టీడీపీ సీనియర్ నేత, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర…అప్పుడు ఎన్టీఆర్‌ది.. ఇప్పుడు వైఎస్సార్ వంతు..ప్రభుత్వం కులాల పేరుతో రైతులను విడగొట్టాలని చూస్తోందంటూ ఆరోపణలు గుప్పించారు…

అప్పుడు ఎన్టీఆర్‌ది.. ఇప్పుడు వైఎస్సార్ వంతు..

రైతు భరోసా పథకం పేరుతో ప్రభుత్వం కులాల వారీగా రైతులను విడగొట్టాలని చూస్తోందంటూ టీడీపీ నేతలు తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు.

రైతు భరోసా పథకంపై టీడీపీ సీనియర్ నేత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏపీలో రాజకీయం ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. రాష్ట్రంలో 151 సీట్ల బంపర్ మెజర్టీతో వైఎస్సార్సీపీ అధికారం చేజిక్కించుకోగా అధికార టీడీపీ కేవలం 23 సీట్లతో ప్రతిపక్షానికి పరిమితమైంది.

అప్పటి నుంచి కాస్త స్తబ్దుగా ఉన్న తమ్ముళ్లు ఇప్పుడిప్పుడే గొంతు సవరించుకుని ప్రభుత్వ విధానాలపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు.

ప్రభుత్వం ఆర్భాటపు ప్రకటనలకే పరిమితమవుతోందని, ఆచరణలో చతికిలపడుతోందంటూ ఎద్దేవా చేస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రైతు భరోసా పథకంపైనా టీడీపీ విమర్శల దాడి చేస్తోంది.

రైతు భరోసా పథకానికి అర్హుల ఎంపికపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది.

టీడీపీ సీనియర్ నేత, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర ఒకడుగు ముందుకేసి తీవ్ర ఆరోపణలు చేశారు.

ప్రభుత్వం కులాల పేరుతో రైతులను విడగొట్టాలని చూస్తోందంటూ ఆరోపణలు గుప్పించారు.

అదే సమయంలో రైతు భరోసా పథకాన్ని చూసి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మ క్షోభిస్తోందంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది.

ఎన్టీఆర్ పేరును వైఎస్సార్సీపీ నేతలు వల్లెవేసేవారు. సొంతమామను వెన్నుపోటు పొడిచి అధికారాన్ని లాక్కున్నారని విమర్శలు చేసేవారు.

ఎన్టీఆర్‌ వ్యక్తిగత జీవితాన్ని బూచిగా చూపి పార్టీని, సీఎం పీఠాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుని ఆయన మరణానికి కారణమయ్యారని, ఆయన ఆత్మ క్షోభిస్తోందన్న విమర్శలు వినిపించేవి.

అయితే ఇప్పుడు సీన్ రివర్సైంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్సార్సీపీ నేతలు చూపిన బాటలోనే తెలుగు తమ్మళ్లు నడుస్తున్నారు. ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు సీఎం జగన్ తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పేరును తెగ వాడేస్తున్నారు.

రైతు భరోసా పథకం అమలు చేస్తున్న తీరును చూసి వైఎస్సార్ ఆత్మ క్షోభిస్తోందంటూ విమర్శలు చేస్తున్నారు.

దీంతో గతంలో వైఎస్సార్సీపీ నేతలు ఎన్టీఆర్‌ ఆత్మ క్షోభిస్తోందంటూ చేసిన వ్యాఖ్యలను గుర్తుకు తెస్తున్నారు. ఇదంతా చూస్తే ప్రస్తుతం ఎన్టీఆర్ వంతు పోయి వైఎస్సార్ వంతు వచ్చినట్లుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *