రాఫెల్‌ రచ్చ: అది చిత్తు ‘కాగి’తమేనా.!

సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌, న్యాయస్థానం ఆదేశాలతో ఒక రోజు న్యాయస్థానంలోనే ఓ మూల కూర్చోవాల్సి వచ్చింది. లక్ష జరీమానా కూడా ఆయనకు న్యాయస్థానం విధించిందన సంగతి తెలిసిందే.

సీబీఐ చరిత్రలో అత్యంత ఆశ్చర్యకరమైన పరిణామమిది. సీబీఐలో గత కొన్నాళ్ళుగా చోటు చేసుకుంటున్న పరిణామాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదేమో.

ఆ స్థాయికి సీబీఐ గౌరవాన్ని దిగజార్చేసిన ఘనత నూటికి నూరుపాళ్ళూ నరేంద్ర మోడీ సర్కార్‌దే. 

ఇక, రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి చాలా రచ్చ జరుగుతోంయ్ సుప్రీంకోర్టుకి సరైన వివరాలు తెలపకుండానే, ఆ కేసులో క్లీన్‌ చిట్‌ పొందేశామని చెప్పుకుంది మోడీ సర్కార్‌.

‘కాగ్‌’ తేల్చిందంటూ కహానీలు సుప్రీంకోర్టుకే విన్పించి, చివరికి ‘తూచ్‌’ అనే ఘనత మోడీ సర్కార్‌ది కాక ఇంకెవరిది చెప్పండి.? దేశంలో ఇలా వ్యవస్థలన్నీ నరేంద్ర మోడీ సర్కార్‌ హయాంలో భ్రష్టుపట్టిపోయాయన్నది నిర్వివాదాంశం. 

తాజాగా, పార్లమెంటు ముందుకు ‘కాగ్‌’ నివేదిక వచ్చింది. అధికారంలో వున్న పార్టీలు ‘కాగ్‌’ రిపోర్టుల్ని లైట్‌ తీసుకోవడం, విపక్షంలో వున్న పార్టీలు ‘కాగ్‌’ రిపోర్టులను అత్యంత ఖచ్చితత్వంతో కూడిన వాస్తవాలుగా భావించడం మామూలే. ఈసారి అందుకు భిన్నంగా మారింది వ్యవహారం.

‘కాగ్‌’ చిత్రంగా రాఫెల్‌ డీల్‌పై కేంద్రానికి అనుకూలంగా నివేదిక ఇచ్చింది. అయితే ఆ నివేదిక అసంపూర్ణం కాగా రాఫెల్‌ డీల్‌ ఎంత.? అసలు విమానం ఖరీదెంత.? యూపీఏ హయాంలో డీల్‌ సంగతేంటి.? ఇలా ఏ అంశాలపైనా క్లారిటీ లేని నివేదిక.. అంటూ కాగ్‌ రిపోర్ట్‌పై నిపుణులు పెదవి విరుస్తున్నారు. 

‘చిన్న చిన్న లోపాల్నే బూతద్ధంలో చూపిస్తుంది’ అనే అభిప్రాయం చాలామందిలో వుంటుంది కాగ్‌పైన. కానీ, ఇక్కడ పెద్ద పెద్ద లోపాలున్నా, కాగ్‌ చూసీ చూడనట్లు వ్యవహరించింది.

అసలంటూ విమానం ధర ఎంతో పేర్కొనకుండా, యూపీఏతో పోల్చితే ఎన్డీయే హయాంలో డీల్‌ 2.85 శాతం తక్కువ.. అని చెప్పడం ‘కాగ్‌’లో కంగాలీ వ్యవహారాన్ని బట్టబయలు చేసిందిప్పుడు. 

ఎన్నికలొచ్చేస్తున్నాయ్‌.. మొన్నటి సుప్రీం తీర్పునీ, ఇప్పటి కాగ్‌ రిపోర్టునీ చేత పట్టుకుని రాఫెల్‌లో తమకు క్లీన్‌ చిట్‌ వచ్చేసిందని కమలనాథులు ఎన్నికల ప్రచారంలో చెప్పుకోవచ్చుగాక.

కానీ, దేశ ప్రజల సొమ్ముతో.. దేశ భద్రత కోసం కొనుగోలు చేస్తామంటున్న యుద్ధ విమానాల వ్యవహారపై దేశ ప్రజలకి సమాధానమివ్వాల్సిన నైతిక బాధ్యత నుంచి ప్రధాని మోడీ కావొచ్చు, కేంద్ర మంత్రులు కావొచ్చు.. ఎవరైనా సరే తప్పించుకోవడానికి వీల్లేదు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *