తూర్పు నౌకాదళంలోని మౌలిక వసతుల పరిస్థితిపై సమీక్షించేందుకు… కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రెండు రోజుల పాటు విశాఖపట్నంలో పర్యటించనున్నారు…

రెండు రోజుల విశాఖ పర్యటనకు రాజ్‌నాథ్.. నేడు జగన్‌తోనూ భేటీ!

కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రెండు రోజుల పాటు విశాఖలో పర్యటించనున్నారు. తూర్పు నౌకాదళంలోని మౌలిక వసతుల పరిస్థితిపై ఉన్నతాధికారులతో శని, ఆదివారాల్లో సమావేశమై సమీక్షించనున్నారు.

ఈ సమీక్షలు శనివారం మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల వరకు, ఆదివారం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా నౌకాదళ ప్రాజెక్టుల వేగవంతంపై చర్చించేందుకు ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డితో శనివారం రాత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ భేటీ అవుతారు.

ఈ మేరకు తూర్పు నౌకాదళంలోని కల్వరి సమావేశ మందిరంలో ఏర్పాట్లు చేస్తున్నారు.

విశాఖ జిల్లా రాంబిల్లిలో ప్రత్యామ్నాయ నౌకాస్థావరం నిర్మాణం, తీరభద్రత, రక్షణశాఖ పరిధిలోని విశాఖ విమానాశ్రయంలో పౌరవిమానాల పెంపునకు తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలు రాజ్‌నాథ్,

జగన్ మధ్య చర్చకు రావచ్చని తెలుస్తోంది.

రాజ్‌నాథ్ శనివారం ఉదయం 11.45 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకుంటారు. జూన్ 30న ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు.

అలాగే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి శనివారం రాత్రి 7 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఓ పది నిమిషాల వరకు ఎయిర్‌పోర్టులో అధికారులు, అనధికారులను కలవనున్నారు.

అనంతరం రోడ్డు మార్గం ద్వారా కల్వరి సమావేశ మందిరానికి 7.30 గంటలకు చేరుకుని కేంద్ర రక్షణమంత్రితో భేటీ అవుతారు. వీరి మధ్య దాదాపు 45 నిమిషాలు భేటీ సాగనుంది.

విశాఖ కేంద్రంగా నౌకాదళం చేపట్టనున్న వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన భూ సేకరణ, ప్రభుత్వ పరమైన అనుమతులు, ఇతరత్రా విషయాలకు సంబంధించిన అంశాలపై ఇరువురి భేటీలో ప్రస్తావనకు వచ్చే అవకాశాలున్నాయి.

భేటీ అనంతరం రాజ్‌నాథ్, జగన్ కలిసి విందులో పాల్గొంటారు. రాత్రి 8.40 గంటలకు తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం నుంచి బయలుదేరి 9 గంటలకు ఎయిర్‌పోర్టుకు చేరుకుని, విజయవాడకు తిరుగుప్రయాణమవుతారు.

మరోవైపు రక్షణ మంత్రి పర్యటన నేపథ్యంలో శనివారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయి.

గాజువాక, కాన్వెంటు కూడలి మధ్య భారీ వాహనాలు, చమురు ట్యాంకర్లు, ఆర్టీసీ బస్సుల రాకపోకలను నిలిపేస్తున్నట్టు ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *