రేపటి నుంచి కాంగ్రెస్‌ హోదా యాత్ర హిందూపురం నుంచి ఇచ్ఛాపురం వరకూ.. 13 జిల్లాలు, 13 రోజులు, 2251 కిలోమీటర్లు

రేపటి నుంచి కాంగ్రెస్‌ హోదా యాత్ర

ప్రత్యేకహోదా భరోసా ప్రజా యాత్ర పేరుతో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న బస్సు యాత్ర మంగళవారం నుంచి ప్రారంభం కానుంది.

మొత్తం 13 రోజులపాటు 13 జిల్లాల్లో నిర్వహించనున్న ఈ యాత్ర అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం నుంచి మొదలు కానుంది.

మార్చి 3న ఇచ్ఛాపురంలో ముగుస్తుంది. మొత్తం 2251 కిలోమీటర్ల పొడవున ఈ యాత్ర జరగనుంది. ఈ సందర్భంగా మొత్తం 54 సభలు నిర్వహించాలని ఏపీ పీసీసీ నిర్ణయించింది.

కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీతోపాటు వివిధ రాష్ట్రాల కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు, పార్టీ సీనియర్‌ నేతలు రోజుకొకరు చొప్పున యాత్రలో పాల్గొంటారు.

రాహుల్‌ పర్యటన ఇంకా ఖరారు కాలేదు.

ఈ నెల 26న లేదా 27న వచ్చే అవకాశముందని ఏపీ పీసీసీ వర్గాలు తెలిపాయి. ప్రియాంక పర్యటనపై స్పష్టత రావాల్సి ఉంది. ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ యాత్రలో పాల్గొంటారు.

బీసీలపై తెదేపా, వైకాపాలది కపట ప్రేమ: తులసిరెడ్డి

ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ వైకాపా, తెదేపాలకు బీసీలపై ఎక్కడా లేని ప్రేమ పుట్టుకొస్తోందని పీసీసీ ఉపాధ్యక్షుడు ఎన్‌.తులసిరెడ్డి ఆదివారం విజయవాడలో విమర్శించారు. వెనుకబడిన వర్గాలపై అంత ప్రేమ ఉంటే వారిని ముఖ్యమంత్రిని చేయగలరా అని ప్రశ్నించారు.
కేవలం ఎన్నికల లబ్ధి కోసమే కొత్త హామీలిస్తున్నారని, నాలుగేళ్లుగా పట్టించుకోలేదని దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చి ఐదేళ్లవుతున్నా తెదేపా ప్రభుత్వం రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయలేకపోయిందని విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *