ఎందుకు బంద్ చేశారు….. టీడీపీ నేత రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ వింత వాదనను తెరపైకి తెచ్చారు

ఎందుకన్నదాని విషయమై పూర్తిస్థాయిలో స్పష్టత లేదుగానీ, వాట్సాప్ అకౌంట్ నియమ నిబంధనలకు అనుగుణంగా లేదంటూ వాట్సాప్ సంస్థ స్వయంగా సీఎం రమేష్‌కి వివరణ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
తన వాట్సాప్ అకౌంట్ పనిచేయకపోవడానికి గల కారణాల్ని తెలుసుకునేందుకు ఆయన వాట్సాప్ సంస్థకి లేఖ రాయడంతో, సదరు సంస్థ స్పందించింది.
చిత్రమేంటంటే, కేంద్రం సూచనల మేరకే వాట్సాప్ సంస్థ తన వాట్సాప్ అకౌంట్ బంద్ చేసిందంటూ సీఎం రమేష్ వింత వాదనను తెరపైకి తెచ్చారు.
భారతదేశంలో కోట్లాది వాట్సాప్ అకౌంట్లు వున్నాయి. వీటిల్లో కొన్ని నిబంధనలకు అనుగుణంగా లేకపోయినా నడుస్తున్నాయి.
కొన్ని అకౌంట్స్ విషయంలో అభ్యంతరాలు తలెత్తితే, వాటి ప్రకారం చర్యలు తీసుకోవడం.. ఒక్కోసారి ‘బంద్’ చేయడం కూడా జరుగుతుందని సైబర్ నిపుణులు చెబుతున్నారు.

అసభ్యకర సందేశాలు, వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించడం వంటి ఫిర్యాదుల మేరకు వాట్సాప్ సీరియస్‌గా పరిగణిస్తుంటుంది.
మరి, ఏ ‘కారణంతో’ వాట్సాప్ సంస్థ, సీఎం రమేష్ అకౌంట్‌ని రద్దు చేసిందట.? ఏమో మరి, ఆయనకే తెలియాలి.
అసభ్యకర సందేశాల నేపథ్యంలో వెల్లువెత్తిన ఫిర్యాదుల కారణంగానే వాట్సాప్ సంస్థ, ఆయన అకౌంట్‌ని రద్దు చేసిందంటూ ప్రచారం జరుగుతోంది.
‘పొరపాటు ఏదైనా జరిగివుంటే, దానికి చింతిస్తున్నా.. ఇంకోసారి పొరపాటు జరగకుండా చూసుకుంటా’ అంటూ వాట్సాప్ సంస్థకు సీఎం రమేష్ లేఖ రాయడం కొసమెరుపు ఇక్కడ.
ప్రతి చిన్న విషయానికీ కేంద్రంతో ముడిపెట్టడం తెలుగుదేశం పార్టీ నేతలకు కొత్తమీకాదు.
వాట్సాప్ అకౌంట్ అనే చాలా చిన్న విషయానికి, కేంద్రం ఆదేశాలంటూ రాజ్యసభ సభ్యుడైన సీఎం రమేష్ వ్యాఖ్యానించడం హాస్యాస్పదం కాక మరేమిటి.?