ఇది పాక్ ఉగ్రవాదులకు చావు దెబ్బ

పీవోకే వెంబడి ఉన్న ఉగ్రవాద శిబిరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దళాలు విరుచుకుపడటంతో.. జైషే మహ్మద్ ఉగ్రవాద మూకలకు చావు దెబ్బ తగిలినట్టుగా తెలుస్తోంది.

ఐఏఎఫ్ మిరాజ్ విమానాలు ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని నిప్పుల వర్షాన్ని కురిపించడంతో కనీసం రెండు నుంచి మూడువందల మంది ఉగ్రవాదులు హతమై ఉండవచ్చని భారత సైన్యం అంచనా వేస్తోంది.

పీవోకేలో ఉగ్రవాద శిబిరాలను గుర్తించడం మరీ కష్టం అయిన పనేంకాదు.

భారత గూఢచారి వ్యవస్థకు అది తేలికైన పనే. అయితే ఇన్నాళ్లూ వైమానిక దాడులు చేసిందిలేదు.

కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి.. పాక్ ఆక్రమిత ప్రాంతంలోని గగనతలం మీదకు కూడా ఇండియా యుద్ధ విమానాలు ఏవీ వెళ్లలేదు.

ఆఖరిసారి కార్గిల్ వార్ సమయంలో భారత యుద్ధ విమానాలు సరిహద్దును దాటాయి. ఆ తర్వాత ఉగ్రవాదాన్ని భూతల పోరులో మాత్రమే భారత్ ఎదుర్కొంటూ వచ్చింది.

ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడు భారత యుద్ధ విమానాలకు కాస్త పనిదొరికింది. కేవలం ఇరవై ఒక్క నిమిషాల ఆపరేషనే అయినా.. ఇది ఉగ్రవాద మూకలకు చావుదెబ్బ అని చెప్పవచ్చు.

తాపీగా ఉగ్రవాద శిబిరాల్లో ఉన్న వారి అంతును చూసింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్.అయితే పాకిస్తాన్ మాత్రం తమకు ఏం నష్టం జరగలేదని అంటోంది. తేలుకుట్టిన దొంగలా ఉంది పాకిస్తాన్ పరిస్థితి.

ఉగ్రవాద శిబిరాలు నాశనం అయ్యాయని అనలేదు. తాము ఉగ్రవాదులకు ఆశ్రయమే ఇవ్వలేదు అనేవాళ్లు ఇప్పుడు ఉగ్రవాద శిబిరాలు నాశనం అయ్యాయని చెప్పుకోలేరు కదా.

భారత యుద్ధ విమానాలు తమ గగనతలంలోకి ప్రవేశించింది నిజమేకానీ.. తమ వైమానికదళం ప్రతిఘటించగా.. అవి తిరిగి వెళ్లిపోయాయని పాక్ ప్రకటించుకుంటోంది.

అయితే ఇలాంటి దాడులు మరిన్ని చేపట్టి.. ఎల్వోసీ వెంబడి ఉన్న ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా నిర్వీర్యం చేయాల్సిన అవసరం భారత్ కు ఎంతైనా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *