మరుపురాని పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిన…అతిలోక సుందరి భూలోకం విడిచి ఏడాది

అతిలోక సుందరి భూలోకం విడిచి ఏడాది
మరుపురాని పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు శ్రీదేవి.తెలుగులో 85, హిందీలో 71, తమిళంలో 72, మళయాళంలో 26, కన్నడంలో 6 చిత్రాల్లో నటించి సుమారు ఐదు దశాబ్దాల పాటు తన నటనతో, మరుపురాని పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు శ్రీదేవి.

జామురాతిరి జాబిలమ్మ శ్రీదేవికి ఆ దేవుడు శాశ్వతంగా జోలపాడి నేటితో ఏడాది పూర్తైంది. ఫిబ్రవరి 24న దుబాయ్‌లోని ఎమిరేట్ టవర్స్‌లో తీవ్ర గుండెనొప్పితో మరణించిన అతిలోక సుందరి శ్రీదేవి (54) తిరిగిరాని లోకాలకు చేరిందనే వార్త యావత్ సినీ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసిన విషయం తెలిసిందే.

ఆ అతిలోక సుందరిని స్మరించుకుంటూ ఆమె మూవీ జర్నీ మీకోసం..

1963 ఆగస్ట్ 13న తమిళనాడులోని శివకాశిలో జన్మించారు శ్రీదేవి. ఈమె అసలు పేరు శ్రీ అమ్మయంగర్ అయ్యప్పన్. తల్లి రాజేశ్వరి, తండ్రి అయ్యప్పన్. శ్రీదేవి తల్లి తిరుపతికి చెందిన తెలుగు వ్యక్తి.

శ్రీదేవి నాలుగో ఏట ‘తునైవన్’ అనే తమిళ సినిమాతో బాలనటిగా ఎంట్రీ ఇచ్చారు.

తెలుగులో బాలనటిగా ‘మా నాన్న నిర్దోషి’, హిందీలో ‘జూలీ’, కన్నడలో ‘భక్త కుంబర’ చిత్రాలతో పరిచయం అయ్యారు. 13 ఏళ్ల వయసులో ‘మూండ్రు ముడిచ్చు’ చిత్రంతో హీరోయిన్‌గా తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు.

తెలుగులో నాయికగా ‘అనురాగాలు’ చిత్రంలో అంధురాలిగా నటించి మెప్పించారు. హిందీలో ‘సాల్వ సావన్’ చిత్రంతో బాలీవుడ్‌కి పరిచయం అయ్యారు.

ఇలా తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో అనతికాలంలోనే టాప్ హీరోయిన్ రేంజ్‌కి ఎదిగి అత్యధిక పారితోషికం తీసుకునే నాయికగా శ్రీదేవి చరిత్ర సృష్టించారు.
జగదేక వీరుడు అతిలోక సుందరిలో శ్రీదేవి

‘పదహారేళ్ల వయసు’తో శ్రీదేవి తెలుగు సినిమా రంగంలోకి ప్రవేశించారు.

కొద్దికాలంలోనే అగ్రశ్రేణి హీరోయిన్‌గా మారారు. టాలీవుడ్‌లో ఉన్న ఎన్టీఆర్, ఏఎన్నార్, క్రిష్ణ, శోభన్ బాబు, క్రిష్ణంరాజు, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున అందరు అగ్ర కథానాయకులతో కలసి నటించారు. అయితే బాలయ్యతో శ్రీదేవి జోడీ కట్టలేదు.

అతిలోక సుందరిగా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న శ్రీదేవి తన నటనతో ఎన్నో అవార్డులు, ప్రశంసల్ని అందుకున్నారు. భారత ప్రభుత్వం 2013లో అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీతో సత్కరించింది.

శ్రీదేవి తన సినీ కెరీర్‌లో 14 సార్లు ఫిలింఫేర్‌కు నామినేట్ కాగా… నాలుగు సార్లు ఉత్తమనటిగా, రెండుసార్లు స్పెషల్ జ్యూరీ లభించాయి.

1996లో జూన్‌లో బోనీకపూర్‌ను శ్రీదేవి వివాహం చేసుకున్నారు. వీరికి జాన్వి, ఖుషీ ఇద్దరు కుమార్తెలు సంతానం.

వివాహం అనంతరం సినిమాకు బ్రేక్ ఇచ్చిన శ్రీదేవి 2012లో ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చారు. తమిళంలో ‘పులి’, హిందీలో ‘మామ్’ ఆమెకు చివరి చిత్రాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *