యూకేజీ పిల్లాడి ఏపీ ఎగ్జిట్ పోల్స్‌.. సోషల్ మీడియాలో వైరల్!

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే విషయమై జాతీయ సంస్థల నుంచి రాష్ట్ర స్థాయి వరకు బోలెడు మంది ఎగ్జిట్ పోల్స్ నిర్వహించారు. తాజాగా యూకేజీ పిల్లాడు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించడం వైరల్‌గా మారింది.

ఏపీ ఎన్నికల్లో గెలుపెవరది? జాతీయ సంస్థల నుంచి లగడపాటి రాజగోపాల్‌కు చెందిన ఆర్జీ ప్లాష్ వరకు బోలెడు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించాయి.

కొన్ని సంస్థలు మళ్లీ చంద్రబాబు సీఎం అవుతారని పేర్కొనగా.. మరి కొన్ని మాత్రం జగన్ ప్రభంజనాన్ని అంచనా వేశాయి.

ఈ ఎగ్జిట్ పోల్స్ సంగతి పక్కన బెడితే.. ఏపీలో ఏ జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే విషయమై సామాన్య ప్రజానీకం కూడా లెక్కలు వేసుకుంటున్నారు.

ఇప్పుడు ఆంధ్రాలో ఏ మూలకెళ్లినా.. కాబోయే సీఎం ఎవరనే అంశంపైనే చర్చ నడుస్తోంది.

విజయవాడకు చెందిన యూకేజీ పిల్లోడు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెలువరించడం ఆసక్తికరంగా మారింది.

టీడీపీకి 93 నుంచి 103 స్థానాలు వస్తాయని, మళ్లీ చంద్రబాబు సీఎం అవుతారని ఆ పిల్లాడు అంచనా వేస్తున్నాడు. ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీకి 63 నుంచి 72 సీట్లొస్తాయని చెబుతున్నాడు.

జనసేనకు 0-8 సీట్లు రావచ్చని చెబుతున్నాడు. సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్‌గా మారగా.. నహీద్ అనే ఈ పిల్లాడి తండ్రి షేక్ ఇమ్రాన్ విజయవాడలో ఐరన్ బిజినెస్ చేస్తున్నాడని, నహీద్ కూరపాటి స్కూల్‌లో యూకేజీ చదువుతున్నాడని తెలుస్తోంది.

అంతకు మించి వివరాలేవీ తెలియలేదు.
నహీద్ ఉన్న ఫొటోలో పోస్టర్ ఉండటాన్ని బట్టి.. ఇంట్లో వాళ్ల సాయంతోనే అతడిలా చేశాడని అర్థం అవుతోంది.

ఈ అంచనాలు అతడి సొంతమా లేదంటే ఇంట్లో వాళ్లు తమ అభిప్రాయాలను అతడితో చెప్పించారా? అనేది పక్కనబెడితే.. ఏపీ ఎన్నికల ఫలితాల పట్ల ప్రజల్లో ఆసక్తి ఏ రేంజ్‌లో ఉందో అర్థమవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *