అభిమాని కుటుంబానికి రూ.50లక్షల సాయం

రజినీ అభిమాని, ‘రజినీ మక్కల్ మండ్రం’ ధర్మపురి జిల్లా కార్యదర్శి మహేంద్రన్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలిసిన రజినీ అతడి కుటుంబాన్ని ఆదుకుంటామని ప్రకటించారు.
1.సూపర్‌స్టార్ రజినీకాంత్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు.
2.రోడ్డుప్రమాదంలో చనిపోయిన అభిమాని కుటుంబానికి రూ.50లక్షల ఆర్థిక సాయం అందించారు
3.అతడి పిల్లల చదువుకు అయ్యే ఖర్చుకు కూడా భరిస్తానని హామీ ఇచ్చారు.
నటనలోనే కాదు.. దాన గుణంలోనూ తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకున్నారు సూపర్‌స్టార్ రజినీకాంత్.
తన నటనతో, స్టైల్‌లో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు రజినీ.
సినిమాల్లో సూపర్‌మ్యాన్‌గా కనిపించే ఆయన బయట మాత్రం సాధారణ జీవితం గడుపుతుంటారు.
తనను ఈ స్థాయికి చేర్చిన అభిమానులంటే ఆయనకు ప్రాణం. వారి కోసం ఏం చేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటారు. ఇదే విషయాన్ని మరోసారి చాటిచెప్పారు రజినీ.
రజినీ అభిమాని, ‘రజినీ మక్కల్ మండ్రం’ ధర్మపురి జిల్లా కార్యదర్శి మహేంద్రన్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.
ఈ విషయం తెలిసిన రజినీ అతడి కుటుంబాన్ని ఆదుకుంటామని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే మహేంద్రన్ కుటుంబసభ్యులు రజినీకాంత్‌ను ఆయన నివాసంలో కలిశారు.
ఈ సందర్భంగా రజినీ వారికి సంతాపం తెలపడంతో పాటు రజినీ మక్కల్ మండ్రం తరఫున రూ.40 లక్షలు, తన వంతుగా రూ.10 లక్షలు.. మొత్తం రూ.50లక్షల ఆర్థిక సాయం అందజేశారు.
అదేవిధంగా తాకట్టు పెట్టిన వారి ఇంటిని కూడా విడిపించారు. మహేంద్రన్ పిల్లల చదువు ఖర్చులను కూడా తానే భరిస్తానని రజినీ ప్రకటించారు.
ఓ అభిమాని కుటుంబానికి రజినీ చేసిన సాయంపై ప్రశంసలు కురుస్తున్నాయి. అభిమానులు అందరికీ ఉంటారని, కానీ రజినీ లాంటి వ్యక్తికి అభిమానులుగా ఉన్నందుకు తామెంతో గర్వపడుతున్నామని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు.
అభిమానుల అండతో అందలం ఎక్కుతున్న వారు రజినీని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.