YSRCP ఎమ్మెల్యేకు.. రూ. 3 కోట్లు లోన్ ఇప్పిస్తామంటూ బురిడీ కొట్టించాలని చూసిన సైబర్ నేరగాళ్ల

YSRCP ఎమ్మెల్యేకు సైబర్ కేటుగాళ్ల మస్కా.. రూ. 3 కోట్లు లోన్ ఇప్పిస్తానని ఫోన్.. చివరికి!
లోన్ ఇప్పిస్తామంటూ బురిడీ కొట్టించాలని చూసిన సైబర్ నేరగాళ్ల పట్ల వైసీపీ ఎమ్మెల్యే ఉషశ్రీ చాకచక్యంగా వ్యవహరించారు.
వైసీపీ ఎమ్మెల్యే సైబర్ నేరగాళ్ల మస్కా
టెక్నాలజీని ఉపయోగించుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.
సామాన్యుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు ఏ ఒక్కరినీ వదలడం లేదు. ఎవరైనా వలలో పడితే ఏకంగా లక్షలు గుంజుతున్నారు.
తాజాగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మహిళా ఎమ్మెల్యేను బురిడీ కొట్టించాలని చూడగా, ఆమె చాకచక్యంగా వ్యవహరించి నేరగాళ్ల ఆటకట్టించారు.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం వైసీపీ ఎమ్మెల్యే ఉషాశ్రీ చరణ్‌కు ఓ ఆగంతకుడి నుంచి ఫోన్ కాల్ వచ్చింది.
పీఎంఈజీపీ రుణాలు ఇప్పిస్తామని ఏకంగా ఎమ్మెల్యేను బురిడీ కొట్టించే ప్రయత్నం చేశాడు.
ఈ పథకం కింద రూ. 3 కోట్ల రుణం ఇప్పిస్తామని మస్కా కొట్టారు. కానీ, రూ. 3 కోట్లు రావాలంటే తొలుత రూ. 2 లక్షలు డిపాజిట్ చేయాలని షరతు విధించారు.
అయితే వారి మాటలపై అప్పటికే ఎమ్మెల్యేకు అనుమానం రావడంతో చాకచక్యంగా వ్యవహరించారు. సైబర్ నేరగాడి అకౌంటర్ నంబర్ తీసుకున్నారు.
అలాగే అతడి వివరాలు సేకరించేందుకు ప్రయత్నించారు. అనంతరం ఈ విషయం తెలుసుకునేందుకు పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులను సంప్రదించారు.
అయితే ఇలాంటి ఫోన్ కాల్స్ తాము చేయబోమని స్పష్టం చేశారు. దీంతో ఇది పక్కా మోసమని తేలటంతో ఎమ్మెల్యే ఉషశ్రీ కళ్యాణదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు.
ఏకంగా ఎమ్మెల్యేను బురిడీ కొట్టించాలని చూసిన ఆగంతకుడి ఫోన్ నెంబర్, బ్యాంకు ఖాతా వివరాలను సేకరించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని, త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.