సొంత పార్టీ నేతలకే చంద్రబాబు మీద నమ్మకం లేనప్పుడు… ప్రజలకు ఎలా నమ్మకం వుంటుందట.? నిన్ను నమ్మం బాబూ: అటు కోట్లు.. ఇటు వికెట్లు

నిన్ను నమ్మం బాబూ..’ అంటూ ప్రతిపక్షం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏ ముహూర్తాన ‘స్లోగన్‌’ షురూ చేసిందోగానీ, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు గారికి అప్పటినుంచే ‘చుక్కలు’ షురూ అయ్యాయి.

కోట్లు ఖర్చు చేస్తున్నారుగానీ, చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్‌లో ‘వెలుగు’ తీసుకురాలేకపోతున్నారు. ఒక్కో వికెట్‌ జారిపోతోంటే, తెలుగుదేశం పార్టీ పరిస్థితి నానాటికీ దిగజారిపోతోంది.

టీడీపీకి ఇప్పటికే మాజీమంత్రి రావెల కిషోర్‌బాబు రాజీనామా చేయగా, మేడా మల్లికార్జునరావు టీడీపీకి గుడ్‌ బై చెప్పి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

ఈ ఇద్దరూ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు. పార్టీ మారే క్రమంలో ఈ ఇద్దరూ చిత్తశుద్ధితో తమ పదవులకు రాజీనామా చేయడం, అవి ఆమోదం పొందడం జరిగిపోయాయి.

లేటెస్ట్‌గా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌, తెలుగుదేశం పార్టీకి గుడ్‌ బై చెప్పేశారు. అంటే, వరుసగా టీడీపీ నుంచి మూడు వికెట్లు పడిపోయాయన్నమాట. నిజానికి ఆమంచి కృష్ణమోహన్‌ ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా గెలిచారు 2014 ఎన్నికల్లో. ఆ తర్వాత ఆయన టీడీపీలో చేరారు.

ఇదిలావుంటే, కాంగ్రెస్‌ పార్టీ నుంచి నేతల్ని అరువు తెచ్చుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు. వెన్నుపోటు రాజకీయాల్లో దిట్ట అయిన చంద్రబాబు, ఓ పక్క కాంగ్రెస్‌తో స్నేహమంటూనే, ఆ పార్టీకి వెన్నుపోటు పొడుస్తుండడం గమనార్హం.

మాజీ కేంద్రమంత్రి కిషోర్‌ చంద్రదేవ్‌, నిన్న చంద్రబాబుతో భేటీ అయి, తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు ప్రకటించిన విషయం విదితమే.

మరోపక్క కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, టీడీపీలో చేరతానని గతంలో సంకేతాలు ఇచ్చినా, ఇప్పుడాయన పునరాలోచనలో పడినట్లు కన్పిస్తోంది.

త్వరలో సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్‌ రాబోతోంది. నోటిఫికేషన్‌ వచ్చేలోగానే మరికొన్ని వికెట్లు టీడీపీ కోల్పోవడం ఖాయమన్న అభిప్రాయం టీడీపీ వర్గాల్లోనే వ్యక్తమవుతోంది.

ఓ వైపు రాష్ట్ర ఖజానా నుంచి కోట్లు ఖర్చుచేసి ధర్మపోరాట దీక్షలంటూ సొంత డబ్బా కొట్టుకుంటున్న చంద్రబాబు, ఇంకోపక్క పార్టీలోకి వచ్చే నేతల కోసం కూడా పెద్దయెత్తున ఖర్చు చేస్తున్నారు. అయినాగానీ, వికెట్లు పడిపోతుండడం తెలుగుదేశం పార్టీ వర్గాల్నే షాక్‌కి గురిచేస్తోంది.

ఇప్పుడే సినిమా ఇలా వుంటే, ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చాక పరిస్థితి ఇంకెలా వుంటుందో ఏమో.! సొంత పార్టీ నేతలకే చంద్రబాబు మీద నమ్మకం లేనప్పుడు, ప్రజలకు ఆయన మీద ఎలా నమ్మకం వుంటుందట.?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *