పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల నుంచి తప్పించడంతో భారీ నష్టం వాటిల్లిందని…మాజీ ఎంపీ తెలిపారు

సీబీఐ కేసులపై రాయపాటి స్పందన.. ఇరికించారు, పోలవరం నుంచి తప్పించడంతో..

ట్రాన్స్‌ట్రాయ్ సంస్థపై నమోదు చేసిన సీబీఐ కేసుల్లో తనను అనవసరంగా ఇరికించారని మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తెలిపారు.

ఆ సంస్థ రోజువారీ వ్యవహారాలకు, తనకు ఎలాంటి సంబంధం లేదన్నార ఓ న్యూస్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన.. సీబీఐ, యూనియన్ బ్యాంకులు తమపై తప్పుడు కేసులు పెట్టాయన్నారు.

యూనియన్ బ్యాంక్ చేయించిన ఆడిట్ రిపోర్టు తప్పుల తడకగా ఉందని ఆయన ఆరోపించారు. ట్రాన్స్‌ట్రాయ్ సంస్థ అప్పుల్లో కూరుకుపోయిన మాట వాస్తవమేనన్నారు.

ఆ సంస్థ నిధులను తాము ఎక్కడికీ బదిలీ చేయలేదన్నారు. మాకు రావాల్సిన బకాయిలు వేల కోట్లలో ఉన్నాయన్నారు.

14 బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నామని రాయపాటి స్పష్టం చేశారు. తమ కంపెనీ తక్కువ కాలంలోనే పురోగతి సాధించిందన్నారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల నుంచి తప్పించడంతో భారీ నష్టం వాటిల్లిందని రాయపాటి తెలిపారు. ట్రాన్స్‌ట్రాయ్ బాధ్యతలను సీఈవో చెరుకూరి శ్రీధరే చూసేవారన్నారు.

ఆ సంస్థ రోజువారీ కార్యకాలపాలకు తనకు సంబంధం లేదన్నారు. బ్యాలన్స్ షీట్లపై మాత్రమే తాను సంతకాలు చేశానన్నారు.

కంపెనీలో ఏం జరుగుతుందో తనకు తెలీదన్నారు. ట్రాన్స్‌ట్రాయ్ తప్పు చేయదని తాను నమ్ముతున్నానని రాయపాటి తెలిపారు.

‘గతంలో నా భార్య ట్రాన్స్‌ట్రాయ్ డైరెక్టర్‌గా ఉండేది. ఆమె చనిపోయిన తర్వాత బ్యాలన్స్ షీట్లపై సంతకాలు చేశాను.

ఈ కేసులతో నాకు సంబంధం లేదు. ట్రాన్స్‌ట్రాయ్‌‌ను నేను ఏర్పాటు చేసిన మాట వాస్తవమే. కానీ రాజకీయాల కారణంగా.. దాని బాధ్యతలను శ్రీధర్‌కు అప్పగించాను.

రూ.3270 కోట్లను మళ్లించారనే ఆరోపణలతో నమోదు చేసిన కేసులో మూడో నిందితుడిగా చేర్చడం తప్ప’ని రాయపాటి తెలిపారు.

సీబీఐ లోతుగా విచారణ జరిపిన తర్వాత ఎవరేం తప్పు చేయలేదని తేలే అవకాశం ఉందన్నారు. స్టాక్ వాల్యుయేషన్‌ను పెంచి చూపారనడం తనకు తెలీదన్నారు.

తనను అనవసరంగా ఈ కేసులో ఇరికించారన్న రాయపాటి.. ఇందులో ఎలాంటి రాజకీయ ప్రమేయం ఉందనుకోవడం లేదన్నారు. ఈ కేసు నుంచి తాము బయటపడతామన్నారు.

హైదరాబాద్‌ కావూరి హిల్స్‌లోని రాయపాటి కార్యాలయంతోపాటుగా.. బెంగళూరు, గుంటూరులో సీబీఐ అధికారులు మంగళవారం తనిఖీలు జరిపారు.

ఈ సోదాల్లో అధికారులు పలు కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *