యుద్ధ సన్నహాల్లో పాక్ ఆర్మీ.. కీలక ఆదేశాలు!

పుల్వామా దాడి తర్వాత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో ఇమ్రాన్‌ అధ్యక్షతన గురువారం జరిగిన పాకిస్థాన్ భద్రతా మండలి సమావేశంలో ఈ దాడిని ఓ సంఘటనగా అభివర్ణించడం గమనార్హం.

1.యుద్దం అనివార్యమేనంటూ సన్నాహాలు ప్రారంభించిన పాకిస్థాన్ సైన్యం.

2.బలూచిస్థాన్, పీఓకేలోని అధికారులకు పాక్ నుంచి కీలక ఆదేశాలు.

3.గాయపడిన సైనికులకు వైద్యం సహాయం అందించడానికి సిద్ధంగా ఉండాలని సూచన.

పుల్వామా దాడి తర్వాత సరిహద్దుల్లో భారత్, పాక్‌ల మధ్య ఉద్రికత్తలు చోటుచేసుకున్న తరుణంలోపాకిస్థాన్ ప్రధాని యుద్ధానికి సిద్ధంగా ఉండాలని సైన్యానికి సూచనలు చేయడం గమనార్హం.

భారత్‌ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా, దాడి చేసినా ‘దీటుగా, సమగ్రంగా’ స్పందించాలని సైన్యాన్ని ఇమ్రాన్‌ఖాన్‌ ఆదేశించారు.

పుల్వామా దాడి తర్వాత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో ఇమ్రాన్‌ అధ్యక్షతన పాకిస్థాన్‌ భద్రతా మండలి(ఎన్‌ఎస్‌సీ) గురువారం సమావేశమైంది.

ఈ సమావేశంలో త్రివిధ దళాధిపతులు, నిఘావర్గాల అధిపతులు, కేంద్ర ఆర్థిక, రక్షణ, విదేశాంగ, అంతర్గత భద్రత వ్యవహారాల మంత్రులు, సహాయమంత్రులు పాల్గొన్నారు.

పుల్వామా దాడి, తదననంతర పరిణామాలపై చర్చించిన ఎన్ఎస్సీ, దీనితో పాకిస్థాన్‌కు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది.

ఈ దాడిని కేవలం ఓ ‘సంఘటన’గా అభివర్ణించింది.

జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ విషయంలో భారత్ ఒత్తిడికి తలొగ్గరాదని నిర్ణయించారు.

మరోవైపు, ప్రధాని ఆదేశాలతో పాక్ సైన్యం యుద్ధ సన్నాహాలు ప్రారంభించింది.

ఇందుకు సంబంధించిన కీలక అధారాలు లభించాయి.

బలూచిస్థాన్‌లో పాకిస్థాన్ సైనిక స్థావరం, పీఓకేలోని స్థానిక ప్రభుత్వానికి ఆదేశాలు అందాయి.

భారత్ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడితే దీటుగా బదులివ్వాలని పాక్ అధికారులు ఇందులో ఆదేశించారు.

అలాగే క్వెట్టా కంటోన్మెంట్‌లోని పాకిస్థాన్ సైన్యానికి చెందిన హెడ్‌క్వార్టర్స్ లాజిస్టిక్ ఏరియా సైతం జిలానీ హాస్పిటల్‌కు ఫిబ్రవరి 20 న ఓ లేఖ రాస్తూ..

భారత్‌తో యుద్ధం వచ్చే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా వైద్య సహయం కోసం ఏర్పాట్లు చేయాలని అందులో సూచించింది.

‘ఈశాన్య సరిహద్దుల్లో ఒకవేళ అత్యవసర యుద్ధం వస్తే, ఇందులో గాయపడిన పాకిస్థాన్ సైనికులను సింధ్, పంజాబ్‌లోని మిలటరీ హాస్పిటల్స్‌లో చేర్పించాలి…

ఇక్కడ ప్రాథమిక చికిత్స పూర్తిచేసి, మెరుగైన వైద్యం కోసం బలోచిస్థాన్‌లోని సివిల్ మిలటరీ హాస్పిటల్‌కు తరలించడానికి ప్రణాళికలు రూపొందించాలని,

అందుకు ఆస్పత్రిలో బెడ్‌లను అందుబాటులో ఉంచాలంటూ’ జిలానీ హాస్పిటల్‌‌కు హెచ్‌క్యూఎల్ఏ ఫోర్స్ కమాండర్ లేఖ రాశారు.

అంతేకాదు, ఈ ప్రాంతంలోని మిలటరీ, సివిల్ హాస్పిటల్స్‌లో సమగ్ర వైద్య సహాయం కోసం వ్యూహత్మకంగా సిద్ధం చేయాలని,

ఒకవేళ ఈ ఆస్పత్రుల్లో బెడ్‌లు పెంచాల్సి వస్తే, గాయపడిన సైనికుల కోసం 25 శాతం ప్రత్యేకంగా కేటాయించి వదిలేయాలని ఆదేశించారు.

వీటిని ప్రయివేట్ హాస్పిటల్స్‌కు వర్తింపజేయాలని సూచించారు.

అలాగే, పీఓకేలోని వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న నీలూమ్, జెహ్లామ్, రావల్‌కోట్, హవేలీ, కోట్లీ, భింభేర్ ప్రాంతాల్లోని ప్రజలకు కూడా స్థానిక అధికారులు గురువారం కీలక సూచనలు చేశారు.

భారత్ నుంచి యుద్ధం ముప్పు పొంచి ఉందని వారిని హెచ్చరించారు.

ఎల్‌ఓసీకి దగ్గరగా ఉంటూ, ఎలాంటి బంకర్లు లేనివారి కోసం తక్షణమే నిర్మించాలని పాక్ ప్రభుత్వం నుంచి వచ్చిన లేఖలో పేర్కొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *