జిత్తులమారి నక్కతో యుద్ధం.. అన్నొస్తున్నాడని చెప్పండి: జగన్

ఎన్నికల కురుక్షేత్రంలో ప్రజలందరి తోడు, ఆశీస్సులు కావాలని వైసీసీ అధినేత జగన్ కోరారు. నర్సీపట్నం నుంచి ఎన్నికల ప్రచార భేరీ మోగించారు. చంద్రబాబు పాలనపై నిప్పులు చెరిగారు.

ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు కేవలం రెండు పార్టీల మధ్యే జరగడం లేదని జగన్ అన్నారు. ధర్మం – అధర్మం, విశ్వసనీయత – వంచన మధ్య ఎన్నికలు జరుగుతున్నాయన్న జగన్..

ఈ కురుక్షేత్రంలో అందరి తోడు, ఆశీస్సులు, దీవెనలు కావాలని కోరారు. విశాఖ జిల్లా నర్సీపట్నం వేదికగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్..

ఎన్నికల ప్రచారాన్ని ఘనంగా ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు పాలనపై నిప్పులు చెరిగారు.

‘చంద్రబాబు ఎండమావులను నమ్మొద్దు.. రేప్పొద్దున అన్న సీఎం కాగానే నవరత్నాలు పథకాల ద్వారా మనందరి జీవితాలు బాగు పడతాయని చెప్పి అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి’ అని వైసీపీ కార్యకర్తలకు జగన్ పిలుపునిచ్చారు.

‘ఈ ఎన్నిక‌ల్లో ఒక జిత్తుల మారి న‌క్కతో యుద్ధం చేస్తున్నాం. మోసాలు చేసే చంద్రబాబుతో త‌ల‌ప‌డుతున్నాం. ఎన్నిక‌ల‌ను సమయంలో ఆయ‌న గ్రామాల‌కు డ‌బ్బుల మూట‌లు పంపిస్తారు.

అనేక ప్రలోభాలు పెడ‌తారు. ప్రతి ఓట‌రుకు రూ. 3 వేలు ఇచ్చేందుకు ముందుకొస్తారు. ఆయన ఇచ్చే డ‌బ్బుకు మోస పోవ‌ద్దు. ప్రతి కుటుంబానికి తెలియజెప్పండి.. రానున్నది వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం..’ అని జగన్ అన్నారు.

చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో శాంతి భ‌ద్రత‌లు లోపించాయని జగన్ మండిపడ్డారు. ‘మా చిన్నాన్నను ఇంట్లోనే గొడ్డలితో న‌రికి చంపారు. టీడీపీ ఎమ్మెల్యే ఓ మ‌హిళా ఎంఎఆర్‌వోను జుట్టు ప‌ట్టుకుని లాగినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోరు.

మన ప్రభుత్వంలో ఇలాంటివి జరగవు. శాంతి భ‌ద్రతలకు ప్రాధాన్యమిస్తాం. అవినీతిమ‌య‌మైన జ‌న్మభూమి క‌మిటీల‌ను ఎత్తి వేస్తాం’ అని జగన్ అన్నారు.

‘రాష్ట్రంలో అవ్వా తాతల దగ్గరకు వెళ్లండి. మీకు ఎంత పింఛను వస్తుందని అడగండి. చాలా మంది తమకు పింఛను రావడం లేదని చెబుతారు.

కొందరు తమకు రూ.2 వేలు ఇస్తున్నారని చెప్తారు. అప్పుడు అడగండి.. ఎన్నికలు మూడు నెలల్లో ఉన్నాయి కాబట్టే, అది కూడా అన్న చెప్పాడు కాబట్టి ఇస్తున్నాడని చెప్పండి.

అన్నకు భయపడి మాత్రమే చంద్రబాబు ఆ పింఛను ఇస్తున్నాడని వివరించండి. అన్న సీఎం కాగానే ఆ పింఛన్‌ను క్రమంగా పెంచి రూ.3 వేలు చేస్తారని వివరించండి’ అని కార్యకర్తలను వైఎస్‌ జగన్‌ కోరారు.

నేను విన్నాను, నేను ఉన్నాను.. ‘యాత్ర’ స్టైల్లో వైఎస్ జగన్ ప్రచార భేరీ…

యాత్ర సినిమాలో వైఎస్సార్ తరహాలో వైసీపీ అధినేత జగన్ ఎన్నికల ప్రచరా భేరీ మోగించారు. నేను విన్నాను.. నేను ఉన్నాను.. అంటూ ప్రజల ముందుకొచ్చారు. టీడీపీ పాలనపై నిప్పులు చెరిగారు.

నేను విన్నాను.. నేను ఉన్నాను.. అంటూ ఎన్నికల ప్రచార బరిలోకి వచ్చారు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్. ఇటీవల విడుదలైన ‘యాత్ర’ సినిమాలో పాపులర్ డైలాగ్‌తో ప్రచార భేరీ మోగించారు.

చంద్రబాబు ఎండ‌మావుల‌ను న‌మ్మొద్దని పిలుపునిచ్చారు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో ఆదివారం (మార్చి 17) మధ్యాహ్నం వైసీపీ నిర్వహించిన బహిరంగ సభలో జగన్ మాట్లాడారు. టీడీపీ ఐదేళ్ల పాలనపై నిప్పులు చెరిగారు.

ప్రజా సంక‌ల్ప యాత్రలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి పేద‌ల క‌ష్టాల‌ను తెలుసుకున్నానని జగన్ చెప్పారు. వారు ఎదుర్కొంటున్న స‌మస్యలను క‌ళ్లారా చూశానన్నారు.

గ్రామాల్లో చితికి పోయిన రైతుల బాధల‌ను తెలుసుకున్నానని.. ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ స‌దుపాయం లేక విద్యార్థుల విలవిల్లాడుతున్న విషయాన్ని గమనించానని చెప్పారు. 108 వాహ‌న స‌దుపాయం లేక అనారోగ్యంతో గోస ప‌డుతోన్న వారిని చూశానని తెలిపారు.

‘ఆప‌న్నుల గురించి ప‌ట్టించుకునే నాథుడే లేరు. కుటుంబ య‌జ‌మానులు మద్యానికి బానిస‌లు కాగా.. మహిళలు అవ‌స్థలు పడుతున్నారు. పెరాల‌సిస్‌తో ఎంతో మంది బాధ‌ప‌డుతున్నారు.

ఇక మహిళల కష్టాలు అనేకం. మంచి నీటి కోసం గ్రామాల‌కు గ్రామాలు ఇబ్బంది ప‌డుతున్నాయి. కూలీకి వెళ్లందే పొట్ట నింపుకోలేని స్త్రీల‌ను చూశా’ అని జగన్ అన్నారు.

‘ఏపీలోని అన్ని వ‌ర్గాల‌కు ఒక విష‌యం చెబుతున్నా. ఒక భ‌రోసా ఇస్తున్నా. ప్రతి ఒక్కరికీ ఒక మాట ఇస్తున్నా.

నేను ఉన్నాన‌ని.. మీ క‌డ‌గండ్లను తీరుస్తాన‌ని.. వైఎస్సార్ సీపీకి ఓట్లు వేయాల‌ని అడ‌గ‌డానికి ముందు మేమేం చేస్తామో చెబుతా..’ అని జగన్ అన్నారు.

రాష్ట్రంలో లంచాలు లేనిదే ఏ ప‌ని జ‌ర‌గ‌దని జగన్ ఆరోపించారు. రేష‌న్ కావాల‌న్నా.. పెన్షన్ కావాల‌న్నా.. లంచం. మీ అంద‌రి స‌హ‌కారంతో అధికారంలోకి వ‌చ్చే వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం సుప‌రిపాల‌న‌ అందిస్తుంది.

ప్రజల బాగోగుల‌ను ఎప్పటికప్పుడు తెలుసుకుని వారిని ఆదుకునేందుకు చ‌ర్యలు తీసుకుంటుంది. కుల పిచ్చి లేని పాల‌న‌ను అందిస్తాం’ అని జగన్ అన్నారు..

జగన్ సభలో అపశృతి.. గోడ కూలి 10 మందికి గాయాలు…

జగన్ సభలో అపశృతి చోటుచేసుకుంది. గోడ కూలి పలువురు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. విజయనగరం జిల్లా డెంకాడ సభలో ఈ విషాదం జరిగింది.

వైసీపీ ఎన్నికల ప్రచార సభలో అపశృతి చోటుచేసుకుంది. ఆదివారం (మార్చి 17) సాయంత్రం విజయనగరం జిల్లా డెంకాడలో ప్రచార రథం పైనుంచి జగన్‌ ప్రసంగిస్తుండగా..

ఆ సమీపంలో భవనం పైనుంచి ఇటుకలు పడి 10 మంది వరకు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జగన్‌ను చూసేందుకు చుట్టుపక్కల ఉన్న భవనాల పైకి జనం భారీగా చేరుకున్నారు.

ఈ సమయంలో ఓ భవనం పిట్ట గోడ కూలడంతో సుమారు 20 అడుగుల ఎత్తు నుంచి.. కింద ఉన్నవారిపై ఇటుకలు పడినట్లు తెలుస్తోంది.

భవనం పైనుంచి మనుషులు కింద పడితే ప్రాణాలకు ప్రమాదం ఏర్పడి ఉండేది.

వెంటనే స్పందించిన స్థానికులు, పోలీసులు బాధితులను ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో నలుగురికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది.

వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. బాధితుల్లో ఓ మహిళ కూడా ఉన్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *