చిక్కకుండా తిరుగుతున్న…..ఇక్రిశాట్‌లో భయం భయం చిక్కని చిరుత

పటాన్‌చెరులోని ఇక్రిశాట్ సంస్థలో చిరుత పులి సంచారం భయాందోళన కలిగిస్తోంది. దాన్ని పట్టుకునేందుకు రెండు బోన్లు ఏర్పాటుచేసినా తప్పించుకుని తిరుగుతోంది.

ఇక్రిశాట్‌లో సంచిస్తున్న చిరుత ఇంకా చిక్కలేదుదీంతో సంస్థలోని పరిశోధనలకు ఇబ్బంది కలుగుతోంది.దాన్ని పట్టుకునేందుకు రెండు బోన్లు ఏర్పాటుచేసినప్పటికీ చిక్కకుండా తప్పించుకుంటోంది.

పటాన్‌చెరు సమీపంలోని అంతర్జాతీయ వ్యవసాయ రంగ పరిశోధన సంస్థ(ఇక్రిశాట్‌)లో చిరుత పులి సంచారం పరిశోధనలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇక్రిశాట్‌లో వారం రోజులుగా చిరుత తిరుగుతున్నట్లు భద్రతా సిబ్బంది గుర్తించారు.

ఆదివారం సాయంత్రం 6.44 గంటల సమయంలో ప్రాంగణంలోని సీసీ కెమెరాల్లో ఇది రికార్డు కూడా అయింది.

అప్పటినుంచి క్షేత్ర స్థాయి పరిశోధనలు నిలిపివేశారు. ఇక్రిశాట్‌లో సుమారు 40 దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు వ్యవసాయ పరిశోధనలు చేస్తున్నారు.

చిరుత సంచారంతో ప్రస్తుతం వారందరూ ల్యాబ్‌లకే పరిమితమవుతున్నారు.

సోమవారం రాత్రి సమయంలో చిరుత ఓ ముళ్లపందిని తిన్న ఆనవాళ్లను ఫారెస్ట్ అధికారులు గుర్తించారు.

దాని అడుగుజాడలను పర్యవేక్షించేందుకు 11 మంది సిబ్బందిని నియమించారు.

దాని కదలికలను నిత్యం పర్యవేక్షించేందుకు 13 సీసీ కెమెరాలను ఏర్పాటుచేశారు. చిరుత సోమవారం రాత్రి సమయంలో అధికారులు ఏర్పాటుచేసిన ఓ బోను వరకు వచ్చి వెనక్కి వెళ్లిపోయినట్టు కెమెరాల్లో కనిపించింది.

బోను లోపలికి రావడానికి చిన్న మేకను ఎరగా వేశారు. రెండు బోనుల్లో రెండు మేకలు అది స్పందించడం లేదని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు.
2014లోనే ఇలాగే…

ఇక్రిశాట్‌లో చిరుత సంచారాన్ని గుర్తించడం ఇదే తొలిసారి కాదు. 2014లో కొద్దిరోజుల పాటు చిరుత సంచరించి భయాందోళనలకు గురిచేసింది. అప్పుడూ నాలుగు రోజుల పాటు ఫారెస్ట్ అధికారులు బోనులు ఏర్పాటుచేసినా ఫలితం లేకపోయింది.

దీంతో ఇక మాకు సంబంధం లేదన్నట్లుగా అధికారులు ఈ అంశాన్ని వదిలేశారే తప్ప చిరుత ఎక్కడినుంచి వచ్చింది అనే విషయమమై ఎలాంటి అధ్యయనం చేయలేదు.

దీంతో ఐదేళ్ల తర్వాత మరోసారి చిరుత సంచారంతో సంస్థ సిబ్బంది వణికిపోతున్నారు.

ఇక్రిశాట్‌ వెనుకభాగంలో అవుటర్‌ రింగ్‌రోడ్ ఉంది. దాని వెనుకభాగం అంతటా చెట్ల పొదలతో నిండి ఉంటుంది. అక్కడి నుంచి నేరుగా లోపలికి వచ్చి ఉంటుందని ఇక్రిశాట్‌ సిబ్బంది అంటున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *