విచారణ కమిషన్‌ పిలిస్తే… వెళ్లి నిజం చెబుతా’… తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ‘పన్నీర్‌సెల్వం’

జయలలిత మృతి గురించి విచారణ కమిషన్‌కు నిజమే చెబుతానని ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం తెలిపారు.

చెన్నై విమానాశ్రయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ… జయలలిత ఉన్నప్పుడు శశికళ క్షమాపణ లేఖ రాశారని గుర్తుచేశారు.

అందులో… ‘నాకు తెలియకుండా కొన్ని ఇబ్బందులు కలిగాయని, వాటి గురించి ఇప్పుడే తన దృష్టికి వచ్చిందని, కావున తనను క్షమించాలని’’ శశికళ పేర్కొన్నారని పన్నీర్‌ తెలిపారు.

‘‘శశికళను మాత్రమే సహాయకురాలిగా నియమించా. మిగతా 15 మందిని పార్టీ సభ్యత్వం నుంచి తొలగించానని’’ తర్వాత జరిగిన బహిరంగ సమావేశంలో అమ్మ ప్రకటించారని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

జయలలిత మృతి సమయంలో పార్టీ, అధికారం దినకరన్‌ కుటుంబం చేతిలోకి వెళ్లే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. అందుకే తాను ధర్మయుద్ధం చేశానని పేర్కొన్నారు. అన్నాడీఎంకేను కార్యకర్తల పార్టీగా ఎంజీఆర్‌ ప్రారంభించారని వివరించారు.

జయలలిత కూడా అదే పద్ధతిలో పార్టీని అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. ఆర్ముగస్వామి విచారణ కమిషన్‌ తనకు జనవరి 23న హాజరు కావాలని సమన్లు పంపిందని తెలిపారు.

అదే రోజు ప్రపంచ పెట్టుబడుదారుల సమావేశం ఉన్నందున వేరే తేదీని పరిశీలించాలని తాను కమిషన్‌ను కోరానని, అందుకు అంగీకరించిందని పేర్కొన్నారు.

తర్వాత రెండుమూడు సార్లు వాయిదా పడిందని, అందుకు కారణం తనకు తెలియదని వివరించారు.

వాయిదా వేసినట్లు వార్తలు మాత్రమే వచ్చాయని పేర్కొన్నారు. విచారణ కమిషన్‌ ద్వారా తనకు సమాచారం అందితే వెళ్లి నిజాలు చెబుతానని తెలిపారు.

ప్రస్తుతం పత్రికలలో వస్తున్న వార్తలకు, తనకు సంబంధం లేదని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల కూటమి గురించి జాతీయ, ప్రాంతీయ పార్టీలతో చర్చలు జరుపుతున్నామని వెల్లడించారు. అన్నాడీఎంకే నేతృత్వంలోనే కూటమి ఏర్పాటవుతుందని స్పష్టం చేశారు.

ప్రతిభ, అర్హత ఉంటే ఎవరైనా రావొచ్చు

ఈనాడు డిజిటల్‌, చెన్నై: అర్హత, ప్రతిభ ఉంటే ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చని ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం పేర్కొన్నారు.

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే నుంచి పోటీ చేసేందుకు ఇటీవల ఆయన కుమారుడు రవీంద్రనాథ్‌ దరఖాస్తు తీసుకున్నారు.

దీనిపై ఏఎంఎంకే నేత టీటీవీ దినకరన్‌ తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం పన్నీర్‌సెల్వం విలేకర్లతో మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని తన కుమారుడు ఆసక్తి చూపారని తెలిపారు.

ఆయన విద్యార్హత, రాజకీయాలపై ఆసక్తిని చూసి పార్టీ దరఖాస్తు ఇచ్చిందన్నారు. పార్టీలోని సభ్యులందరికీ ఎన్నికల్లో పోటీకి ప్రాథమిక హక్కు ఉంటుందని తెలిపారు.

ఆశావహులు దరఖాస్తు చేసుకోవాలని పార్టీ ఇచ్చిన ప్రకటన మేరకు రవీంద్రనాథ్‌ చేసుకున్నారని చెప్పారు.

తమపై ఏదో ఒక విమర్శ చేయడానికే ఏఎంఎంకే నేత టీటీవీ దినకరన్‌ చూస్తుంటారని పేర్కొన్నారు. ఆ కుటుంబాన్ని అమ్మ గతంలోనే వెలివేశారని గుర్తు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *