నేడు ఆర్టికల్ 35-ఎపై సుప్రీంలో విచారణ.. కశ్మీర్‌లో హైఅలర్ట్

పుల్వామా ఆత్మాహుతి దాడితో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. కశ్మీర్ అంతటా ఘర్షణ వాతావరణం నెలకొనగా, సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. దీంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆర్టికల్ 35ఎను రద్దుచేయాలన్న పిటిషన్లపై సుప్రీం విచారణ. జమ్మూ కశ్మీర్‌లో పటిష్ఠ భద్రతను ఏర్పాటుచేసిన కేంద్రం. ముందు జాగ్రత్తగా వేర్పాటువాద నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.

జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తోన్న ఆర్టికల్‌ 35 -ఎ‌ను రద్దుచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం సోమవారం విచారించనుంది. దీంతో జమ్మూ కశ్మీర్‌ అంతటా హైఅల్టర్ ప్రకటించారు.

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 100 కంపెనీ బలగాలను కశ్మీర్ అంతటా మోహరించారు. ఇందులో భాగంగా వేర్పాటువాద నేతలను ముందస్తు అరెస్ట్ చేశారు.

శుక్రవారం అర్ధరాత్రి నుంచి 150 మంది వేర్పాటువాద నేతలను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో జేకేఎల్ఎఫ్ నేత యాసిన్ మాలిక్ సైతం ఉన్నారు.

పుల్వామా ఉగ్రదాడితో వీరందరికి భద్రతను ఉపసంహరించిన విషయం తెలిసిందే. కాగా, ఆర్టికల్ 35 ఎపై జమ్మూ కశ్మీర్‌లో రాజకీయ పార్టీలు రెండు వర్గాలుగా విడిపోయాయి.

గత శాసనసభ ఎన్నికల్లో జమ్మూ ప్రాంతంలో మెజార్టీ స్థానాలను సాధించిన బీజేపీ ఈ ఆర్టికల్‌ను రద్దుకు మద్దతు తెలపగా, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి.

ఆర్టికల్ 35 ఎ ప్రకారం జమ్మూ కశ్మీర్ పౌరులకు కొన్ని ప్రత్యేక హక్కులు, అధికారాలు దఖలుపడ్డాయి. 1954 నాటి రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం. స్థానికేతరులు ఇక్కడ స్థిరాస్తులను కలిగి ఉండటం, కొనుగోలు చేయడం కుదరదు.

అలాగే ఈ రాష్ట్రానికి చెందిన మహిళలు వేరే ప్రాంతాలకు చెందిన వ్యక్తిని వివాహం చేసుకున్నా ఆమె ఆస్తిపై హక్కును కోల్పోతుంది.

ఇది రాజ్యాంగ విరుద్దమని, దీనిని రద్దు చేయాలంటూ చాలా కాలంగా వాదనలు వినిపిస్తున్నాయి. పుల్వామా ఆత్మాహుతి దాడి నేపథ్యంలో ఆర్టికల్ 35ఎపై విచారణకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది.

మరోవైపు, ఆర్టికల్ 35ఎపై రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకోడానికి తమకు అనుమతి ఇవ్వాలని అన్నారు.

ప్రస్తుతం ఎన్నికైన ప్రభుత్వం లేదు కాబట్టి విచారణను వాయిదా వేయాలని ఇటీవలే జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. ఫిబ్రవరి 11న జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టుకు హాజరైన న్యాయవాది షోయబ్ ఆలమ్, వచ్చే విచారణ వాయిదా వేయాలని అభ్యర్థించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *