సుమలత కు దక్కని కాంగ్రెస్ సీటు ఇండిపెండెంట్ గానే బరిలోకి?

కన్నడింటి కోడలు, తెలుగింటి ఆడపడుచు సుమలతకు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ దక్కదని స్పష్టం అయిపోయింది.
అంబరీష్ మరణంతో తనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని భావించిన సుమలతకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇవ్వడంలేదు. మండ్య నుంచి ఎంపీగా పోటీచేయాలని సుమలత భావించారు.
అయితే.. ఆ సీటు తమ కోటాలోకి రాదని, పొత్తులో భాగంగా అది జేడీఎస్ కు దక్కుతుందని కాంగ్రెస్ పార్టీ కర్ణాటక విభాగం ప్రకటించింది.
తద్వారా సుమలతకు టికెట్ విషయంలో తాము ఏ భరోసానూ ఇవ్వలమేని కాంగ్రెస్ స్పష్టంచేసింది. ఇక జేడీఎస్ కూడా సుమలతకు అవకాశం ఇచ్చేలాలేదు.
అక్కడ నుంచి కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ ఎంపీగా పోటీచేయాలని భావిస్తున్నారట. దీంతో సుమలతకు జేడీఎస్ నుంచి అవకాశం లభించదని స్పష్టం అవుతోంది.
తమ కుటుంబ ప్రాతినిధ్యం కోరుకునే చోట జేడీఎస్ అంబరీష్ భార్యకు ఎలాంటి అవకాశం ఇవ్వదని స్పష్టం అవుతోంది.
అయితే తను మాత్రం పోటీలో ఉండి తీరతాను అని సుమలత స్పష్టం చేశారిప్పటికే. మండ్య ప్రాంతంలో అంబరీష్ కు అన్ని రకాలుగానూ పట్టుంది.
సినీ అభిమానంతో పాటు కుల సమీకరణాలు కూడా అంబరీష్ కుటుంబానికి అక్కడ అనుకూలమైనవే. ఈ నేపథ్యంలో సుమలత పోటీచేస్తే సానుభూతి కూడా వెల్లువెత్తే అవకాశం ఉంది.