ఒక్కడే ఒకవైపు…జగన్మోహన రెడ్డిని కట్టడి చేయడానికి నానాపాట్లు పడుతున్నారు

ఒక్కడు చాలు నిశ్చల బలోన్నతుడెంతటి కార్యమైన తా చక్కనొనర్ప’ అని సామెత. ఈ సామెత ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలో అక్షరసత్యమై కనిపిస్తోంది. రాజకీయ భావజాలాలు, మంచిచెడులు, ప్రజల సంక్షేమం, అభ్యున్నతి, వాస్తవమైన ప్రజారంజక పరిపాలన అనే విషయంలో అధికారం కోసం తలపడుతున్న నాయకుల గుణగణాలు, బలాబలాలు ఎలాగైనా ఉండవచ్చు గాక.

కానీ ఒక్కడి మీద దాడిచేయడానికి ఇంతమందా…?

వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి తన ప్రత్యర్థులను అంతగా భయపెడుతున్నాడా అని ఆశ్చర్యం కలుగుతోంది రాజకీయాల్లో నాయకులు భయాభయాలు కనపరచవలసింది ప్రజల పట్ల…! నమ్మకం ఉంచవలసింది తమ చిత్తశుద్ధి మీద! కానీ ఇప్పుడు రాజకీయ యవనిక మీద సంగ్రామం మొత్తం గాడి తప్పిపోతున్నది. జగన్‌ అంటే ప్రత్యర్థి కూటమి మొత్తం భయపడుతున్నట్లుగా కనిపిస్తోంది.

ఎక్కడెక్కడినుంచో అరువు బలాలను సమీకరించుకుంటూ… నిస్సిగ్గుగా దాడికి తెగబడుతున్నారు. ప్రత్యర్థులంతా జట్టుకట్టి.. ఒక్క జగన్మోహన రెడ్డిని కట్టడి చేయడానికి నానాపాట్లు పడుతున్నారు.

కురుక్షేత్రం గుర్తుకువస్తోంది.

యావద్భారతం నుంచి సకల రాజ్యాధినేతలను జట్టుకట్టుకుని కౌరవాధములు సంగ్రామానికి దిగారు. మహారథులను మించిన మేధావులు వ్యూహరచనలు చేశారు. పద్మవ్యూహం పన్నారు. అభిమన్యుడు ఒక్కడు… అరివీర భయంకరుడై చెలరేగాడు. వర్తమాన కురుక్షేత్రంలో ఫలితం ఏమవుతుందో చూడాలి.

జగన్‌ వారి కుయుక్తులకు బలవుతాడా? లేదా… నవ్యాంధ్రలో నవభారతాన్ని నవీన దృక్పథంతో తిరగారాస్తాడా? వేచిచూడాలి.

2014 – 2019 సార్వత్రిక ఎన్నికల మధ్య… ఒక సామ్యం… ఒక వ్యత్యాసం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. సామ్యం- జగన్మోహనరెడ్డి అప్పుడూ, ఇప్పుడూ కూడా ఒంటరిగానే పోరాడుతున్నాడు. వ్యత్యాసం- అప్పుడు జట్టుగా తలపడినవారు ఇప్పుడు విడివిడిగా పోరాటానికి కత్తులు దూస్తున్నారు. ఆ వ్యత్యాసంలో మళ్లీ చిన్న సామ్యం ఏంటంటే…

అందులో మళ్లీ రెండు పార్టీలు, ఇంకా అనేకానేక పార్టీలను కలుపుకుని అంతర్గత మిలాఖత్‌ వ్యవహారంతో… ఒక్క జగన్మోహన రెడ్డిని మాత్రమే టార్గెట్‌ చేసుకుని.. సమరం సాగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాల్లో చాలా విలక్షణమైన పరిస్థితి ఇప్పుడు నెలకొని ఉంది. రాజకీయం వేడివేడిగా సాగుతోంది. మరువారం వచ్చేసరికి ఎన్నికలు కూడా పూర్తయిపోతాయి.

ఇక ఓటరన్న ఎవరిని గద్దెపై కూర్చోబెడుతున్నాడో తెలుసుకోవడానికి మరో నెలరోజుల పాటూ నిరీక్షించడం తప్ప వేరే వ్యాపకం లేదు. ఇలాంటి సమయంలో ప్రచారం హోరెత్తుతోంది. ప్రచారసరళిని.. అంతర్లీనంగా ఆ సరళి పంపుతున్న సంకేతాలను.. వాటివలన రాగల పర్యవసానాలను విశ్లేషించే ప్రయత్నం ఇది.

న్యూస్‌ ఛానెళ్లలో చర్చలకు- టీకొట్టు వద్ద కబుర్లాడుకోడానికి.. పత్రికల్లో రాతలకు- ఊళ్లలో పంచిపెట్టే ఆకాశరామన్న కరపత్రాలకు వ్యత్యాసం కరవైపోయిన రోజులు ఇవి. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరెన్ని మాటలు చెప్పినా.. ఎన్ని పార్టీలు బరిలోకి దిగి పోటీచేస్తూ ఉన్నప్పటికీ.. స్థూలంగా చూస్తే.. ఎన్నికల సమరం ‘చంద్రబాబునాయుడు వెర్సస్‌ జగన్‌’ మాత్రమే అన్నది స్పష్టం. పోటీ కేవలం ఇరుపక్షాల మధ్యనే ఉన్నది. అధికారంలోకి చంద్రబాబునాయుడు లేదా జగన్‌ మాత్రమేరాగలరు. ఇలాంటి సమయంలో వారు అనుసరిస్తున్న మార్గాలే.. వారిలోని ఆత్మవిశ్వాసానికి, అనుమానాలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

‘పరాన్నభుక్కు’గానే ‘చంద్రచరిత్ర’

జీవశాస్త్రంలో- నిరంతరం ఇతరులపై ఆధారపడి బతికే జీవులను పరాన్నభుక్కులంటారు. నేటి రాజకీయాల్లో అలాంటి వ్యక్తి చంద్రబాబునాయుడు. కాకపోతే చిన్నతేడా ఉంది. తమకంటూ బలంలేకుండా.. పూర్తిగా ఇతరులమీదనే పరాన్నభుక్కులు ఆధారపడతాయి. కానీ చంద్రబాబు తనకంటూ మెండుగా బలం ఉన్నప్పటికీ కూడా.. స్వల్పమైన ఆధిక్యాలకోసం ప్రతిసారీ మరొకరి బలం ఆధారపడి బతికేస్తుంటారు.

ఎన్టీరామారావు తెలుగుదేశాన్ని హస్తగతం చేసుకున్నప్పటినుంచి ప్రతి ఎన్నికలను ఆయన మరొకరి సహకారంతోనే ఎదుర్కొన్నారు. తనకు బలముందా లేదా పట్టించుకోకుండా, ఆసరాలేనిదే అడుగువేయని నేత చంద్రబాబు.

కమ్యూనిస్టులు, భాజపా, జనసేన, కాంగ్రెస్‌ ఇలా ఆయన (ఆధారపడని) పొత్తు పెట్టుకోని పార్టీలేదు. ప్రజలందరికీ చిరపరిచితమైన ఈ అంశాన్ని ప్రస్తావించాల్సిందే తప్ప.. సుదీర్ఘంగా నివేదించడమూ అనవసరం.

వ్యక్తిత్వాన్ని గమనిస్తే తను చేయదలచుకున్న ప్రజాసేవ పట్ల నిజమైన చిత్తశుద్ధి, తనుచేసిన మంచిపనుల పట్ల నమ్మకం ఉన్న నాయకులెవ్వరూ చేసే పనికాదిది. అలాంటివి చంద్రబాబునాయుడుకు ఏ కోశానా లేవని పైన చెప్పుకున్న పరిణామాలను బట్టి మనకు చాలా స్పష్టంగా విశదమవుతుంది.

అత్యంత హాస్యాస్పదమైన విషయం ఏంటంటే.. ఈ ఒక్క ఎన్నికల్లో చంద్రబాబు – తెలుగుదేశం ఒంటరిగా పోటీచేస్తున్నట్లు కనిపిస్తున్నప్పటికీ… దేశంలో ఉన్న అనేకానేక పార్టీలను మద్దతుకోసం ముష్టెత్తుతున్న వాతావరణం ఉంది.

అదే సమయంలో జగన్మోహన రెడ్డి.. పూర్తిగా ఒక్కడుగానే… రెండోవైపు నిల్చున్నాడు. ఆయనకు జాతీయ స్థాయిలో కొన్ని పార్టీల నుంచి ప్రతిపాదనలు వచ్చాయేమో. కానీ.. అన్నిటినీ వద్దనుకున్నారు.

ఆయన పూర్తిగా తనపట్ల ప్రజలకు ఉన్న విశ్వాసాన్నే… తన తండ్రిని దేవుడిగా కొలిచే ప్రజల్లోని భక్తినే… ఆ ప్రజల కోసం తాను నడవదలచుకుంటున్న సంక్షేమ మార్గాన్నే నమ్ముకున్నారు.

హోదా ముసుగులో కుహనా రాజకీయం

చంద్రబాబునాయుడు ఎన్నికలను ఎదుర్కోవడానికి ఆయనకు మద్దతుగా దేశం
ఇదంతా హోదా కోసం తాను ఇప్పటికే సాధించిన మద్ధతు అన్నట్లుగా చంద్రబాబునాయుడు టముకు వేసుకుంటున్నారు.

‘హోదా’ అనే ఒకే అంశంపై అయిదేళ్లపాటు ప్రజల్ని మాయచేసిన చంద్రబాబునాయుడు ఇప్పుడు ఇంకా భిన్నమైన మోసమార్గాలను ఎంచుకుంటున్నందుకు ప్రతీక ఇది.

చంద్రబాబు ఈదఫా ఎవరితోనూ పొత్తు పెట్టుకోలేదు అనేది పైకి కనిపిస్తున్న సంగతి. కానీ జమ్మూ కాశ్మీరు నుంచి ఫరూక్‌ అబ్దుల్లాను తీసుకువచ్చారు.

ముస్లిం మతస్థుల ప్రాబల్యం ఎక్కడ ఎక్కువగా ఉన్నదో.. అక్కడ ఆయనతో ప్రచారం చేయించారు. జగన్‌ దుష్టుడని, అధికార లాలసుడని చెప్పించారు.

అక్కడితో ఆగలేదు. ఉత్తర భారతదేశానికి చెందిన వారి ఓట్లు తమకు ఖచ్చితంగా పడవని అనుకున్నారో ఏమో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను తీసుకువచ్చారు. చదువరుల్లో ఆయన పట్ల కొంత గౌరవం ఉంటుందని అంతా అనుకుంటారు. అలాంటి వారిని ఆకట్టుకునేందుకు ఆయనతో తెదేపా అనుకూల ప్రచారం చేయించుకున్నారు.

ఒక్కొక్కరితో ఒక్కొక్క కోణాన్ని స్పృశింపజేస్తూ జగన్‌ను దెబ్బతీయాలని చూస్తున్నారు. ‘ముప్ఫయ్యేళ్లపాటూ ప్రజలు తనను మరచిపోలేని పాలన అందిస్తా’నంటున్న జగన్‌ గద్దెఎక్కితే గనుక.. తన జీవితకాలంలో మళ్లీ అధికార పీఠాన్ని చూడలేనని చంద్రబాబులో బహుశా భయంపుట్టి ఉండవచ్చు.

ఈలోగా అన్ని రకాలుగానూ తన అపరిపక్వతను నిరూపించుకుంటున్న కొడుకు లోకేష్‌ సారథ్యంలో పార్టీ మిగులుతుందో.. లేదా తెలంగాణలో మాదిరిగా సర్వభ్రష్టత్వం చెంది అంతరించిపోతుందో అనేభయం ఆయనను మధనపెడుతుండవచ్చు.

అందుకే ఇంత కష్టపడుతున్నాడని.. దేశంలో తనకు చేతనైనంతమేర అందరినీ బతిమాలి వారికి ఏమాత్రం సంబంధం లేని ఆంధ్రప్రదేశ్‌కు తీసుకువచ్చి ప్రచారం చేయించుకుంటున్నాడని అర్థమవుతోంది.

పవన్‌.. పగిలిపోయిన బుడగ!

పవన్‌కల్యాణ్‌ నిస్సందేహంగా మంచి సినిమా నటుడు. పూర్తి పరిపక్వత, పరిణతి ఉన్న నటుడని చెప్పడానికి వీల్లేదు. కానీ.. తన ఖాతాలో కొన్ని సూపర్‌హిట్‌ సినిమాలు ఉన్న నటుడు.

వాటికి అనుగుణంగా యువతరంలో విస్తారమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న నటుడు. తాను కులమతాలకు అతీతమైన విశ్వమానవుడినని వేదికలమీద చాటుకుంటూ.. చాటుమాటుగా కులం ఓట్లు ఎక్కడ ఎక్కువగా ఉంటే అక్కడ తన పబ్బం గడుస్తుందని వ్యూహరచన చేసుకుంటూ జీవనం సాగించే నాయకుడు.

రాజకీయంగా చిరంజీవి స్థాపించిన పార్టీలోనే ఆయన తన విఫల సారథ్య కౌశలాన్ని బయటపెట్టుకున్నారు. తనలోంచి ఫెటేల్మని తన్నుకు వచ్చేస్తున్న సామాజిక స్పహకు తార్కాణం అన్నట్లుగా జనసేన పార్టీని పెట్టారు. దానిని ఆదిలోనే శయనాసనం వేయించి.. చంద్రబాబుతో జట్టుకట్టారు.

తనపట్ల యువతరంలో ఉండే అభిమానాన్ని 2014లో ఆయన చంద్రబాబుకు తాకట్టు పెట్టారు. ఆయన కులం కోసం పాటుపడిన, కులంకోసం ఆలోచించే ప్రతినిధి కాదు. కేవలం (జన్మానుసారం) ఒక కులంలో జన్మించిన వ్యక్తి మాత్రమే. అది మెజారిటీ సంఖ్యాబలం ఉన్న కులాల్లో ఒకటి.

ఆకులం వారినందరినీ తాను ప్రభావితం చేయగలనని ఆయన భ్రమించాడు. ఇవన్నీ కొంతమేర గతంలో చంద్రబాబుకు లాభించాయి. కానీ.. పవన్‌ కల్యాణ్‌ను చూసి.. చంద్రజెండా భుజానికెత్తుకున్న వారెవ్వరికీ కూడా ఈ పరిపాలనలో న్యాయం జరగలేదు.

ఈదఫా- ‘చంద్రవిజయం’ కోసం పవన్‌ కల్యాణ్‌ ప్లాన్‌ బీని ఆశ్రయించారు. తెదేపాతో తెగతెంపులు చేసుకొని.. తనవాటా ఓట్లు చీలిపోయి జగన్‌కు పడకుండా ఉండేందుకు… తానే స్వయంగా బరిలోకి దిగారు.

రాష్ట్రమంతా తన వారిని మోహరించారు. ‘నేనే కాబోయే సీఎం’ అంటూ ప్రచారంలో దూసుకెళుతున్నారు. తనకు కులంలేదని మాట్లాడే మనిషి.. కులాల లెక్కచూసుకుని రెండుచోట్ల పోటీ చేస్తున్నారు. ఇలాంటి పొంతనలేని చేతలు సిగ్గుచేటు అనికూడా వారికి స్ఫురించదో ఏమిటో మరి!

బరిలో ఉన్నట్లుగానే ప్రజలనూ భ్రమింపజేస్తూ… తమలపాకుతో చంద్రబాబును రెండు దెబ్బలేస్తూ

తలుపుచెక్కతో జగన్‌ను చెండాడేస్తూ.. తాను ఇద్దరికీ సమానదూరంగా ఉంటానంటూ… అసంబద్ధ ప్రేలాపనలు చేస్తున్నారు. తద్వారా.. చంద్ర సర్కారును తిరిగి ప్రతిష్ఠింపజేయడానికి తన వంతు కృషి చేస్తున్నారు.

పవన్‌ కల్యాణ్‌కు తెలుసో లేదో.. ”సభలకు ఎగబడి వచ్చి, విజిల్స్‌ వేసే జనం అంతా ఓట్లుగా మారరు.” ఈ సిద్ధాంతం జగన్‌కు- చంద్రబాబుకు కూడా వర్తిస్తుంది. తనకున్న ‘రాజకీయ ప్రజాదరణ’ అనేది పగిలిపోయిన బుడగ అని ఆయన మరియు ప్రజలు తెలుసుకోగలగాలి.

మాయావతి… పవనచంద్ర క్రీడలో పావు!

మధ్యలో మాయావతి రంగప్రవేశం చేయడం చిత్రమైన పరిణామం. చంద్రవ్యూహాలకు ఇది పరాకాష్ట. కాంగ్రెస్‌ పల్లకీ మోయడానికి తానై వెళ్లి అడిగితే.. ఛీత్కరించుకున్నంత పనిచేసి.. దూరంగా ఉండిపోయిన మాయావతిని… ‘పవన్‌ కార్డు’ ప్లేచేసి రాష్ట్రానికి రప్పించగలిగారు చంద్రబాబునాయుడు.

దళిత, నిమ్న వర్గాల్లో రాజశేఖరరెడ్డి తనయుడు జగన్‌కు అపరిమితమైన ఆదరణ ఉన్నదనే భయంతో… దేశంలో దళితులకు ప్రతినిధిగా తనను తాను భావించుకునే మాయావతిని ఇక్కడ ప్రయోగించారు. జగన్‌ వ్యతిరేక వ్యాఖ్యలు చేయించగలిగారు. అంతా చంద్రబాబు అనుకున్నట్లగానే.. గీసిన స్కెచ్‌ ప్రకారమే నడుస్తున్నట్లుగా కనిపిస్తోంది.

కాంగ్రెస్‌ సభకు దమ్ములేదే మరి

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ ప్రచార పర్వంలో ఇన్ని శక్తులను మోహరిస్తున్నప్పటికీ కాంగ్రెస్‌ను ఇక్కడకు తీసుకురావడానికి మాత్రం చంద్రబాబుకు ధైర్యం చాలడంలేదు. రాహుల్‌ పల్లకీకి బోయీగా మోయడానికి సిద్ధపడిన చంద్రబాబు… ఆరోజే తెలుగుదేశం పార్టీ ఆత్మను చంపేసి.. ఆ పార్టీని శవంగా మార్చేశారు. ఆ కాంగ్రెస్‌ బంధంతో.. ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ పుట్టిందో.. అదే తెలంగాణలో అక్షరాలా శవంగా మారిపోయింది.

రాహుల్‌ ప్రధాని కాబోతున్నాడు.. ప్రత్యేకహోదా ఇచ్చేస్తున్నాడు.. అనే మాయను ఎన్నికల ప్రచారానికి ముందువరకు ప్రజల్లోకి ముమ్మరంగా తీసుకెళ్లిన చంద్రబాబు ఆ తర్వాత కాంగ్రెస్‌ భజన హఠాత్తుగా మానేశారు. ఈ రాష్ట్రంలో సాంప్రదాయ కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు మొత్తం జగన్‌ వశం అయిపోతుందనే భయంతో.. కాంగ్రెస్‌ను కూడా బరిలోకి దింపి తెరవెనుక నుంచి నడిపిస్తున్నారు.

నిజంగానే చంద్రబాబుకు ప్రత్యేకహోదా మీద చిత్తశుద్ధి ఉంటే గనుక.. ఇస్తానంటున్న రాహుల్‌ను రాష్ట్రానికి రప్పించి.. ఓ సభ ఎందుకు పెట్టించలేకపోతున్నారు?

ఆలూలేదు చూలూలేదు కొడుకు పేరు సోమలింగం అని సామెత. ఆ చందంగా.. పార్టీ గెలవనూ లేదు… అంత సీనూ కనిపించడం లేదు.. కానీ హోదా ఇచ్చేస్తానంటున్న రాహుల్‌ రావడం అంటూ జరిగితే లాభంకంటే నష్టం ఎక్కువనే భయం బాబులో ఉన్నట్లు కనిపిస్తోంది.

జగన్‌ను ఓడించడానికి ఇంతమందిని మోహరిస్తూ కూడా, రాహుల్‌ను దూరంపెట్టడం.. అదే సమయంలో ఆయనను ప్రధానిని చేస్తానని బీరాలు పలకడం బాబుకు మాత్రమే చేతైనైన రెండు నాల్కల ధోరణి.

జగన్‌ పోకడ ఏమిటి..?

చంద్రబాబు ఎన్ని రకాలకుట్రలు పన్నుతున్నప్పటికీ.. కూహకాలతో సమూహాలు తయారుచేస్తున్నప్పటికీ.. ఎక్కడెక్కడి వారినందరినీ పోగేసుకుని తనమీద దాడికి తెగబడుతున్నప్పటికీ.. జగన్‌ తొణకడంలేదు. ఆయన అనుసరిస్తున్నది రెండే మార్గాలు. తాను చేయదలచుకుంటున్నది చెప్పడం.. చంద్రబాబు పాలనలో వైఫల్యాలను ఎండగట్టడం.

సాధారణంగా గౌరవప్రదమైన రాజకీయ సరళి అదే. ఎక్కడెక్కడివారినీ తనకు దన్నుగా ఆయన తెచ్చుకోవడం లేదు. ప్రజలు తనను ఆదరించాలని.. తన నాయకత్వానికి ఓటేయాలని కోరుకుంటున్నారే తప్ప… ఏ ఏ ఫరూక్‌ అబ్దుల్లా నో, కేజ్రీవాల్‌ నో చూసి తనను ఆదరించాలని జగన్‌ ఆశించడం లేదు. అందుకే ఒంటరిగానే ముందుకు సాగుతున్నారు.

ప్రత్యేకహోదా విషయంలో కూడా చంద్రబాబులా మాటలు మార్చే ధోరణికి జగన్‌ వెళ్లలేదు. కాసేపు మోడీ ఇస్తారని, తనకు బేరం బెడిసికొట్టిన తర్వాత రాహుల్‌ ఇస్తాడని ఆయన అనడంలేదు.

”ఎన్నికల తర్వాత మాత్రమే- హోదా ఇచ్చేవారికే నా మద్దతు ఇస్తా” అనే ఒకేమాట మీద నిలబడి ఉన్నాడు. అపరిమితమైన ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నాడు. తాను ఎందరిని పోగేసుకుని వచ్చినా సరే… బెదరని ఆ వైఖరి చూసి ప్రత్యర్థులు దడుచుకునే వాతావరణం ఉందంటే అతిశయోక్తికాదు.

అంతరంగ నినాదాలు వేర్వేరు…

బరిలో ఎందరు అభ్యర్థులు.. బ్యాలెట్‌ ఈవీఎంలో ఎన్ని గుర్తులు ఉన్నా సరే.. పోటీ అనేది చంద్రబాబు వెర్సస్‌ జగన్‌ అని, ముఖాముఖీ మాత్రమే అని ముందే చెప్పుకున్నాం. ఈ ఇద్దరు నాయకులు పైన చెప్పుకున్న తీరులో ఇంతగా పరస్పర విరుద్ధమైన ధోరణులను అవలంబిస్తుండడం వెనుక సహేతుకత ఉంది.

ఈ ఇద్దరి అంతరంగాల్లో మెదలుతున్న ఆలోచనలు పూర్తిగా వేర్వేరు. అవే పరస్పర విరుద్ధమైనవి. చంద్రబాబులోని భయంతోనే ఆయన చూపిస్తున్న పరాధీనత ముడిపడి ఉన్నదని అనిపిస్తోంది.

చంద్రబాబు అంతరంగం- ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ లేదు…
జగన్‌ అంతరంగం- ఇప్పుడు కాకపోతే ఇంకోసారి…

ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ లేదు… అని బాబు భయపడుతున్నారు. నాలుగోసారి సీఎం పీఠం మాత్రమేకాదు. కొడుకును పీఠంపై ఉంచడం ఆయన లక్ష్యం. అది ఇప్పుడు కాకపోతే ఇక ఎప్పటికీ కాదు అని ఆయనకు స్పష్టత ఉంది.

ఇప్పుడు కాకపోతే ఇంకోసారి… జగన్‌ పరిస్థితి అదికాదు. ‘నాకు వయసుంది. ఆచరణ సాధ్యంకాని హామీలు మనం ఇవ్వొద్దు. ఇప్పుడు కాకపోతే ఇంకోసారి అయినా ప్రజలు నమ్ముతారు’ అనే ధోరణితో ఆయన ఉన్నారు. అందుకే అంత ధైర్యంగా ఉన్నారనిపిస్తోంది. అందుకే ఎవ్వరి సహాయాన్నీ అర్థించకుండా.. కేవలం తనను తాను నమ్ముకుని ప్రజా తీర్పుకోసం ముందుకు సాగుతున్నారు.

హస్తిమశకాంతరం అనదగిన స్థాయిలో ఈ ఇద్దరు నాయకుల ఆలోచనలు, అనుసరిస్తున్న మార్గాల మధ్య వ్యత్యాసం ఉంది. జగన్‌ ఒక్కడినీ ఒకవైపు ఉంచి.. బహరంగ పొత్తులు, అంతర్గత కుట్రలు అనేకం పన్ని.. తతిమ్మా అందరూ కలసి పోరాడుతున్నారు. మరి ప్రజలు ఎవరి మెడలో విజయహారం వేస్తారో వేచిచూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *