద్ద మైనస్ పాయింట్.

రాజకీయం తెలియదు

పవన్ కల్యాణ్ కి ఆదర్శాలు తప్ప రాజకీయం తెలియదనే అపవాదు ఉంది. ఎంతసేపటికీ పాతికేళ్ల రాజకీయం అంటారు తప్పితే ఇదమిత్థంగా ఇదీ తన సిద్ధాంతం అని చెప్పరు.

రాజకీయ ఎత్తులు, పైఎత్తులు వేయడం పవన్ కి చేతకాదు, సందర్భానుసారం వెంటనే స్పందించే గుణం కూడా తక్కువే.

ఎవరైనా రాసిచ్చిన ప్రసంగాలు చదవడం తప్పితే తనకు తాను ఒక్కమాట కూడా సూటిగా మాట్లాడలేరనే విమర్శలు కూడా ఉన్నాయి.

అందుకే పవన్ ని సీరియస్ పొలిటీషియన్ గా ఎవరూ గుర్తించడం లేదు.

ఓటుబ్యాంకు లేదు, కులముద్ర

జనసేనకు ఇప్పటివరకూ స్థిరమైన ఓటుబ్యాంకు లేదు. 5శాతం ఓటింగ్ వస్తుందని అంచనాలున్నాయి కానీ అది కూడా అన్ని ప్రాంతాల్లో స్థిరంగా ఉందన్న లెక్కలు లేవు.

అసలు పవన్ ని సపోర్ట్ చేసేవాళ్లలో ఎంతమందికి ఓటు హక్కు ఉంది, ఎంతమంది ఓటింగ్ రోజు గాజు గ్లాసుకి ఓటు వేస్తారనేది సస్పెన్స్.

ఇక జనసేనలోకి వస్తే కులముద్ర పడుతుందనే భయం మరికొందరిది.

ఇప్పుడు అన్ని పార్టీలపై కులముద్ర ఉన్నా.. జనసేనపై అది మరింత ఎక్కువగా కనిపించే అవకాశముంది.

పవన్ సామాజిక న్యాయం అంటూ మొత్తుకుంటున్నా పవన్ చుట్టూఉన్నవారు, జిల్లాల్లో ఉన్న ఆశావహులు.. అందరూ ఒకే కమ్యూనిటీకి చెందినవాళ్లు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *