ఏఎంబీ నోటీసుల పై క్లారిటీ ఇచ్చిన ఎండీ

ఏఎంబీ సినిమాస్ వివాదంపై ఏసియన్ సినిమాస్ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ నారంగ్ స్పందించారు. ఏఎంబీ సినిమాస్‌కు షోకాజ్ నోటీసులు అందాయని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు.

ఏసియన్ సినిమాస్‌తో కలిసి సూపర్ స్టార్ మహేష్‌బాబు మల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఏఎంబీ సినిమాస్ పేరిట హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో అధునాతన సాంకేతిక హంగులతో ప్రతిష్టాత్మకంగా మల్టీప్లెక్స్‌ను నిర్మించారు.

అయితే ఏఎంబీ సినిమాస్‌కు సంబంధించి ఓ వార్త బుధవారం ఉదయం నుంచి విపరీతంగా వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు.

కొత్తగా అమలులోకి వచ్చిన జీఎస్టీ నిబంధనలను ఏఎంబీ సినిమాస్ అమలు చేయడం లేదని, దీన్ని గుర్తించిన అధికారులు మహేష్‌బాబుకు షోకాజ్ నోటీసులు పంపారని వార్తలు వచ్చాయి.

దీంతో మహేష్‌బాబును ట్విట్టర్‌లో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

అయితే ఈ వివాదంపై ఏసియన్ సినిమాస్ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ నారంగ్ స్పందించారు.

ఏఎంబీ సినిమాస్‌కు షోకాజ్ నోటీసులు అందాయని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. తాము కొత్త జీఎస్టీ నిబంధనలను తూచా తప్పకుండా అమలు చేస్తున్నామని చెప్పారు.

అధికారులు మల్టీప్లెక్స్‌కు వచ్చిన మాట నిజమేనని, వారు రికార్డులు పరిశీలించారని తెలిపారు.

తాము జీఎస్టీ తగ్గించే టికెట్‌లు విక్రయిస్తున్నామని, దీంతో అధికారులు వెనుదిరిగారని చెప్పారు.పెనాల్టీ కట్టాలని అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని వెల్లడించారు.

నోటీసులు ఇచ్చారని వెబ్‌సైట్లలో వచ్చిన వార్తల గురించి తెలుసుకుని జీఎస్టీ అధికారులు సైతం ఆశ్చర్యపోయారని సునీల్ అన్నారు.

ఏఎంబీ సినిమాస్ నిబంధనలకు విరుద్ధంగా పనిచేయదని, వినియోగదారులకు అధునాతన అనుభూతిని కల్పించడంతో పాటు వారికి సరసమైన ధరలకే వినోదాన్ని అందించడం ఏసియన్ సినిమాస్ ధ్యేయమని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *