వివేకా హత్య.. ఆదినారాయణ రెడ్డిపై సునీత సంచలన ఆరోపణలు

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిట్ విచారణ కొనసాగుతుండగా, దీనిపై హైకోర్టులో ఆయన భార్య సౌభాగ్య, వైఎస్ జగన్ పిటిషన్లు దాఖలుచేయగా వీటిపై విచారణను గురవారానికి హైకోర్టు వాయిదా వేసింది.

  • 1.మాజీ మంత్రి వివేకా హత్యపై సునీత సంచలన వ్యాఖ్యలు.
  • 2.మంత్రి ఆదినారాయణ రెడ్డిపై అనుమానం వ్యక్తం చేసిన సునీత.
  • 3.చంద్రబాబుపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వివేకా కుమార్తె.

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిట్ విచారణ కొనసాగుతుండగా, సీబీఐ విచారణ జరిపించాలని ఆయన కుమార్తె డిమాండ్ చేశారు.

గతవారం తొలిసారి మీడియా ముందుకు వచ్చిన వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత తన తండ్రి హత్య కేసులో విచారణ నిష్పక్షపాతంగా జరగాలని కోరిన సంగతి తెలిసిందే.

తాజాగా బుధవారం ఆమె మరోసారి మీడియా ముందుకు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తూ హత్య జరిగిన తర్వాత జరిగిన సంఘటలను వివరించారు.

తన తండ్రి చనిపోయిన తర్వాత ఉదయం 6.40 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశామని, దీంతో అక్కడకు వచ్చిన సీఐకి ఏం జరిగిందో తెలుసని అన్నారు.

తన తండ్రి మరణం వెనుక మంత్రి ఆదినారాయణరెడ్డి కుట్ర ఉందన్న అనుమానాలు ఉన్నాయని, ఆయన్ను మాత్రం సీఎం చంద్రబాబు నాయుడు కాపాడుతున్నారని ఆరోపించారు.

తండ్రి హత్య కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న పసునూరు పరమేశ్వరరెడ్డి సహా పలువురికి ఎమ్మెల్సీ బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డితో సన్నిహిత సంబంధాలున్నాయని పేర్కొన్నారు.

చంద్రబాబు చెప్పినట్టుగా ఆదినారాయణ రెడ్డి పనిచేస్తున్నారు కాబట్టే ఆయనను సీఎం కాపాడుకుంటూ వస్తున్నారా? అని ఆమె ప్రశ్నించారు. తన తండ్రి హత్య తరువాత ఎన్నో సమాధానాలు లేని ప్రశ్నలు వెంటాడుతున్నాయని, కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారని సునీత ధ్వజమెత్తారు.

హత్య జరిగిన వెంటనే సీఐ తన విధులను నిర్వహించలేదని, ఎవరి ఆదేశాల మేరకు ఆయన చూస్తుండిపోయారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

సిట్ అధికారులు తమను ఎన్నో ప్రశ్నలు అడిగారని, వాటికి సమాధానం ఇచ్చామని, తాను స్వయంగా ఆదినారాయణరెడ్డిపై ఫిర్యాదు చేసినా, ఇంతవరకూ ఆయన్ను మాత్రం విచారించలేదని, సిట్ సైతం టీడీపీ అధీనంలోనే పనిచేస్తోందని సునీత ఆరోపించారు.

అంతేకాదు, తమ కుటుంబం నష్టపోతే, తిరిగి తమపైనే నిందలు వేస్తున్నారని ఆమె మండిపడ్డారు. మా కుటుంబంలో విభేదాలతోనే హత్య జరిగిందని అంటున్నారని, అయితే, జగనన్నను సీఎం చేయాలని ఆయన కలగన్నారని సునీత పేర్కొన్నారు.

దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న వివేకానందరెడ్డి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోని నేతలతోనూ సమావేశాలు నిర్వహించి, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *