మా చెట్లు పోయాయ్.. IAF సర్జికల్ దాడిపై పాకిస్థాన్ వింత ఫిర్యాదు

IAF సర్జికల్ దాడుల్లో ఎవరూ చనిపోలేదని చెబుతున్న పాకిస్థాన్ ఓ వింత వాదనను తెరపైకి తెచ్చింది.

భారత వైమానిక దళం (IAF) సర్జికల్ దాడుల నేపథ్యంలో ఇండియా – పాకిస్థాన్‌ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే.

పాక్ భూతలంలో ఉన్న బాలాకోట్‌లోకి ప్రవేశించిన ‘మిరాజ్ 2000’ విమానాలు ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేశాయి.

ఈ ఘటనలో ఉగ్రవాదులు చనిపోయారని భారత్ ప్రకటిస్తే.. పాక్ మాత్రం ఎవరూ చనిపోలేదని చెబుతోంది. పైగా ఓ వింత వాదన తెరపైకి తెచ్చింది.

భారత వాయు సేనలు తమ భూభాగంలోకి చొరబడి పైన్ చెట్లను నాశనం చేశాయని, పర్యావరణానికి నష్టం వాటిల్లేలా భారత్ వ్యవహరించిందని పేర్కొంది.

పాకిస్థాన్ పర్యావరణ శాఖ మంత్రి మాలిక్ అమిన్ అస్లం ‘రాయిటర్స్’ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. భారత దాడుల వల్ల తమ దేశంలోని పర్యావరణంపై పడిన దుష్ప్రభావంపై ఐక్యరాజ్య సమితి తదితర పర్యావరణ సంస్థలకు ఫిర్యాదు చేస్తున్నామని తెలిపారు.

‘‘దాడుల వల్ల డజన్ల కొద్ది పైన్ చెట్లు నాశనమయ్యాయి. దీనివల్ల పర్యావరణానికి తీవ్రమైన నష్టం వాటిల్లుతుంది’’ అని మాలిక్ తెలిపారు. ఈ నేపథ్యంలో రాయిటర్స్ ప్రతినిధులు బాంబు జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు.

అక్కడ 15 పైన్ చెట్లు కుప్పకూలినట్లు కనుగొన్నారు. IAF దాడుల్లో వందలాది మంది ఉగ్రవాదులు చనిపోయారంటున్న భారత్ ప్రకటన నిజం కాదని స్థానికులు తమకు చెప్పారని రాయిటర్స్ తమ కథనంలో పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *