మరో సర్జికల్‌ స్ట్రైక్స్‌కి రంగం సిద్ధమవుతుందా?

పొద్దున్న లేస్తే దేశభక్తి గురించి అన్ని రాజకీయ పార్టీలూ ఉపన్యాసాలు దంచేయడం మామూలే. ‘మా హయాంలో ఉగ్రదాడులకు ఆస్కారం లేకుండా చేశాం..’ అంటూ పదే పదే ప్రధాని నరేంద్ర మోడీ చెబుతుండడం, ‘అయితే ఇవేంటి..?’ అంటూ, దేశంలో గత నాలుగున్నరేళ్ళలో జరిగిన (దేశ సరిహద్దుల్లోనే అయినా, అవీ దేశంలోనివే కదా) దాడుల్ని విపక్షాలు ప్రస్తావిస్తూ, అధికార పార్టీపై ఎదురుదాడికి దిగడం మామూలే. 

గుజరాత్‌ ఎన్నికల్లో గెలవడానికి ప్రధాని నరేంద్ర మోడీ ప్రయోగించిన అస్త్రం ఏంటో తెలుసు కదా.? ‘నన్ను చంపడానికి పాకిస్తానీ తీవ్రవాదులతో కాంగ్రెస్‌ పార్టీ ఒప్పందం కుదుర్చుకుంది’ అంటూ నరేంద్ర మోడీ, గుజరాత్‌ ఎన్నికల సమయంలో చేసిన ప్రకటనని అంత తేలిగ్గా మర్చిపోలేం.

రాఫెల్‌ డీల్‌ విషయంలోనూ, పాకిస్తాన్‌ పేరుని ప్రస్తావించి విపక్షాలు పొరుగు దేశం పాకిస్తాన్‌తో కుమ్మక్కయ్యాయని బీజేపీ నేతలు కొందరు కథలు విన్పించారు. 

మొన్న యురి ఘటన, ఇప్పుడు తాజాగా పుల్వామా ఘటన.. భారతావని రక్తమోడుతోంది.. దేశం కోసం సైనికులు ప్రాణాలు అర్పిస్తూనే వున్నారు. యురి ఘటన నేపథ్యంలో మోడీ సర్కార్‌, ‘సర్జికల్‌ స్ట్రైక్స్‌’ అంశాన్ని తెరపైకి తెచ్చి, ఏ స్థాయి పబ్లిసిటీ స్టంట్లు చేసిందో చూశాం. అది దేశం తీర్చుకున్న ప్రతీకారంగా భావించాల్సిందిపోయి, భారతీయ జనతా పార్టీ ఘనతగా కమలనాథులు ప్రొజెక్ట్‌ చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇంకో సర్జికల్‌ స్ట్రైక్స్‌కి రంగం సిద్ధమవుతుందేమో.! 

సరిగ్గా ఎన్నికల ముందర, దేశ చరిత్రలోనే అతి పెద్ద ఉగ్రదాడి చోటు చేసుకుందంటే.. అధికార పార్టీకి ఫ్రీగా పబ్లిసిటీ దొరికినట్లే. గేమ్‌ షురూ అవుతుంది.. ఆ తర్వాత విపక్షాల నుంచి రాజకీయ దాడి మొదలవుతుంది. దేశం మారదు, దేశం రక్తమోడటమూ ఆగదు.

ఎందుకంటే, సైన్యంతోనూ రాజకీయాలు చేసే దేశం మనది. అధికారంలో ఎవరున్నా ఇదే తంతు.! ఈ తంతు ఇటీవలి కాలంలో మరీ హద్దులు దాటేసిందంతే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *