జాతీయనేతల క్యూ.. నేడు ఏపీకి రాహుల్, మమత, కేజ్రీవాల్….

టీడీపీకి చంద్రబాబు, జనసేనకు పవన్‌కళ్యాణ్ అన్నీ తామై ప్రచారం నిర్వహిస్తుంటే, వైసీపీకి మాత్రం జగన్‌కు తోడుగా ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిళ ప్రచారం చేస్తున్నారు.

నేడు ఏపీకి జాతీయ నేతలు క్యూ కట్టనున్నారు.
టీడీపీ తరపున కేజ్రీవాల్, మమతా బెనర్జీ విశాఖలో ప్రచారం చేయనున్నారు.
రాహుల్ గాంధీ విజయవాడ, అనంతపురం సభల్లో పాల్గొననున్నారు.

అసెంబ్లీ ఎన్నికల ఎన్నికలకు కేవలం 12 రోజులే సమయం ఉండటంతో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి.

టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్, జనసేనాని పవన్‌కళ్యాణ్ తదితరులు రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేలా ప్రసంగాలు దంచేస్తున్నారు.

టీడీపీకి చంద్రబాబు, జనసేనకు పవన్‌కళ్యాణ్ అన్నీ తామై ప్రచారం నిర్వహిస్తుంటే, వైసీపీకి మాత్రం జగన్‌కు తోడుగా ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిళ ప్రచారం చేస్తున్నారు.

మోదీకి వ్యతిరేకంగా ఫ్రంట్‌ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబు గతంలో జాతీయ నేతలను కలిసి చర్చించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వారంతా చంద్రబాబుకు మద్దతుగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రచారం చేసేందుకు క్యూ కడుతున్నారు.

ఇప్పటికే జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రచారం నిర్వహించగా, ఆదివారం పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీతో కలిసి కేజ్రీవాల్ మరోసారి రాష్ట్రానికి రానున్నారు.

విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో సాయంత్రం 5గంటలకు నిర్వహించే టీడీపీ ఎన్నికల ప్రచారసభలో వీరంతా పాల్గొంటారు.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ తరపున రాహుల్‌గాంధీ ఈరోజు ఏపీలో ప్రచారం నిర్వహించనున్నారు.

ఉదయం 11 గంటలకు విజయవాడ చేరుకోనున్న రాహుల్ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో నిర్వహించే రాష్ట్రస్థాయి బూత్ కమిటీ సమావేశంలో పాల్గొననున్నారు.

మధ్యాహ్నం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ప్రధానంగా ఏపీకి ప్రత్యేక హోదాపై ఆయన మళ్లీ హామీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

రైతులకు, మహిళలకు రూ.2లక్షల రుణమాఫీ, పేదలకు కనీస ఆదాయ హామీ(న్యాయ్) పథకాలను రాహుల్ ప్రస్తావించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *