మూడో సారి పోరుకు సిద్ధమౌతున్న దెందులూరు టిడిపి అభ్యర్థి

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు లోక్‌సభ పరిధిలోని దెందులూరు నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా వర్ధిల్లుతోంది. 2009, 2014 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు విజయం సాధించిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మూడోసారి పోరుకు సిద్ధమవుతున్నారు.
ఎలాగైనా ఈసారి గెలిచి హ్యాట్రిక్ విజయం నమోదు చేయాలని ఆయన గట్టి పట్టుదలతో ఉన్నారు. నియోజకవర్గ చరిత్ర గనుక ఒకసారి పరిశీలిస్తే ఈ నియోజకవర్గం 1953లో ఏర్పడింది.
అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉప ఎన్నికలతో కలుపుకుని మొత్తం 14సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ ఏడుసార్లు విజయం సాధించగా టీడీపీ ఆరుసార్లు దక్కిచుకుంది. ఒకసారి స్వతంత్ర అభ్యర్థి విజయం సొంతం చేసుకున్నాడు.
నియోజకవర్గం ఎక్కువగా వ్యవసాయాధారిత ప్రాంతంగా చెప్పుకోవచ్చు. దీంతో నియోజకవర్గంలో వారి జనసాంద్రతే అధికం.
ఇక నియోజకవర్గంలో రెండు లక్షల 12వేల పైచిలుకు ఓటర్లు ఉండగా స్వల్ప తేడాతో మహిళా ఓటర్లే అధికంగా ఉండటం గమనార్హం.
నియోజకవర్గం పరిధిలోకి ఏలూరు రూరల్, పెదవేగి, పెదపాడు, దెందులూరు మండలాలు వస్తాయి.
ఎమ్మెల్యే చింతమనేని రౌడీలా వ్యవహరిస్తున్నారన్న ప్రతిపక్షాలు ఆయనపై తరుచూ విమర్శలు చేస్తూ వస్తున్నాయి.
ఇక అధికారులతోనూ..పార్టీ ద్వితీయశ్రేణి నేతలతోనూ ఆయన వ్యవహరించే తీరుపై కొంత విమర్శలున్న మాట వాస్తవమే. ఇక చంద్రబాబు ఆయనకు టికెట్ ఇచ్చే ఆలోచనలో లేడని ప్రచారం బలంగా జరిగింది
చంద్రబాబే స్వయంగా ఇక్కడి నుంచి పోటీకి సిద్ధపడుతున్నాడు అనే విశ్లేషణలు వెలుగులోకి రావడం గమనార్హం.
అయితే చివరికి మళ్లీ చింతమనేనికే టికెట్ కన్ఫామ్ కావడంతో ఈసారి బరిలోకి దిగారు.
ఇక వివాదాస్పదుడిగా ముద్రను తొలగించుకుని జనం చేత జేజేలు కొట్టించుకుని చంద్రబాబు ఎదుట మిస్టర్ పర్‌ఫెక్ట్ ఎమ్మెల్యేగా నిలవాలని చింతమనేని ఉవ్విళ్లూరుతున్నారు.
అయితే వైసీపీ మాత్రం రౌడీలా వ్యవహరించే నాయకుడు కాదు అభివృద్ధిని సాధించుకునే వ్యక్తి..జనంను కలుపుకూపోయే వ్యక్తి మనకు ఎమ్మెల్యేగా ఉండాలని, అందుకు వైసీపీ అభ్యర్థిని గెలిపించాలని ప్రచారం సాగిస్తోంది.
ఇలా రెండు పార్టీలు ప్రత్యారోపణలు..ప్రచారస్త్రాలతో వేడి పుట్టిస్తున్నారు. ఎవరు గెలుస్తారు..? ఎవరు ఓడుతారనేది మరికొద్ది రోజులు ఆగితే గాని తెలియదు మరి.