భూమి గుండ్రంగానే వుంటుంది బాబూ

తనదాకా వస్తేకానీ తెలియదు. అప్పుడు తత్వం బోదపడి సుభాషితాలు బయటకు వస్తాయి. ఇలాచేయడం అన్యాయం, విశ్వాసఘాతకం లాంటి మాటలు బయటకు వస్తున్నాయి.

అధికారం చేతికి అందిన కొత్తల్లో వైకాపా నుంచి ఎడాపెడా జనాలను లాగేసారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు తెలుగుదేశంలోకి క్యూలు కట్టేసారు.

తెలుగుదేశం అనుకూల మీడియా అప్పట్లో తెగ వార్తలు రాసేసింది. ఇక ఏం లేదు జగన్ దుకాణం మూసుకోవాల్సిందే అంటూ. కానీ అసలు వాస్తవాలు రాజకీయ వర్గాలకు తెలుసు. రాజకీయ నాయకులైన వారికి వ్యాపారాలు వుంటాయి.

అవసరాలు వుంటాయి. ఆర్థిక సమస్యలు వుంటాయి. వాటి ప్రాతిపదికగా జనం చంద్రబాబు వైపు వెళ్లకతప్పలేదు. ఇలా వెళ్లిన వారు చాలా మంది జగన్ కు తాము ఎందుకు వెళ్తున్నామో చెప్పే వెళ్లడం విశేషం.

కానీ ఇప్పడు మళ్లీ టైమ్ వచ్చింది. వెళ్లిన వాళ్లంతా తెలుగుదేశంలో వుండగా, అక్కడివాళ్లు ఇప్పడు ఇటు రావడం మొదలైంది. దీంతో బాబుగారికి, ఆయన అనుకూల మీడియాకు తెగ బాధ వచ్చి పడిపోయింది.

‘ఇలా వస్తారు.. అలా వెళ్తారు.. వీళ్ల కోసం నేను పనిచేయాలా? మీ కోసం పనిచేయాలా? అంటూ జనాన్ని అడగుతున్నారు’. మరి జగన్ పరిస్థితి కూడా ఇదే అనుకోవచ్చుగా.. జనం కోసమా, వీళ్లకోసమా అని.

ఇక తెలుగుదేశం అనుకూల మీడియా అయితే జంపింగ్ జపాంగ్ లు, అలవి కాని కోర్కెలు కోరి, తీర్చలేదనే సాకుచూపించి వెళ్తున్నారు అంటూ రాతలు మొదలుపెట్టేసారు.

మరి గతంలో కలిగిన ఆనందం ఇప్పుడు ఆవేదనగా ఎందుకు మారిపోయిందో? అంటే తెలుగుదేశం పార్టీ నుంచి వలసలు ప్రారంభమైతే అది అన్యాయం, కుట్ర. అదే వైకాపా నుంచి వలసలు అయితే దుకాణం బంద్.

జనాలు అంతా గమనిస్తున్నారు. ఈ అను’కుల’ మీడియా కబుర్ల వల్లే తెలుగుదేశం పార్టీకి ఈ పరిస్థితి వస్తోందని బాబు ఎప్పటికి తెలుసుకుంటారో?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed