ఫలించిన కేటీఆర్ దౌత్యం.. డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక ఏకగ్రీవం

తెలంగాణ శాసనసభలో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవానికి అధికార టీఆర్ఎస్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి.

ఈ విషయంలో ప్రతిపక్ష కాంగ్రెస్‌ను వెనక్కు తగ్గేలా చేయడంలో కేటీఆర్ సఫలమయ్యారు.

తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నామినేషన్ల గడువు శనివారంతో ముగిసింది.

ఆ సమయానికి పద్మారావు గౌడ్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక లాంఛనమైంది.

అంతేకాదు, డిప్యూటీ స్పీకర్ ఎన్నికపై ఏకాభిప్రాయ సాధనకు అధికార పార్టీ చేసిన ప్రయత్నాలు ఫలించాయి.

ఈ మేరకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సోమవారం అధికారికంగా ప్రకటించారు.

అనంతరం పద్మారావుగౌడ్‌ను సీఎం కేసీఆర్, ప్రతిపక్ష సభ్యులు కలిసి తీసుకెళ్లి సీట్లో కూర్చొబెట్టారు.

ఈ సందర్భంగా పద్మారావుగౌడ్‌కు స్పీకర్ పోచారం, సీఎం కేసీఆర్, ఇతర సభ్యులు అభినందనలు తెలియజేశారు.

డిప్యూటీ స్పీకర్ ఎన్నికలో భాగంగా శనివారం నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసే సమయానికి పద్మారావు గౌడ్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమైంది.

రెండుసార్లు కార్పొరేటర్‌గా ఎన్నికైన పద్మారావు గౌడ్, ప్రత్యేక రాష్ట్రం సాధన కోసం కేసీఆర్ ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ పార్టీలో 2001లో చేరారు. తర్వాత, 2004 ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి టీఆర్‌ఎస్ తరపున పోటీచేసి విజయం సాధించారు.

అయితే, 2009 ఎన్నికల్లో సనత్‌నగర్ నుంచి పోటీ చేసిన పద్మారావు గౌడ్.. కాంగ్రెస్ అభ్యర్థి మర్రి శశిధర్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు.

2014 ఎన్నికల్లో మళ్లీ సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి గెలుపొందిన పద్మారావు, గత కేబినెట్‌లో ఎక్సైజ్, అబ్కారీ మరియు క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రిగా పని చేశారు.

ఇటీవల జరిగిన ముందస్తు ఎన్నికల్లోనూ అదే స్థానం నుంచి మరోసారి విజయం సాధించారు.

ఉమ్మడి రాష్ట్రంలో కల్లు దుకాణాలను ప్రభుత్వం మూసివేయడంతో దానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు.

పద్మారావుగౌడ్‌కి స్వరూప రాణితో వివాహం జరిగింది. వీరికి నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *