ఢిల్లీకి వస్తానని వణుకు.. బీజేపీ భరతం పడతాం: కేసీఆర్

ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరు చెబితే ఢిల్లీ పీఠాలు కదులుతాయని భయపడుతున్నారని కేసీఆర్ అన్నారు. కేసీఆర్‌ ఢిల్లీకి వస్తారని వణికి పోతున్నారని వ్యాఖ్యానించారు.

లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు 16 మందిని గెలిపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను కోరారు. కేంద్రంలో బీజేపీకి గానీ, కాంగ్రెస్‌కు గానీ మెజార్టీ వచ్చే పరిస్థితి లేదని చెప్పారు.

పాలమూరు జిల్లా నాగర్‌కర్నూల్, వనపర్తి, అమిస్తాన్‌పూర్ (మహబూబ్ నగర్‌)లో ఆదివారం (మార్చి 31) టీఆర్‌ఎస్ నిర్వహించిన బహిరంగ సభల్లో కేసీఆర్ మాట్లాడారు.

ఈ సందర్భంగా బీజేపీపై ఘాటు విమర్శలు చేశారు.

మే 23 తర్వాత ఢిల్లీలో ప్రాంతీయ పార్టీల నాయకత్వమే రాబోతుందని సీఎం కేసీఆర్ చెప్పారు. టీఆర్‌ఎస్ తరఫున 16 ఎంపీలు గెలిస్తేనే కేంద్రం నుంచి నిధులు వస్తాయన్నారు.

పాలమూరు ప్రాజెక్టు పూర్తి కావాలంటే రూ.30 వేల కోట్లు కావాలని.. కేంద్రంలో బలం ఉంటేనే నిధులు వస్తాయని తెలిపారు.

ఎన్నికల తర్వాత ఒక్కో జిల్లాలో 3 రోజులు స్వయంగా వచ్చి ఉంటానని.. ప్రజా దర్బార్‌లో పెట్టి అన్ని సమస్యలను పరిష్కరిస్తానని కేసీఆర్ చెప్పారు.

‘16 మంది ఎంపీలు కొట్టుడుకొడితే దేశ రాజకీయమే మారిపోవాలి. మనకు స్టాలిన్, అఖిలేశ్ లాంటి నేతల బలం ఉంది. బెంగళూరులో నటుడు ప్రకాశ్ రాజ్ మనవైపే ఉన్నారు.

ఎన్నికల ముందు అన్ని విషయాలు బయటకి చెప్పం. నాకు ఉన్న సర్వే ప్రకారం బీజేపీకి 150 సీట్లు దాటవు. కాంగ్రెస్‌కు 100 రావు..’ అని కేసీఆర్ అన్నారు.

మే 23 తర్వాత బీజేపీ భరతం పడతాం: కేసీఆర్

ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరు చెబితే ఢిల్లీ పీఠాలు కదులుతాయని భయపడుతున్నారని కేసీఆర్ అన్నారు. కేసీఆర్‌ ఢిల్లీకి వస్తారని వణికి పోతున్నారని వ్యాఖ్యానించారు.

మహబూబ్‌నగర్‌ సభలో మోదీ ఎన్నో మాట్లాడారని.. కానీ, అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పలేదని విమర్శించారు.

రాష్ట్రంలో బీజేపీ నేతలు ఎక్కువ మాట్లాడుతున్నారని కేసీఆర్ మండిపడ్డారు. సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. బీజేపీ వాళ్లు రాజకీయ హిందువులని.. నిజమైన హిందువులం తామేనని చెప్పారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్.. ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్‌ను ఏదో చేస్తామని మాట్లాడుతున్నారని.. మే 23 తర్వాత తామే బీజేపీ భరతం పడతామని ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 103 స్థానాల్లో డిపాజిట్ గల్లంతైందని ఎద్దేవా చేశారు.

లోక్‌సభ ఎన్నికల్లో 13 స్థానాల్లో డిపాజిట్ రాదని చెప్పారు. బీజేపీ వాళ్లు కేసీఆర్ భరతం పట్టేది ఏమీ లేదని.. తామే వాళ్ల భరతం పడతామని మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *