బాబు చేసిన తప్పు.. 40 సీట్లకు ఎసరు

అధికార టీడీపీకి చుక్కలు కనిపిస్తున్నాయి. ఒక్కరొక్కరు టీడీపీని వీడి ప్రతిపక్ష వైసీపీలో చేరుతుండడం ఆ పార్టీని కృంగదీస్తోంది. అధికారంలోకి వచ్చిన కొత్తలో టీడీపీ ప్రలోభాలకు ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారు. 

ప్రతిపక్ష వైసీపీని దెబ్బతీయడానికి ఆ పార్టీ నుంచి ఇబ్బడి ముబ్బడిగా ఎమ్మెల్యేలను లాగి వారికి మంత్రి పదవులు ఇచ్చి బలపడిన టీడీపీకి ఇప్పుడు వారే గుదిబండగా మారడం విశేషం.

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరుగుతుందని భావించి టీడీపీ అధినేత చంద్రబాబు దాదాపు 25 మంది వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలోకి లాగారు.వీరేకాక.. సీనియర్ వైసీపీ కాంగ్రెస్ బీజేపీ నేతలను చేర్చుకున్నారు.

వారికే సర్వాధికారాలు ఇచ్చారు. ఇప్పుడు ఇతర పార్టీల నుంచి టీడీపీలోకి వచ్చిన వారంతా మరోసారి తమకే సీట్లను కన్ఫం చేసుకుంటున్నారు.

ఆయా నియోజకవర్గాల్లో వీరి చేతిలో ఓడిన టీడీపీ నేతలు తమకు టికెట్ దక్కదని తెలిసి వైసీపీ బాట పడుతున్నారు. టికెట్లు దక్కవనే అభద్రతా భావం.. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సీట్లు పోతాయనే భయంతో వారంతా మూకుమ్మడిగా టీడీపీని వీడి వైసీపీలోకి క్యూ కడుతున్నారు.

వీరంతా బలమైన నేతలే కావడంతో వైసీపీ కూడా ఆహ్వానిస్తూ చేర్చుకుంటోంది. 

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీని సీట్ల గోల షేక్ చేస్తోంది. వలసవచ్చిన నేతలతో తమకు సీట్లు దక్కవని సొంత టీడీపీ నేతలు పార్టీ మారుతున్నారు.

తాజాగా కర్నూలు సీటుపై పంచాయతీతో ఈ వివాదం బయటపడింది.

కర్నూలులో వైసీపీ తరుఫున గెలిచిన ఎస్వీ మోహన్ రెడ్డి చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్ కు టీడీపీలో చేరిపోయారు.

ఇదే కర్నూలులో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఎస్వీ మోహన్ రెడ్డి చేతిలో ఓడిన టీజీ వెంకటేశ్ తదనంతర కాలంలో టీడీపీ తరుఫున రాజ్యసభ ఎంపీగా వెళ్లిపోయారు.

ఇప్పుడు ఎన్నికల వేళ కర్నూలు అసెంబ్లీ సీటు కోసం వీరిద్దరూ సిగపట్లు పట్టుకుంటున్నారు.

టీజీ వెంకటేశ్ సీనియర్ నేత కావడం.. ఎస్వీ మోహన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే కావడంతో ఈ సీటును ఎవరికి ఇవ్వాలో తెలియక టీడీపీ అధిష్టానం తలలు పట్టుకుంటోంది. 

చంద్రబాబు చేసిన తప్పిదం వల్ల అటు మోహన్ రెడ్డి.. ఇటు టీజీ వెంకటేశ్ వర్గాలు ఇప్పుడు కర్నూలులో కొట్టుకుంటున్నాయి.

ఎవ్వరికి సీటు ఇచ్చినా ఇక్కడ ఊరుకునేది లేదని.. ఓడిస్తామని చంద్రబాబును ఇరు వర్గాలు హెచ్చరిస్తున్నాయి. 

ఎన్నికల ముందర ఈ వ్యవహారం కర్నూలుకే పరిమితం కాలేదు. చంద్రబాబు కు రాష్ట్రవ్యాప్తంగా సొంత టీడీపీ నేతల నుంచి ఇవే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

కర్నూలుతోపాటు ఫిరాయించిన ప్రతి చోటా టీడీపీ నేతలు ఫిరాయింపు దారుల మధ్య టికెట్ల పంచాయతీ పీక్ స్టేజ్ కు చేరింది.

అనంతపురం జిల్లా కదిరి కడప జిల్లా బద్వేలు జమ్మలమడుగు కడప లోక్ సభ సీటుకు కూడా ఇలానే ఇరు వర్గాలు పోట్లాడుకుంటున్నాయి.

చంద్రబాబు ఎవ్వరికి టికెట్ ఇచ్చినా మరొకరు పార్టీ మారడమో.. వ్యతిరేకంగా వ్యవహరించడమో చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

రాష్ట్ర వ్యాప్తంగా 40నుంచి 50 సీట్లలో టీడీపీ ఓటమికి ఇదే కారణమవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *