జనసైనికుల కోసం ఆ పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మూడో భాగాన్ని శనివారం విడుదల చేశారు.

YS Jagan అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు ఎందుకివ్వట్లేదు.. ప్రధాని మోదీ నిర్ణయాలు అందుకే కష్టంగా ఉంటాయి.. పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి గతంలో తెలుగు దేశం పార్టీ మాదిరిగా ఇసుక దెబ్బ తగలడం ఖాయమని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యానించారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక అందని ద్రాక్షగా మారిపోయిందన్నారు. అర్ధరాత్రి ఎప్పుడో ఆన్‌లైన్‌లో ఇసుక బుకింగ్ కోసం ఓపెన్ చేస్తే రెండు నిమిషాల్లో అయిపోయిందని చెబుతున్నారని పేర్కొన్నా.

అది ఎవరికి వెళ్తుందో తెలియడం లేదని విమర్శించారు. పరిస్థితి ఇలానే కొనసాగితే గతంలో టీడీపీకి తగిలినట్లే వైసీపీకీ ఇసుక దెబ్బ తగలడం ఖాయమని ఆయన హెచ్చరించారు.

జనసైనికుల కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. దీన్ని కొన్ని భాగాలుగా చేసి విడుదల చేస్తున్నారు.

ఇందులో భాగంగా శనివారం ఇంటర్వ్యూ పార్ట్‌-3 విడుదలు చేశారు. ఇందులో ఇసుక కొరత, ఈబీసీ రిజర్వేషన్ల రద్దు వంటి రాష్ట్ర సమస్యలతో పాటు కేంద్రం ప్రకటించిన ఆత్మనిర్భర్‌ భారత్, ప్రధాని దౌత్య సంబంధాలు వంటి అంశాలపై పలు కీలక అంశాలపై జనసేనాని పవన్ కళ్యాణ్ మాట్లాడారు.

మనది కులాలతో కూడిన సమాజం

‘‘మనది వృత్తి ఆధారిత కులాలతో కూడిన సమాజం. భవన నిర్మాణ కార్మికులకు ఇసుక ఒక ముడి సరకు. ఈ రోజు రాష్ట్రంలో ఇసుక అందని ద్రాక్షగా మారిపోయింది. అందనంత దూరంలోకి వెళ్లిపోయింది. అర్ధరాత్రి ఎప్పుడో ఆన్‌లైన్‌లో ఇసుక బుకింగ్ ఓపెన్ చేసి రెండు నిమిషాల్లో అయిపోయిందని చెబుతున్నారు.

అది ఎవరికి పోతోందో తెలీడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్యుడికి గృహ నిర్మాణం కల అయిపోయింది. ఫలితంగా ఉపాధి లేక భవన నిర్మాణ కార్మికులలో ఆవేదన గూడుకట్టుకొంది. ఇసుక మాఫియా ఎక్కువైపోయింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక విధానంలో అవకతవకలు ఉన్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం దెబ్బ తిన్నదే ఇసుక అక్రమాల వల్ల.

ఈ విషయంలో తప్పు సరిదిద్దుకోకపోతే బలమైన దెబ్బ వైకాపాకూ తగులుతుంది. మరోవైపు స్వర్ణకారులు, ఫొటోగ్రాఫర్లు, టూరిజం మీద ఆధారపడే ఉద్యోగులు, వివిధ వృత్తుల్లో ఉన్నవారి ఉపాధి అవకాశాలు చెల్లాచెదురైపోయాయి. ఈ రంగాలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి’’ అని పవన్‌ అన్నారు.

అగ్రవర్ణాల్లోని పేదలకు రిజర్వేషన్లు ఇవ్వాలి..

‘‘ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎంతో ఆలోచించి ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈబీసీ)కు రిజర్వేషన్‌ అవకాశం కల్పించింది. అగ్రవర్ణాల్లోనూ ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం 10 శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చారు.

అప్పట్లో దేశం మొత్తం హర్షించింది. అయితే, దీని అమలు బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడానికో కారణం ఉంది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో కులం ప్రత్యేకంగా వెనుకబాటుతో ఉంటాయి. అలాంటివి దృష్టిలో పెట్టుకుని ఆ నిర్ణయం మీరు తీసుకోవాలని అధికారాలు ఇస్తే.. గత ప్రభుత్వం అన్ని కులాలకు వర్తింపచేస్తూ ఓ 5 శాతం కాపులకు కేటాయించింది.

ప్రస్తుత ప్రభుత్వం ఈబీసీ రిజర్వేషన్లు తీసేసింది. మీరు రిజర్వేషన్లు ఇవ్వరు.. కేంద్రం ఇచ్చిన ఈబీసీ రిజర్వేషన్లు తీసేశారు.

ఒక్క కాపులకు మాత్రమే కాకుండా అగ్రవర్ణాల్లో ఉన్న పేదలందరికీ ఈబీసీ రిజర్వేషన్లు వర్తింపచేయాలని కోరుతున్నా’’ అని పవన్‌ డిమాండ్‌ చేశారు.

వారంతా ప్రధాని మోదీకి నమస్కరిస్తారు..

‘‘లాక్‌డౌన్‌, కరోనా వైరస్ వ్యాప్తి మూలంగా భిన్న వర్గాల ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు జీవం కల్పించేదే.. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన ఆత్మ నిర్భర ప్యాకేజీ.

లాక్‌డౌన్‌ ప్రకటించిన అనంతరం ప్రజలందరి కష్టాలు చూసి ఆర్థిక వ్యవస్థ ఛిద్రం అవుతుంటే చూసి ఉంటే రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ విడుదల చేశారు.

రోడ్ల మీద వ్యాపారాలు చేసుకునే వారి దగ్గర నుంచి చిన్న తరహా వ్యాపారాలు, పరిశ్రమలు నిర్వహించుకొనే వారి వరకు బ్యాంకులకు వెళ్లి దరఖాస్తు చేసుకుంటే రుణాలు వస్తాయి.

తద్వారా ఉత్పత్తి చేసి మార్కెట్ పెంచి దాని వల్ల వచ్చే ఆదాయంతో లబ్ధి పొందుతారు. అప్పులిచ్చే వారు లేని పరిస్థితుల్లో అలాంటి అవకాశం కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది.

దానిపై కొన్ని పార్టీలు ఏదేదో మాట్లాడుతున్నాయి. ఈ ప్యాకేజీలో లబ్ధి పొందిన వారు నిజంగా మోదీకి చేతులెత్తి నమస్కరిస్తారు’’ అని పవన్ అన్నారు.

అప్పుడు మోదీ ఒక్కరే కనిపించారు..

‘‘ముంబై తాజ్ హోటల్స్, పార్లమెంట్‌ భవనంపై దాడి ఘటనలు చూసినప్పుడు బలమైన నాయకత్వం లేదేంటి? దేవాలయం లాంటి పార్లమెంటు మీద దాడి జరగడం ఏంటి? అసలు ఇక్కడ వరకు ఎలా వచ్చేస్తారు? అని అనిపించింది.

ఎక్కడో పాకిస్థాన్ నుంచి ఉగ్రవాదులు ముంబై వచ్చి కాల్చేస్తుంటే ఎదుర్కొనే బలమైన నాయకత్వం లేదా? అన్న ఆలోచన కలిగినప్పుడు నరేంద్ర మోదీ కనిపించారు. అలాంటి బలమైన నాయకుడు అవసరం అనిపించింది.

ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకునేప్పుడు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండవు. కష్టంగా అనిపిస్తాయి. కానీ దీర్ఘకాల ప్రయోజనాలు చూస్తే అంతా ప్రశంసిస్తారు. 2014 నుంచి నేను అదే ఆలోచనా విధానంతో ఉన్నా.’’ అని పవన్ అన్నారు.

బలమైన నాయత్వం అంటే మోదీదే..

‘‘ఇటీవల చైనా దూకుడు చూసినప్పుడు కూడా స్కూల్లో చదువుకున్న చరిత్ర పాఠాలు గుర్తుకొచ్చాయి. భారత దేశం మీద జరిగిన దండయాత్రలు, భూభాగాలు కోల్పోవడాలు చదివాం.

వీరోచితంగా ఎదురు తిరిగిన ఘట్టాలు లేవు. అలాంటి ఆవేదన ఉన్న తరం నుంచి వచ్చిన మాలాంటి వాళ్లందరికీ మోదీ రూపంలో బలమైన నాయకత్వం కనిపించింది.

2014లో గెలిచిన తర్వాత ఎందుకు ఈయన చాలా దేశాలకు వెళ్తున్నారు? దేశం పట్టున ఉండడం లేదు? అని విమర్శించిన వాళ్లందరికీ సమాధానం ఇచ్చే స్థాయిలో గొప్ప దౌత్యం జరిపారు.

ఇన్ని అగ్ర రాజ్యాల మద్దతు కూడగట్టుకుని ఆర్థికంగా, సైన్యం పరంగా బలమైన చైనా దేశాన్ని, వారి దుందుడుకుతనాన్ని నిలువరించడం పెద్ద విజయంగా భావించొచ్చు’’ అని పవన్‌ వివరించారు.

జన సైనికులకు ధన్యవాదాలు

‘‘కరోనా లాక్‌డౌన్‌ సమయంలో నిత్యావసర వస్తువులకు ఇబ్బంది అయినప్పుడు చాలా సహృదయంతో జనసైనికులు స్పందించారు.

కూరగాయల పంపకం దగ్గర నుంచి అరబ్ దేశాల నుంచి రెండు విమానాలు ఏర్పాటు చేసి అక్కడ ఉండిపోయిన వారిని స్వస్థలాలకు చేర్చేంత విశాల సహృదయత జనసేన పార్టీ శ్రేణులకు, నాయకులకు ఉంది.

వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా. ఒక వ్యక్తి మీద అభిమానం సమాజానికి ఇంత ఉపయోగపడుతుందని చూపారు. తోటి వారికి సాయపడడంలో వచ్చే ఆనందం వేరు. జనసేనలో ఉండే యువ నాయకులు చాలా మంది స్థానిక సమస్యల మీద బలంగా స్పందిస్తున్నారు.

అలాగే సీనియర్ నాయకులు బలమైన రీతిలో పోరాటం చేస్తున్నారు. వారికి అండగా నిలబడతానని తెలియజేస్తున్నా. పార్టీ పరంగా అన్నింటినీ తట్టుకుని నిలబడే కార్యవర్గం అన్ని చోట్లా క్రమంగా సమకూర్చుకుంటున్నాం’’ అని పవన్‌ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *