వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనన్న టీడీపీ ఎంపీ.. భార్యకు ఎమ్మెల్యే టికెట్ కోసం పట్టు

తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట అసెంబ్లీ టికెట్‌ను తన సతీమణి వాణికి ఇవ్వాలని బాబును కోరిన తోట.

జగ్గంపేటలో సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ అదే సీటుకు పట్టుబడుతున్న తోట నర్సింహం బాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తి.

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో.. ప్రధాన పార్టీల్లో టికెట్ పంచాయితీలు మొదలయ్యాయి. ఓవైపు గెలుపు గుర్రాలపై పార్టీలు ఫోకస్ పెడుతుంటే.. ఒకే నియోజకవర్గం నుంచి ఇద్దరు ముగ్గురు నేతలు టికెట్ రేసులో ఉంటున్నారు.

ముఖ్యంగా అధికార పార్టీ టీడీపీలో ఆశావహుల జాబితా పెరిగిపోతోంది. ఇప్పటికే ఉన్న తలనొప్పులు చాలవన్నట్లు.. కొందరు ఎంపీలు కూడా ఎమ్మెల్యేలుగా బరిలోకి దిగాలని ఆశపడుతున్నారు. అధినేతను కలిసి ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు.

వచ్చే ఎన్నికల బరిలో ఉండనంటున్నారు కాకినాడ ఎంపీ తోట నర్సింహం. అనారోగ్య కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఎంపీ తన కుటుంబ సభ్యులతో కలిసి.. మంగళవారం అమరావతిలో అధినేత చంద్రబాబును కలిసి తన మనసులో మాటను చెప్పారు.

అనారోగ్య కారణాలతో ఎన్నికలకు దూరంగా ఉండాలనుకుంటున్నానని.. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట అసెంబ్లీ టికెట్‌ను తన సతీమణి వాణికి ఇవ్వాలని బాబును తోట కోరారు.

చంద్రబాబుతో భేటీ తర్వాత నర్సింహం మీడియాతో మాట్లాడారు. జగ్గంపేట సీటు తన భార్యకు కేటాయించమని చంద్రబాబును కోరినట్లు తెలిపారు.

గతంలో తాను జగ్గంపేట నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన విషయాన్ని గుర్తు చేశారు.. టికెట్ విషయంపై చంద్రబాబు ఆలోచించి నిర్ణయం చెబుతానన్నారట.

ఎంపీలు పార్టీ మారడంపై కూడా తోట స్పందించారు. ఎంపీలు పార్టీలు మారడం వారి వ్యక్తిగత విషయమని.. పార్టీ మారే సమయంలో విమర్శలు చేయడం సహజమన్నారు. తాను మాత్రం టీడీపీలోనే కొనసాగుతానని చెప్పారు.

ఇదిలా ఉంటే.. తోట నర్సింహం తన భార్య కోసం అడిగిన జగ్గంపేట నుంచి జ్యోతుల నెహ్రూ ఎమ్మెల్యేగా ఉన్నారు.

2014లో నెహ్రూ వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి.. తర్వాత టీడీపీలో చేరారు.

తూర్పుగోదావరి జిల్లాలో కీలక నేతగా ఉన్న నెహ్రూను కాదని.. జగ్గంపేట టికెట్ నర్సింహం భార్యకు కేటాయిస్తారా అన్నది ఆసక్తిగా మారింది.

జగ్గంపేట పంచాయితీని చంద్రబాబు ఎలా డీల్ చేస్తారన్నది తేలాలంటే.. మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *