రెండు అంశాలే లక్ష్యంగా ..KCR టార్గెట్ మారింది..

KCR టార్గెట్ మారింది.. జగన్ ఎఫెక్టే కారణమా..?

తెలంగాణ సీఎం కేసీఆర్ టార్గెట్ మారింది. ఇప్పటి వరకూ విద్యుత్, సాగునీరు, తాగునీటి రంగాలకు ప్రాధాన్యం ఇచ్చిన టీఆర్ఎస్ సర్కారు ఇక మీద విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ టార్గెట్ మారింది. ఇక నుంచి రెండు అంశాలే లక్ష్యంగా ఆయన ముందుకు వెళ్లనున్నారు.

ఈ మాటలు అన్నది ఎవరో కాదు.. ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్. ఇంతకూ ఆ టార్గెట్ ఏంటో తెలుసుకోవాలని అనుకుంటున్నారా..?

విద్య, వైద్య రంగాలు. ఇప్పటి వరకూ విద్యుత్, తాగునీరు, సాగునీరు రంగాలకు ప్రాధాన్యం ఇచ్చామని.. ఈ రంగాల్లో తెలంగాణను దేశంలోనే అగ్రభాగాన నిలిపామని మంత్రి కేటీఆర్ తెలిపారు.

కరీంనగర్‌లో ఇంటింటికి తాగునీరు పథకాన్ని మంగళవారం ప్రారంభించిన అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ ఏర్పాటైన ఆరు నెలల్లోనే నిరంతర విద్యుత్‌ను అందించామని మంత్రి తెలిపారు.

మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, సాగునీటి ప్రాజెక్టుల ద్వారా తాగునీరు, సాగునీటి కొరత లేకుండా చూశామన్నారు.

కాళేశ్వరం సహా రాష్ట్రంలోని మిగతా సాగునీటి ప్రాజెక్టులను వాయువేగంతో పూర్తి చేస్తున్నామన్నారు.

ఇక మీదట విద్య, వైద్యానికి ప్రాధాన్యం ఇస్తామని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఈ రెండు రంగాల్లోనూ మార్పులొచ్చాయి.

గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే ప్రయత్నం చేస్తున్నారు. వైద్యం విషయానికి వస్తే.. ప్రభుత్వ హాస్పిటళ్ల రూపురేఖలను మార్చేశారు.

కేసీఆర్ కిట్ పేరిట ప్రభుత్వ హాస్పిటల్‌‌లో ప్రసవం చేయించుకున్న మహిళలకు సాయం అందిస్తున్నారు.

కానీ హైదాబాద్ నగరంలోని ఉస్మానియా లాంటి హాస్పిటళ్లు సైతం దీన స్థితిలో ఉండటం అందర్నీ కలచివేస్తోంది.

కరోనా వైరస్ దెబ్బకు సామాన్యుడిపై తీవ్ర భారం పడుతోంది. వైద్యం తలకు మించిన భారంలా మారింది. పొరుగున ఉన్న ఏపీ ఆరోగ్య శ్రీ పథకానికి మెరుగులు అద్దింది.

భారీ సంఖ్యలో అంబులెన్స్‌లను సమకూర్చింది. వైద్య ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకొచ్చే వెసులుబాటు కల్పిస్తోంది.

విద్య పరంగానూ అమ్మ ఒడి, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్య, పాఠశాలల రూపు రేఖలను మార్చే నాడు-నేడు పథకాలను ప్రవేశపెట్టింది.

ఈ తరహా పథకాలు మన దగ్గర ఉంటే బాగుండనే భావన తెలంగాణ ప్రజల్లో వ్యక్తం అవుతోంది.

ప్రజలు తమ పిల్లల చదువులు, ఆరోగ్యం కోసమే ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో ఈ రెండు రంగాలపై ఫోకస్ పెడతామని మంత్రి కేటీఆర్ చెప్పడం గమనార్హం.

విద్య, ఆరోగ్యం విషయంలో ప్రజలను మెప్పించగలిగితే.. రాజకీయంగానూ టీఆర్ఎస్‌కు తిరుగులేని లబ్ధి చేకూరే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *