టైమ్ ఎందుకో, మైత్రీ మూవీస్తో ఆడుకుంటున్నట్లు కనిపిస్తోంది

మైత్రీమూవీస్.. టాలీవుడ్ లోకి సర్రున దూసుకువచ్చిన నిర్మాణ సంస్థ.

చకచకా బ్లాక్ బస్టర్ లు కొట్టిన సంస్థ. కానీ ఇప్పుడు ఆ సంస్థకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు కనిపిస్తోంది. చకచకా సినిమాలు చేసేయాలన్న ప్రయత్నం, కాంబినేషన్లు సెట్ చేసేసుకోవాలన్న గాభరా అన్నీకలిసి ఆ సంస్థను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు కనిపిస్తోంది.

ప్రేమమ్ హిట్ అవ్వగానే, ముందువెనుక చూడకుండా చందు మొండేటితో సినిమా స్టార్ట్ చేసేసారు. మళ్లీ సేమ్ కాంబినేషన్ క్రేజ్ చూసుకున్నారు. సబ్జెక్ట్, స్టామినా చూసుకోలేదు. మైత్రీకి భయంకరమైన తొలిదెబ్బ తగిలింది అక్కడే.

శ్రీనువైట్ల స్టామినా ఏ మేరకు మిగిలివుందో చూడకుండా రవితేజతో సినిమా అంటూ ముందుకు వెళ్లారు. కథను, సినిమా ఎలా వస్తోందో చూసుకోలేదు.

ఫలితం మరో డిజాస్టర్. పవన్ కళ్యాణ్ తో సినిమా అనుకున్నారు. అడ్వాన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి వెళ్లిపోయారు. ఇక ఆ సినిమా లేనట్లే అనుకోవాలి.

త్రివిక్రమ్-మహేష్ బాబు సినిమా ప్లాన్ చేసారు. త్రివిక్రమ్ కు అడ్వాన్స్ ఇచ్చారు. కానీ కారణాలు ఏవైనా త్రివిక్రమ్-మహేష్ కాంబినేషన్ వుండకపోవచ్చని టాక్.

ఆ విధంగా మైత్రీకి అక్కడా చుక్క ఎదురయినట్లే. బోయపాటికి అడ్వాన్స్ ఇచ్చారు. ఇప్పుడు బోయపాటి లైన్ అంత బాగాలేదు.

హీరోలు ఎవరు డేట్ లు ఇస్తారో? అన్నది అనుమానం. మైత్రీకి అక్కడా కష్టమే.

ఇకపోతే… రంగస్థలం సినిమా ఓ బ్లాక్ బస్టర్. కానీ రంగస్థలం సినిమా మేకింగ్ కు ఎంత టైమ్ పట్టింది. మంచి సినిమా కాబట్టి సరిపోయింది. లేదూ అంటే పరిస్థితి ఏమిటి అన్నది ఆలోచించలేదు.

వెంటనే సుకుమార్ ను గారాబం చేయడం ప్రారంభించేసారు. ఆయనతో మరో సినిమా. ఆయన అసిస్టెంట్ తో సినిమా.

కానీ ఇప్పుడేమయింది. సుకుమార్ సకాలంలో స్క్రిప్ట్ రెడీ చేయలేకపోయారు. మహేష్ తో సినిమా దాదాపు వెనక్కు పోయినట్లే. తరువాత వుండొచ్చు. కానీ ఖర్చులు పెరిగిపోతాయిగా? ఇదే సుకుమార్ ముఫై మూడు పనులు పెట్టుకోకుండా, కేవలం మహేష్ స్క్రిప్ట్ మీదే దృష్టిపెట్టి వుంటే పరిస్థితి వేరేగా వుండేదని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

మూడు ప్రాజెక్టులు ప్లాన్ చేస్తూ, మరో మూడు ప్రాజెక్టులు ఆలోచిస్తూ వున్న వ్యక్తి, తన స్వంత సినిమాకు కథ మీద ఎక్కడ దృష్టి పెట్టగలరు అన్నది పాయింట్.

మొత్తంమీద పాపం, టైమ్ ఎందుకో, మైత్రీ మూవీస్ తో ఆడుకుంటున్నట్లు కనిపిస్తోంది.

డియర్ కామ్రేడ్, చిత్రలహరి, నాని-విక్రమ్ కుమార్ సినిమాలు మంచి సక్సెస్ కావాలి. మైత్రీ మూవీస్ మళ్లీ తన విజయ పతాక రెపరెపలాడించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *