అజర్‌ మృతి చెందాడా? లేక బతికే ఉన్నాడా? అనే విషయంపై…పాక్‌ మీడియా స్పష్టికరణ.

మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాది, జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ బతికే ఉన్నాడని పాకిస్థాన్‌ మీడియా వెల్లడించింది. అజర్‌ మృతి చెందాడని సోషల్‌ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

దీంతో అజర్‌ కుటుంబానికి సన్నిహితులైన వారిని వివరణ కోరగా.. మసూద్‌ బతికే ఉన్నాడని చెప్పినట్లు జియో ఉర్దూ న్యూస్‌ వెల్లడించింది.

అయితే అజర్‌ మృతి చెందాడా? లేక బతికే ఉన్నాడా? అనే విషయంపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.

అజర్‌ మృతిపై ఫెడరల్‌ ఇన్ఫర్మేషన్‌ మినిస్టర్‌ ఫవాద్‌ చౌదరిని పీటీఐ వివరణ కోరగా.. ఈ విషయంపై తనకేం తెలియదని చెప్పారు.

జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధిపతి మౌలానా మసూద్ అజర్ మరణించినట్లు ఆదివారం సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది.

పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో జైషే ఉగ్రవాద శిక్షణ శిబిరాలపై ఐఏఎఫ్ జరిపిన మెరుపుదాడుల్లో మసూద్ తీవ్రంగా గాయపడి దవాఖానలో మృతిచెందినట్లు వార్తలొచ్చాయి.

మరోవైపు కాలేయ క్యాన్సర్‌తో బాధపడుతున్న అతడు.. పాక్ ఆర్మీ దవాఖానలో చికిత్స పొందుతూ మరణించినట్లు కూడా కథనాలు వెలువడడం గమనార్హం.

దీనిపై పాక్ ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

మసూద్ మరణించాడన్న వదంతుల నేపథ్యంలో జైషే మహమ్మ ద్ ఆదివారం ఓ ప్రకటన చేస్తూ .. మసూద్ బతికే ఉన్నాడని, అతడి ఆరోగ్యం బాగానే ఉన్నదన్నది.

మరోవైపు మసూద్ మరణ వార్తలు నిజమా కాదా అని తెలుసుకునేందుకు భారత నిఘా సంస్థలు ప్రయత్నిస్తున్నాయని అధికార వర్గాలు చెప్పాయి.

మసూద్ పాకిస్థాన్‌లోనే ఉన్నాడని, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఇంటి నుంచి బయటకు రాలేని స్థితిలో ఉన్నాడని పాక్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే.

మసూద్‌కు వ్యతిరేకంగా భారత్ బలమైన ఆధారాలు సమర్పిస్తే అతడిపై చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.

ఐఏఎఫ్ దాడుల్లో జైషేకు ఏ మేరకు నష్టం వాటిల్లిందో ఆధారాలు చూపాలని అన్ని వైపుల నుంచి ఒత్తిడులు వస్తున్న నేపథ్యంలో కేంద్రం త్వరలోనే ఆధారాలు బయటపెట్టాల ని యోచిస్తున్నట్లు సమాచారం.

ఆధారాలు బయటపెట్టాలా వద్దా అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుందని ఐఏఎఫ్ ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *