ఇండియా ప్రత్యేక విమానాలను అడ్డుకున్న అమెరికా!.

1.యూఎస్ లో చిక్కుకున్న వారిని తెస్తున్న ఎయిర్ ఇండియా
2.ఇతరులకు కూడా టికెట్లను అమ్ముతున్నారంటున్న యూఎస్
3.ఏవియేషన్ ఒప్పందానికి విఘాతమని ఆగ్రహం

కరోనా వైరస్, లాక్ డౌన్ భయాలతో అమెరికాలో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకుని వచ్చేందుకు ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానాలను నడుపుతుండగా, ఈ విమానాలను అమెరికా అడ్డుకునే ప్రయత్నాలు మొదలు పెట్టింది.

టికెట్లను సాధారణ ప్రజలకు కూడా విక్రయిస్తున్నారని, ఇది సరికాదని ఆరోపించింది.

ఇరు దేశాల మధ్యా ఉన్న పౌరవిమానయాన ఒప్పందానికి విఘాతం కలిగించేలా ఎయిర్ ఇండియా వ్యవహరిస్తోందని యూఎస్ ట్రాన్స్ పోర్ట్ విభాగం అధికారులు అంటున్నారు.

ఈ మేరకు 30 రోజుల పాటు కొత్త ఆంక్షలను పెడుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

అమెరికన్ ఎయిర్ లైన్స్ కు చెందిన కంపెనీలు ఇండియాకు విమానాలను నడపకుండా భారత్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఇదే సమయంలో ఇక్కడి నుంచి ఎయిర్ ఇండియా విమానాలు అమెరికాకు వెళుతుండటంతో, వాటిల్లో సాధారణ ప్రయాణికులు లండన్, ఫ్రాన్స్ తదితర దేశాలకు ప్రయాణాలు సాగిస్తున్నందున అమెరికా ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది.

దీంతో ఎయిర్ ఇండియా విమానాలను నియంత్రించాలని భావించిన యూఎస్ ఏవియేషన్ అధికారులు, భారతీయులను స్వదేశానికి చేర్చే ఉద్దేశంతో కాకుండా, వ్యాపార ధోరణితో ఎయిర్ ఇండియా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

కరోనా మహమ్మారి వెలుగుచూడక ముందు ఇండియా నుంచి వచ్చే విమానాల సర్వీసులతో పోలిస్తే, ఇప్పుడు సగానికి పైగా సర్వీసులను ఎయిర్ ఇండియా నిర్వహిస్తోంది.

ఇదే సమయంలో ఒక్క అమెరికన్ కంపెనీ విమానం కూడా ఇండియాకు రావడం లేదు. ఇదే ఇప్పుడు అమెరికాకు కంటగింపుగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *