జల సంరక్షణ సింహాచలం దేవస్థానానికి జాతీయ గుర్తింపు

చల్లని స్వామి చంద్రయ్య కొలువుతీరిన సింహగిరి శిఖరం జల వనరులకు పుట్టినిల్లు కొండ చుట్టూ ఎటువైపు చూసినా జలసిరి తో కళకళలాడుతోంది. జలధారల పరవళ్లు నిత్యం పరవశింపజేస్తాయి. సాక్షాత్తు గంగ స్వరూపమైన పవిత్ర గంగాధర అలుపెరగకుండా ప్రవహిస్తూ భక్తులకు స్వచ్ఛమైన నీటిని అందిస్తుంది.

వరుణుడి కరుణతో పచ్చని సింహగిరి కొండల్లో కురిసే వర్షపు నీరు ప్రవాహమై దిగువకు పరవళ్ళు తొక్కుతుంది. ఇలా వృధాగా పోతున్న జనాలకు దోసిళ్ళతో ఒడిసిపట్టి భూమాతకు జలాభిషేకం చేయాలని సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు సంకల్పించారు.

ఆయన సూచనల మేరకు దేవస్థానం కార్యనిర్వాహణాధికారి కె.రామచంద్రమోహన్ ఆధ్వర్యంలో జల సంరక్షణ కు శ్రీకారం చుట్టారు మూడేళ్ల పాటు కొనసాగిన ఈ భగీరథ ప్రయత్నానికి ఈరోజు జాతీయస్థాయి గుర్తింపు సొంతమైంది. తొలుత కృష్ణాపురం లో దేవస్థానం అభివృద్ధి చేసిన నరసింహ వనంలో నాలుగు ఎకరాల్లో అంతస్రావ చెరువును తవ్వించారు.

ఆ తర్వాత ఇంజక్షన్ బావులు, కొండ చుట్టూ కాoటూరు ట్రైoచ్ లు, చెక్ డ్యాములు, రూపటాఫ్ జల సంరక్షణ వంటి వినూత్న పద్ధతిలో నీటి పొదుపు ను పాటించి పలు సంస్థలకు ఆదర్శంగా నిలిచారు ఈ క్రమంలో 2018 సంవత్సరానికి గాను కేంద్ర జల వనరుల అభివృద్ధి గంగా ప్రక్షాళన మంత్రిత్వశాఖ “నేషనల్ వాటర్ అవార్డ్స్ 2018” పేరిట మైగ వ్ వెబ్ సైట్ ద్వారా నిర్వహించిన జాతీయస్థాయి పోటీకి సింహాచల దేవస్థానం దరఖాస్తు చేసింది.

దేశవ్యాప్తంగా జరిగిన ఈ పోటీల్లో 13 విభాగాల్లో అవార్డులకు ఎంపిక చేసింది. జలసంరక్షణ విధానాలను అమలు చేసి ప్రచారం చేసిన ఉత్తమ సంస్థ దేవస్థానం ఆధ్యాత్మిక, పర్యాటక సంస్థల విభాగంలో అవార్డును సొంతం చేసుకుంది.

ఈ మేరకు దేవస్థానం అధికారులకు కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ సమాచారం అందించింది ఈ నెల 25న ఢిల్లీలో జరిగే అవార్డుల ప్రధాన కార్యక్రమంలో దేవస్థానం తరఫున ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *