ప్రభుత్వం ఎక్కువ అప్పు చేసింది వాస్తవమే.. పూర్తి లెక్కలివే: మంత్రి బుగ్గన

ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుకు కౌంటర్ ఇచ్చారు.

తెలుగు దేశం పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు వారానికోసారి ఆర్థికాంశాలపై ఏదేదో మాట్లాడుతున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి విమర్శించారు.

రాష్ట్రంలో వృద్ధిరేటు ఎక్కడ తగ్గిందో యనమల చెప్పగలరా? అని ఆయన ప్రశ్నించారు.

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ ఎక్కడా వెనుకబడలేదని స్పష్టం చేశారు.

దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో ద్రవ్యోల్బణం తక్కువ నమోదైట్లు చెప్పారు.

వాస్తవాలు లేకుండా యనమల నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి బుగ్గన విమర్శించారు.

గత టీడీపీ ప్రభుత్వంలో రూ.15 వేల కోట్లు బకాయిల ఉంచిందని, వీటి చెల్లింపు వల్ల రెవెన్యూ లోటు పెరిగిందని వివరించారు.

బహిరంగ మార్కెట్లో ఎక్కువ అప్పు చేశామనేది వాస్తవమేనని పేర్కొన్నారు.

కేంద్ర, రాష్ట్ర పన్నులు కలిపి వస్తున్న ఆదాయం రూ.1.14 లక్షల కోట్లని పేర్కొన్నారు.

గత టీడీపీ ప్రభుత్వం ప్రజలపై విపరీతమైన అప్పులభారం మోపిందని చెప్పారు.

ఈసారి బడ్జెట్‌లో అన్ని శాఖలకూ కేటాయింపులు పెరిగాయని, వివిధ పథకాల ద్వారా లబ్ధిదారులకు రూ.42,603 కోట్లు ఇచ్చామని మంత్రి బుగ్గన వెల్లడించారు.

కేంద్ర ప్రభుత్వం ఏపీకి అన్ని విధాలా సహకరిస్తామని చెబితే.. తన ఢిల్లీ పర్యటనపై టీడీపీ అనుకూల మీడియాలో అసత్య వార్తలు రాస్తున్నారని మండిపడ్డారు.

కరోనా పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రథమ స్థానంలో ఉందన్నారు. రెవెన్యూ లోటు, పోలవరానికి, జీఎస్టీ బకాయిలు ఇవ్వాలని, రామాయపట్నం, కడప ఉక్కుపరిశ్రమకు నిధులివ్వాలని కేంద్రాన్ని కోరినట్లు మంత్రి బుగ్గన అన్నారు.

విదేశీ ఆర్థిక సంస్థ రుణం, గ్రాంట్‌ ఇచ్చేందుకు ఒప్పుకుందని వెల్లడించారు. ఏపీకి మంచి జరగడం టీడీపీకి ఇష్టం లేదని వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *