తూచ్.. చంద్రబాబుపై కేసు వేస్తాననలేదు – శారదా పీఠాధిపతి

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
1.ప్రభుత్వ మార్పు కోసం యాగం చేస్తాన్న స్వామీజీ వ్యాఖ్యలపై దుమారం.
2.తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని శారదా పీఠాధిపతి వివరణ
చంద్రబాబుపై కేసు వేస్తానని తాను అనలేదన్న స్వరూపానందేంద్ర సరస్వతి.
గుంటూరులో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
స్వామిజీ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
టీటీడీ వ్యవస్థ భ్రష్టుపట్టిపోయిందని దానిపై మాత్రే తాను కేసు వేస్తానని అన్నానని, చంద్రబాబు వేస్తాననలేదని స్వరూపానందేంద్ర సరస్వతి తెలిపారు. తన మాటలను మీడియా వక్రీకరించి ప్రచురించిందని సోమవారం కాకినాడలో స్థానిక విలేకరులకు తెలియజేశారు.
సూర్యారావుపేటలోని బాలాత్రిపురసుందరీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో 135 ఏళ్ల తరువాత జరుగుతున్న మహాకుంభాభిషేకానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు.
ఆలయ శిఖరంపై పుణ్యనదీ జలాలతో మహాకుంభాభిషేకాన్ని శాస్త్రోక్తంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవస్థ దారుణంగా తయారైందని, దేవాలయాల పేరుతో నిధులు మళ్లిస్తున్నారని మాత్రమే అన్నానని వివరించారు.
వాటిపైనే తాను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని పేర్కొన్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి తారస్థాయికి చేరిందని ఆరోపించారు. ప్రభుత్వ మార్పు కోసం త్వరలో తాను ఏపీలో రాజశ్యామల యాగం చేస్తానని స్వరూపానందేంద్ర తెలిపారు.

అంతేకాదు తిరుమల తిరుపతి దేవస్థానంలో పాలన లోపభూయిష్టంగా మారిందని శారదా పీఠాధిపతి ధ్వజమెత్తారు.
ఆలయాల భూములు అన్యాక్రాంతం అయ్యాయని, వాటికి సంబంధించిన ప్రతి ఆధారం తన వద్ద ఉందన్నారు. వీటికి సంబంధించిన ఆధారాలను త్వరలో మీడియా ముందు ఉంచుతానని వెల్లడించారు.
అలాగే టీటీడీ అధికారులు, ముఖ్యమంత్రిపై కేసు పెడతానని తెలిపారు.
వారిపై కోర్టులో కూడా కేసు వేస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి రావడానికి తాను దగ్గర ఉండి నిర్వహించిన రాజశ్యామల యాగమే కారణమని వ్యాఖ్యానించారు.