గాజువాకపై అందరి దృష్టి.. పవన్ గెలుస్తారా?ఓటర్ల ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది…

గాజువాకపై అందరి దృష్టి.. పవన్ గెలుస్తారా?
ప్రస్తుతం అందరి దృష్టి గాజువాకపై ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి శాసనసభకు పోటీపడుతుండటమే దీనికి కారణం.

ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ నాయకులు, ఓటర్ల ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. ఎప్పుడో 40 రోజుల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెల్లడికానున్నాయి.

ఎవరు విజేతలో.. ఎవరు పరాజితులో అన్న ఉత్కంఠకు నేటితో తెరపడుతుంది. అత్యంత కీలక ఘట్టమైన ఓట్ల లెక్కింపు ఈరోజు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైంది. ఎన్నికల సంఘం పకడ్బంధీ ఏర్పాట్లు మధ్య అధికారులు ఓట్లను లెక్కిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కింపు ప్రక్రియ మొదలైంది. ముందు పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు ప్రారంభించారు.

ఆ తర్వాత అరగంటకు ఈవీఎంల లెక్కింపు మొదలవుతుంది. ఒకవేళ అరగంటలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తికాకపోతే దానికి సమాంతరం ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కిస్తారు.

ప్రతి రౌండ్‌కు ఫలితాలు వెల్లడిస్తారు. న్యూసువిధ యాప్‌, ఓటర్‌ హెల్ప్‌లైన్‌ యాప్‌, ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో ప్రతి రౌండ్‌కు ఫలితాలు అందుబాటులో ఉంచుతామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు. మధ్యాహ్నం 12గంటలకు పార్టీల గెలుపోటముల సరళి తెలుస్తుందన్నారు.

✦ ప్రస్తుతం అందరి దృష్టి గాజువాకపై ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి శాసనసభకు పోటీపడుతుండటమే దీనికి కారణం. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, వైసీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డిపై పవన్ పోటీ పడుతున్నారు.

✦ కుప్పంలో చంద్రబాబు మెజార్టీ తగ్గుతుందా?

ఎన్నికల ఫలితాల వేళ.. టీడీపీ అధినేత వరసగా ఏడోసారి తన అదృష్టం పరీక్షించుకుంటున్న కుప్పం నియోజకవర్గంపై అందరి దృష్టి నెలకొంది.

ఆయన ఈసారి తన మెజార్టీని పెంచుకుంటారా? ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీస్తున్న తరుణంలో ఆధిక్యం తగ్గుతుందా?

చంద్రబాబు నేతృత్వం వహిస్తున్న టీడీపీ రాష్ట్రంలో వరసగా రెండోసారి అధికారంలోకి వస్తుందా? అనేవి చర్చనీయాంశాలుగా మారాయి. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి.

✦ ఆంధ్రప్రదేశ్‌లో పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి తొలి ఫలితం వెల్లడయ్యే అవకాశముంది.

రాజమహేంద్రవరం గ్రామీణ, రంపచోడవరం శాసనసభ నియోజకవర్గాల ఫలితాలు ఆఖరున రానున్నాయి.

వైసీపీకి 130 నుంచి 135 సీట్లు వస్తాయని ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. మరోవైపు టీడీపీకి 90 నుంచి 100 వస్తాయని లగడపాటి రాజగోపాల్ సర్వే చెబుతోంది.

✦ ఏపీలో అధికారం ఎవరిదనే విషయంలో వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ప్రజలను కాస్త తికమకకు గురిచేశాయి.

కొన్ని సర్వేలు టీడీపీ మళ్లీ ఎన్నికవ్వబోతోందని చెబితే.. మరికొన్ని వైసీపీ గెలుస్తుందని స్పష్టం చేశాయి.

✦ సార్వత్రిక ఎన్నికల లెక్కింపు నేపథ్యంలో బుధవారం విధులకు హాజరైన పలువురు సిబ్బంది, పోలీసులపై తేనెటీగలు దాడి చేశాయి.

విజయనగరం జిల్లా డెంకాడ మండలం జొన్నాడ వద్ద ఉన్న లెండి ఇంజినీరింగ్‌ కళాశాల లెక్కింపు కేంద్రం ప్రధాన ద్వారం కిటికీలకు ఆనుకుని ఉన్న తేనెటీగల పట్టు కదిలి అక్కడ ఉన్న సిబ్బందిని పరుగులు తీయించాయి.

✦ లెక్కింపు కేంద్రాల వద్ద 15 కంపెనీల సీఆర్పీఎఫ్‌ బలగాలతో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది వెల్లడించారు.

✦ ఫలితాల లెక్కింపులో వీవీప్యాట్‌ స్లిప్పులు ఫారం 17సీతో సరిపోవాలి.

ఈవీఎంల లెక్కింపు పూర్తయ్యాక సమస్య ఉన్న ఈవీఎం, వీవీ ప్యాట్లు లెక్కిస్తాం: ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి జీకే ద్వివేది తెలిపారు.

✦ మే 27 అర్ధరాత్రి వరకు ఎన్నికల కోడ్ అమలు
మే 27 అర్ధరాత్రి వరకు ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంటుందని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.

మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లెక్కింపు పూర్తయ్యాక కూడా తప్పనిసరి అయితే రీకౌంటిగ్‌ నిర్వహించే అవకాశాలు ఉంటాయని వెల్లడించారు.

ఫలితాల వెల్లడిలో ఆర్వోలదే తుది నర్ణయమని గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *