వాటికి ఆధార్-పాన్ అనుసంధానం తప్పనిసరి మరోసారి స్పష్టంచేసిన సుప్రీంకోర్టు

ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలకు ఆధార్, పాన్ అనుసంధానం తప్పనిసరేనని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది.
ఈ విషయంలో ఇప్పటికే తాము నిర్ణయం తీసుకున్నామని.. ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదని జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
ఆధార్-పాన్ అనుసంధానం లేకుండా ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసుకునేందుకు శ్రేయా సేన్, జయశ్రీ అనే మహిళలకు దిల్లీ హైకోర్టు గతంలో అనుమతినిచ్చింది.
ఈ తీర్పును సవాల్ చేస్తూ కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై నేడు విచారణ చేపట్టిన న్యాయస్థానం పై విధంగా తీర్పు చెప్పింది. ‘ఆధార్-పాన్ అనుసంధానంపై సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్‌లో ఉండగా దిల్లీ హైకోర్టు ఆ తీర్పు వెల్లడించింది. దీంతో ఆ ఇద్దరు మహిళలు ఆధార్-పాన్ అనుసంధానం లేకుండానే 2018-19 అసెస్‌మెంట్ సంవత్సరానికి గానూ ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేశారు.
ఇందుకు సంబందించిన ప్రక్రియ కూడా పూర్తయ్యింది. అయితే ఆ తర్వాత సుప్రీంకోర్టు దీనిపై ఓ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు అందులో ఎలాంటి మార్పు ఉండదు. 2019-20 అసెస్‌మెంట్ సంవత్సరానికి గానూ తప్పనిసరిగా ఆధార్-పాన్ అనుసంధానంతోనే ఐటీ రిటర్నులు దాఖలు చేయాలి’ అని ధర్మాసనం పేర్కొంది.
ఆధార్ అనుసంధానంపై గతేడాది సెప్టెంబరులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే.
ఆధార్ రాజ్యంగబద్ధమైనదేనని, అయితే అన్ని సేవలకు దాన్ని అనుసంధానం చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. మొబైల్ ఫోన్లు, బ్యాంకు ఖాతాలు, స్కూల్ అడ్మిషన్లు, టెలికాం కంపెనీలు తదితర వాటికి ఆధార్ తప్పనిసరి కాదని తెలిపింది.
అయితే ఐటీ రిటర్నులు, పాన్ కార్డులకు మాత్రం ఆధార్ నంబరును అనుసంధానం చేయాల్సిందేనని కోర్టు వెల్లడించింది.