గంటా అనుకూల పరిస్థితులున్నాయా.? అంటే, టీడీపీలో ‘సీటు’ భద్రమేనా.?

మంత్రి గంటా శ్రీనివాసరావు ఓ రేంజ్‌లో అత్యుత్సాహం ప్రదర్శించేస్తున్నారు. విశాఖ జిల్లా భీమిలి నుంచి తానే పోటీ చేస్తున్నాననీ, దమ్ముంటే వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ తనకు పోటీగా నిలబడాలంటూ సవాల్‌ విసిరేశారు.

జగన్‌ మీద లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తానంటున్నారు గంటా శ్రీనివాసరావు. ఔనా, నిజమేనా.? గంటా శ్రీనివాసరావుకి బీమిలి నియోజకవర్గంలో అంత అనుకూల పరిస్థితులున్నాయా.? అంటే, అంత సీన్‌ లేదని స్థానికంగా వున్న పరిస్థితుల్ని బట్టి అర్థమవుతోంది. 

ఎంపీ అవంతి శ్రీనివాస్‌ టీడీపీని వీడి వైఎస్సార్సీపీలోకి వెళ్ళడంతో గంటా శ్రీనివాసరావుకి లైన్‌ క్లియర్‌ అయిన మాట వాస్తవం.

నిజానికి గంటా శ్రీనివాసరావు గతంలో ‘ప్యాకేజీ’ రూపంలో వైఎస్సార్సీపీలోకి వెళ్ళేందుకు ప్రయత్నించారు.

ఆ ప్యాకేజీలో అవంతి శ్రీనివాస్‌ పేరు కూడా వుందంటూ పెద్ద యెత్తున ప్రచారం జరిగింది. అన్నట్టు, గంటా శ్రీనివాసరావు జనసేన పార్టీతోనూ టచ్‌లోకి వెళ్ళారు. అక్కడా ఆయనకి ‘రెడ్‌ సిగ్నల్‌’ ఎదురుకావడం గమనార్హం. 

ఒకానొక సమయంలో చంద్రబాబుకి ఝలక్‌ ఇచ్చి, ‘కినుక’ వహించిన ఘనుడు గంటా శ్రీనివాసరావు.

అప్పట్లోనే ఆయన పార్టీ మారేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారుగానీ, చంద్రబాబు బుజ్జగింపులతో తిరిగి టీడీపీలో కొనసాగారాయన.

వ్యక్తిగత ప్రాపకం పెంచుకోవడం తప్ప, గంటా శ్రీనివాసరావు ఏ పార్టీలో వున్నా ఆ పార్టీకి పెద్దగా ప్రయోజనం వుండదన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతుంటాయి.

టీడీపీ నుంచి ప్రజారాజ్యం పార్టీలోకి, ప్రజారాజ్యం నుంచి కాంగ్రెస్‌లోకీ, కాంగ్రెస్‌ నుంచి తిరిగి టీడీపీలోకి వచ్చిన గంటా, పదవి చుట్టూనే తన రాజకీయాన్ని నడిపిస్తుంటారు. 

2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేక పవనాలు వీచే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *