ఎన్నికల ఫలితం మన వైపే.. గెలుపు మనదే: చంద్రబాబు

టీడీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో గురువారం ఉదయం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాబోయే ఎన్నికల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

వచ్చే ఎన్నికలు ఏకపక్షంగా సాగుతాయని, గెలుపు టీడీపీదేనన్న చంద్రబాబు.పార్టీ ఫిరాయింపులపై తనదైన శైలిలో స్పందించిన చంద్రబాబు.ఫించన్లు, పసుపు-కుంకుమ, అన్నదాత సుఖీభవ పథకాలే హైలట్ అంటూ వ్యాఖ్యలు.

టీడీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో గురువారం ఉదయం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాబోయే ఎన్నికలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.

అంతేకాదు, ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలతో రాబోయే ఎన్నికలు ఏకపక్షంగా సాగుతాయని, గెలిచేది టీడీపీయేనని వ్యాఖ్యానించారు.

వృద్ధులు, వితంతువులకు ఏడాదికి రూ. 24 వేలు, పసుపు – కుంకుమ కింద మహిళలకు ఇచ్చే రూ. 20 వేలు, అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి ఇవ్వనున్న రూ. 10 వేలు అద్భుతమైనవని, వచ్చే ఎన్నికల్లో ఇవే గెలిపిస్తాయని అన్నారు.

ఎన్నికల ముందే కూటమి ఏర్పాడాల్సిన అవసరం ఉందని, దీనిపై జాతీయ పార్టీల నేతలతో చర్చిస్తున్నామని తెలిపారు.ఈవీఎంలపై సుప్రీంకోర్టుకు వెళ్తామని, ఎన్నికలకు ముందే బీజేపీయేతర పక్షాల కూటమి ఏర్పడుతుందని బాబు వెల్లడించారు.

కనీస ఉమ్మడి కార్యక్రమంతో ముందుకెళ్తున్నామని, అత్యధిక ఎంపీ స్థానాలు గెలిచిన పార్టీని రాష్ట్రపతి పిలిచే అవకాశం ఉందని సీఎం చెప్పుకొచ్చారు. బీజేపీకి మెజార్టీ రాకున్నా ప్రభుత్వం ఏర్పాటు చేస్తారనే ఉద్దేశంతోనే ఎన్నికల ముందే పొత్తు ఉంటుందని ఈ సందర్భంగా చంద్రబాబు స్పష్టం చేశారు.

బీజేపీపై వ్యతిరేకత ఉన్నా ఈవీఎంలను మేనేజ్‌ చేసే అవకాశముందని సీఎం తెలిపారు.
రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు మెచ్చుకుంటున్నారని, వీటికి విశేష స్పందన వస్తోందని అన్నారు. అలాగే పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యేల గురించి కూడా టెలీకాన్ఫరెన్స్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలోకి వచ్చేవారు వస్తుంటారని, పోయేవారు పోతుంటారని, అవకాశవాదులకు టీడీపీలో స్థానం లేదని బాబు హెచ్చరించారు.

రైతులకు సాయం చేసే విషయమై కేంద్రం పలు షరతులను విధించిందని, దానికన్నా మెరుగ్గా మన ప్రభుత్వం సాయం చేయనుందని వెల్లడించారు. ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమాన్ని విడిచిపెట్టలేదని, కాపులకు రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత కూడా టీడీపీదేనని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *