వివేక కూతురి ప్రెస్ మీట్.. కుట్రలపై ఆవేదన!

తన తండ్రి హత్యను ఒక వర్గం మీడియా తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్న తీరుపై ఆవేదన వ్యక్తంచేసింది వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీత.

హత్యానంతర పరిణామాలను చంద్రబాబు నాయుడు ఎంతగా ఉపయోగించుకుంటున్నారో తెలిసిన సంగతే. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు ఐదేళ్లలో తను ఏం సాధించినట్టో చెప్పడంలేదు.

వివేకానందరెడ్డి హత్యకు ప్రత్యక్ష సాక్షిలా మాట్లాడుతూ, జగన్ మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు. ఇక బాబు తానా అంటే.. తందానా అనే మీడియా కూడా అదే రీతిలో స్పందిస్తూ ఉంది. అంతకు పదిరెట్ల హడావుడి చేస్తూ ఉంది.

ఈ హత్యపై అభూత కల్పనలతో కూడిన వార్తలతో తెలుగుదేశం పార్టీకి మేలు చేయవచ్చని తెలుగుదేశం అనుకూల మీడియా ప్రయత్నాలు సాగిస్తూ ఉంది.

ఇలాంటి నేపథ్యంలో.. తన తండ్రి హత్యను దారుణమైన రాజకీయాలకు వాడుకుంటున్న వైనంపై వివేకానందరెడ్డి కూతురు సునీత తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు.

‘మా నాన్నకు నేనంటే ఎంతో ఇష్టం. రాజకీయాలపై ఆయనకున్న ఆసక్తి, ప్రజలతో మమేకం కావడంపై ఉన్న ఆసక్తి ఆపారమైనది. పులివెందుల అంటే ఎంతోప్రేమ. అక్కడ ఉండటానికే ప్రాధాన్యతను ఇచ్చారు.

అక్కడి ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు. నా తండ్రి మరణం మాకు అత్యంత బాధాకరమైన అంశం. అయితే ఆ తర్వాత ఆయన మరణంపై మీడియాలో వస్తున్న కథనాలు మరింత బాధను కలిగిస్తూ ఉన్నాయి.

ఆయన చనిపోవడంపై చాలా ‘లూజ్ టాక్’ సాగుతోంది. ఆఖరికి మరణాన్ని కూడా గౌరవించడం లేదు. అదెవరైనా సరే.. ఇలా మాట్లాడటం ద్వారా ఆయనను అవమానిస్తూ ఉన్నారు.

చనిపోయిన వాళ్ల గురించి చెడుగా మాట్లాడొద్దని మనం అనుకుంటాం. అయితే నా తండ్రి విషయంలో మాత్రం దారుణంగా మాట్లాడుతున్నారు.

అది మాత్రమేకాదు.. ఈ మాటలు విచారణను ప్రభావితం చేయవా? సిట్ విచారణ కొనసాగిస్తూ ఉంది. అది ఏమీతేల్చకుండానే.. పెద్దమనుషులే కొందరు కంక్లూజన్స్ ఇస్తున్నారు.

ఇది ప్రభావితం చేసే విషయం కాదా? పారదర్శకమైన విచారణ ఎలా జరుగతుంది? ఇదంతా కేసును పక్కదారి పట్టించే ప్రయత్నాలు కావా?

జగనన్న ముఖ్యమంత్రి కావాలని నా తండ్రి తీవ్రంగా కష్టపడ్డారు. అది ఆయన ఆకాంక్ష. ఈ విషయంలో దుష్ప్రచారం చేస్తున్నారు. పెద్దాయన పోయారని మేం బాధ పడుతుంటే.. ఇలాంటి ప్రచారమా.. రాజకీయ నేతలు, మీడియా మీకు ఇదే చెబుతున్నా.. మరణించిన ఆయన గురించి అనుచితమైన మాటలు మాట్లాడకండి.’ అని వైఎస్ సునీత ఆవేదనతో విన్నవించుకున్నారు.

ఈ కేసుపై చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలపై మీడియా ప్రస్తావించింది. వైఎస్ కుటుంబీకులే వివేకను చంపారని బాబు వ్యాఖ్యానిస్తున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఆమె ఘాటుగా స్పందించారు. ‘సిట్ విచారణ కొనసాగిస్తూ ఉంది.

మా కుటుంబంలో ఏడు వందల మంది సభ్యులున్నారు. ఏ కుటుంబంలో అయినా విబేధాలుంటాయి. అంత మాత్రానికి హత్యలు చేసుకుంటారా? అది మా సంస్కృతి కాదు.

మా ఇంట్లో అన్ని మతాల, కులాల వారున్నారు. వివిధ దేశాల్లో కూడా ఉన్నారు. మేమంతా బాగుంటాం. అందరినీ ఒకరిని ఒకరు గౌరవించుకుంటాం.

ఏడాదికి ఒకసారి వీలైన వాళ్లంతా కలుస్తాం. అపరిపక్వతతో కొందరు మాట్లాడితే దానికి ఏం చెప్పలేం..’ అని వైఎస్ సునీత అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *