విశాఖలో టీడీపీ సీన్ రివర్స్.. వైసీపీకే మెజారిటీ

ఉత్తరాంధ్రకు గుండెకాయలాంటి జిల్లా విశాఖపట్నం జిల్లాలో రాజకీయ పరిణామాలు వారం రోజుల్లోనే శరవేగంగా మారిపోయాయి. నిన్నటి వరకు సాగర తీరం మొత్తం టీడీపీ వైపే ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి.
అయితే ఎన్నికల హీట్ స్టాట్ అవ్వడంతో పాటు ఎన్నికలకు మరి కొద్ది గంటల సమయం మాత్రమే ఉన్న టైమ్‌లో వేవ్ వైసీపీకి క్రమక్రమంగా టర్న్ అవుతూ వచ్చింది.
జిల్లాలో ఉన్న 15 అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలకు గత ఎన్నికల్లో వైసీపీ 3 అసెంబ్లీ సీట్లతో పాటు అరుకు ఎంపీ స్థానానికే మాత్రమే పరిమితం అయ్యింది.
వైసీపీ గెలుచుకున్న 3 అసెంబ్లీ స్థానాలు ఏజన్సీలోనివే. ప్రస్తుతం టీడీపీ సీన్ రివర్స్ అవ్వడంతో నిన్నటి వరకు గెలుపు బాటలో ఉన్న టీడీపీ అభ్యర్థుల్లో చాలా మంది ఇప్పుడు ఓటమి అంచుల్లో ఉన్నారా అంటే తలపండిన మేథావులు సైతం అక్కడ మారుతున్న ట్రెండ్స్ చూసి షాక్ అవుతున్నారు.
ఏజన్సీ వైసీపీ వైపే..!
ఏజన్సీలో విస్తరించి ఉన్న అరకు, పాడేరు, మాడుగుల నియోజకవర్గాలు వైసీపీ వైపే ఉన్నాయి. గత ఎన్నికల్లో కూడా ఈ మూడు నియోజకవర్గాల్లో వైసీపీ జెండానే ఎగిరింది.
ఆ తర్వాత మారిన పరిణామాల నేపథ్యంలో అరకు, పాడేరు ఎమ్మెల్యేలు టీడీపీకి జై కొట్టినా ఇప్పటికీ క్షేత్రస్థాయిలో ఈ రెండు నియోజకవర్గాల్లో వైసీపీ చాలా బలంగా ఉంది.
ఏజన్సీలో ఉన్న మూడు నియోజకవర్గాలతో పాటు నగరంలో ఉన్న భీమిలిలో అవంతి శ్రీనివాస్ రంగంలో ఉండడంతో అక్కడ వైసీపీ వైపే గాలి వీస్తోంది. నిన్నటి వరకు విశాఖ టౌన్‌లో టీడీపీ బలంగా ఉందన్న అంచనాలు ఉన్నాయి.
ఇప్పుడు విశాఖ దక్షిణం నుంచి పోటీ చేస్తున్న ద్రోణంరాజు శ్రీనివాస్ సైతం గెలుపు బాటలో ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి.
అలాగే మైదాన ప్రాంతంలో అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గంలో ఉన్న మాడుగుల, చోడవరం, పెందుర్తి నియోజకవర్గాల్లో వైసీపీ ఎడ్జ్‌లోకి వచ్చేసింది. పెందుర్తిలో అదీప్‌రాజు దూసుకుపోతున్నారు.
చోడవరంలో సిట్టింగ్ ఎమ్మెల్యేపై ఉన్న వ్యతిరేకతకు తోడు వైసీపీ అభ్యర్థి ధర్మశ్రీకి గత రెండు ఎన్నికల్లో ఓడిపోతుండడంతో సానుభూతి కలిసి వస్తోంది.
నిన్నటి వరకు టీడీపీకి జిల్లాలో వేవ్ వన్ సైడ్‌గా ఉందన్న అంచనాలు ఉండగా ఇప్పటికి చెరిసగం సీట్లు పంచుకోవచ్చన్న ట్రెండ్ నడుస్తోంది.
ఎన్నికల రోజు నాటికి ఈ పరిణామం వైసీపీకి మరింత అనుకూలంగా మారే ఛాన్సులు కూడా ఉన్నాయి.
ఎంపీ సీట్ల విషయానికి వస్తే అరకు ఎంపీ సీటు ఇప్పటికే వైసీపీ ఖాతాలో పడిపోయినట్టే.
పాయకరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్‌లోనూ వైసీపీ గాలులు బలంగా వీస్తున్నాయి.
విశాఖ ఎంపీ సీటు కోసం నాలుగుస్తంభాలట నడుస్తుండగా ఓట్ల చీలికలో వైసీపీ బయటపడే ఛాన్సులు ఉన్నట్టు వైసీపీ నాయకులు ధీమాతో ఉన్నారు.