వైసీపీ కార్యకర్తకు టీడీపీ ఎమ్మెల్యే బెదిరింపులు.. సోషల్ మీడియాలో వైరల్

ఆముదాలవలస ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కూన రవికుమార్ తన నియోజకవర్గం పరిధిలోని పొందూరుకు చెందిన వైసీపీ కార్యకర్త గంగిరెడ్ల శివను బెదిరించిన ఆడియో వెలు*గులోకి వచ్చింది

వైసీపీ కార్యకర్తను ప్రభుత్వ విప్ బెదిరించినట్టు ఆడియో విడుదల.సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన కూన రవికుమార్ బెదిరింపుల ఆడియో.ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు ధర్నా.

వైసీపీ కార్యకర్తను టీడీపీ ఎమ్మెల్యే బెదిరింపులకు పాల్పడిన ఓ ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆముదాలవలస ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కూన రవికుమార్ తన నియోజకవర్గం పరిధిలోని పొందూరుకు చెందిన వైసీపీ కార్యకర్త గంగిరెడ్ల శివను బెదిరించిన ఆడియో వెలుగులోకి వచ్చింది.

గతంలో టీడీపీ కార్యకర్తగా ఉన్న శివ, జగన్ పాదయాత్ర తర్వాత వైసీపీలో చేరాడు. ప్రస్తుతం వైసీపీ నేత, మాజీ మంత్రి తమ్మినేనికి ముఖ్య అనుచరుడిగా ఉన్న శివ, పొందూరులో ప్రభుత్వ విప్ కూన రవికుమార్ బ్యానర్లను తొలగించినట్టు ప్రచారం జరిగింది.

అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే రవికుమార్ ఫోన్‌చేసి నోటికొచ్చినట్టు తిట్టినట్టు ఆ ఆడియో ద్వారా తెలుస్తోంది.

టీడీపీలో ఉన్నప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ది పొందిన అంశాన్ని కూడా కూన రవికుమార్ అందులో ప్రస్తావించడం గమనార్హం.

ఒక యాంగిల్లో నన్ను చూశావు. రెండో యాంగిల్ కూడా నువ్వు చూడాలనుకుంటే.. నువ్వు చూద్దువు గాని. తమాషా చేస్తున్నావా ఏంది? .. నువ్వేదో, పెద్ద పోటుగాడిలా మాట్లాడొద్దు.. నేను మనిషిని పట్టించుకోనంత వరకే, పట్టించుకున్నానా అంటే ఎక్కడికి పాతేస్తానో నాకు తెలుసు.

ఫైనల్ వార్నింగ్, నీకు చేతనైతే, నీకు విశ్వాసముంటే తెలుగు దేశం పార్టీ జెండా పట్టుకుని తిరుగు’ అని, లేకపోతే, ఏం చేయాలో అది చేస్తానని కూన రవికుమార్ హెచ్చరించడం ఆ ఆడియోలో స్పష్టమవుతోంది.

‘నువ్వు తిరగబడుతున్నావు. తిరగబడితే మాత్రం పాతాళానికి తొక్కేస్తాను’ అని శివను కూన రవికుమార్ హెచ్చరించారు. ‘మీకు నేను సాటేంటి సార్. డిస్ట్రబెన్స్ వల్ల నేను బయటకు వెళ్లాను సార్..’ అని శివ బదులివ్వడం ఈ ఆడియోలో వినపడుతుంది.

ఈ రికార్డు చేసిన వీడియోను వైసీపీ నాయకులకు శివ వినిపించాడు. దీంతో, ఈ అంశాన్ని వైసీపీ నేతలు తీవ్రంగా తీసుకున్నారు.

ఈ ఆడియోను సామాజిక మాధ్యమాలకు చేర్చారు. దీనిపై తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలు ఆముదాలవలస పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు.

ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, కూన రవికుమార్‌కు వైసీపీ నేత తమ్మినేని సీతారాం స్వయానా మేనమామ కావడం విశేషం. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా తమ్మినేని కొనసాగుతున్నారు. వీరి మధ్య బంధుత్వం ఉన్నా రాజకీయంగా మాత్రం వైరం నడుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *