జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్న కీలక నేత

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో జంపింగ్‌‌లు ఎక్కువయ్యాయి. ఇప్పటికే పలువురు సిట్టింగ్‌‌లు, కీలకనేతలు అధికార, ప్రతిపక్ష పార్టీల్లో చేరిన సంగతి తెలిసిందే. ఎవరైతే పార్టీల్లో అసంతృప్తిగా ఉన్నారో వారంతా జంప్ చేసేస్తున్నారు.

ఇప్పటికే పలువురు అధికార పార్టీకి చెందిన సిట్టింగ్‌‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో కండువా కప్పుకున్న విషయం విదితమే.

మరోవైపు కాంగ్రెస్‌‌లో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన నేతలు సైతం వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు.

 తాజాగా.. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కిల్లి కృపారాణి వైసీపీలో చేరడానికి సిద్ధమైపోయారు.

సోమవారం సాయంత్రం తన అనుచరులు, ముఖ్య కార్యకర్తలు, కుటుంబీకులతో నిశితంగా చర్చించిన కిల్లి వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు.

మంగళవారం నాడు వైఎస్ జగన్ సమక్షంలో కిల్లి కృపారాణి వైసీపీ కండువా కప్పుకోనున్నారు.

కిల్లికి శ్రీకాకుళం ఎంపీ సీటు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. 2009 ఎన్నికల్లో శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి పోటీచేసిన ఈమె.. టీడీపీ కీలకనేత ఎర్రన్నాయుడిపై 82,987 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

రాష్ట్ర విభజనాంతరం 2014 ఎన్నికల్లో పోటీచేసిన కిల్లి కేవలం 24,163 ఓట్లకే పరిమితం కాగా..

వైసీపీ తరఫున పోటీ చేసిన రెడ్డి శాంతికి 4,28, 591 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన కింజరపు రామ్మోహన్ నాయుడు1,27,572 భారీ మెజార్టీతో గెలుపొందారు.

 ఇదిలా ఉంటే.. 2014 ఎన్నికల అనంతరం ఆమె రాజకీయాల్లో క్రియాశీలకంగా లేరనే చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా ఎక్కడా కనిపించలేదు.

ఏడాదిగా కృపారాణి హస్తాన్ని వీడి వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని వార్తలు వస్తున్న సంగతి తెలసిందే.

సోమవారం సాయంత్రం ఆమెకు వైసీపీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో పార్టీ కండువా కప్పుకోవడానికి సిద్ధమయ్యారు.

ఈమె వైసీపీ తీర్థం పుచ్చుకొని శ్రీకాకుళం పార్లమెంట్ నుంచి పోటీ చేస్తే.. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన రెడ్డి శాంతి పరిస్థితి ఏంటనేది తెలియరాలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *