బాబు పై ఆగ్రహం తో శారదా పీఠాధిపతి

ఏపీ ముఖ్యమంత్రిపై విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం గుంటూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన కేసీఆర్‌ యాగం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం విశేషం.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి తీవ్రంగా మండిపడ్డారు.

గుంటూరులోని పద్మావతి అండాళ్‌ సమేత శ్రీవేంకటేశ్వరస్వామి రిలీజియన్‌ సొసైటీ దేవస్థానంలో జరుగుతున్న సప్తదశ వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఆదివారం ఆయన పాల్గొన్నారు.

ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి తారస్థాయికి చేరిందని ఆరోపించారు.

ప్రభుత్వ మార్పు కోసం త్వరలో తాను ఏపీలో రాజశ్యామల యాగంచేస్తానని స్వరూపానందేంద్ర తెలిపారు.

అంతేకాదు తిరుమల తిరుపతి దేవస్థానంలో పాలన లోపభూయిష్టంగా మారిందని శారదా పీఠాధిపతి ధ్వజమెత్తారు. ఆలయాల భూములు అన్యాక్రాంతం అయ్యాయని, వాటికి సంబంధించిన ప్రతి ఆధారం తన వద్ద ఉందన్నారు.

వీటికి సంబంధించిన ఆధారాలను త్వరలో మీడియా ముందు ఉంచుతానని వెల్లడించారు.

అలాగే, టీటీడీ అధికారులు, ముఖ్యమంత్రిపై కేసు పెడతానని తెలిపారు. వారిపై కోర్టులో కూడా కేసు వేస్తున్నట్లు ఆయన తెలిపారు.

తెలంగాణలో కేసీఆర్‌ అధికారంలోకి రావడానికి తాను దగ్గర ఉండి నిర్వహించిన రాజశ్యామల యాగమే కారణమని వ్యాఖ్యానించారు.

తెలంగాణ శాసనసభ ఎన్నికల ముందు కేసీఆర్ రాజశ్యామల యాగం నిర్వహించిన విషయం తెలిసిందే.

అనంతరం జరిగిన ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించి రెండోసారి అధికారంలోకి వచ్చారు.

ఈ సందర్భంగా విశాఖకు వెళ్లిన తెలంగాణ సీఎం శారదా పీఠంలోని రాజశ్యామల దేవికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం విశాఖ నుంచే ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు సైతం ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed