Pulwamaలో ఎన్‌కౌంటర్.. మేజర్ సహా ఐదుగురు జవాన్లు మృతి


పుల్వామా ఆత్మాహుతి దాడిలో 49 మంది సైనికులు అమరులైన ఘటనతో దేశం యావత్తు విచారంలో మునిగిపోయింది.

ఈ ఘటన జరిగిన నాలుగు రోజుల్లో మరో ఐదుగురు సైనికులు వీరమరణం పొందారు.

పుల్వామా జిల్లాల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు సైనికులు వీర మరణం.
ఉగ్రవాదుల కోసం గాలిస్తుండగా కాల్పులు జరపడంతో జవాన్లకు గాయాలు.
పింగలాన్‌లోని ఓ ఇంట్లో నక్కిన ఉగ్రవాదులు, కొనసాగుతోన్న ఎదురుకాల్పులు

పుల్వామా ఆత్మాహుతి దాడి నుంచి దేశం ఇంకా తేరుకోకముందే ఉగ్రతూటాలకు మరో ఐదుగురు జవాన్లు బలయ్యారు. జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాల్లో ఉగ్రవాదులు-భద్రతా బలగాల మధ్య సోమవారం తెల్లవారుజామున ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.

పింగలాన్‌ ప్రాంతంలో జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోగా.. ఒకరు గాయపడ్డారు. ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.

పింగలాన్ ప్రాంతంలో ఉగ్రవాదుల సంచరిస్తున్నట్టు నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో ఆర్మీకి చెందిన 55 రాష్ట్రీయ రైఫిల్స్, సీఆర్పీఎఫ్, ఎస్‌ఓజీలు సంయుక్తంగా అక్కడకు చేరుకున్నాయి.

సోమవారం తెల్లవారుజామున పింగలాన్ చేరుకుని తనిఖీలు నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమై ఎదురు కాల్పులు జరపడంతో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది.

ఈ ఘటనలో ఓ మేజర్ సహా ఐదుగురు సైనికులు అమరులయ్యారు. మేజర్ డీఎస్ దోండియల్, హెడ్‌కానిస్టేబుల్ సవే రాం, జవాన్ అజయ్ కుమార్, హరిసింగ్‌లు ఎన్‌కౌంటర్ ప్రదేశంలోనే మృతిచెందగా, తీవ్రంగా గాయపడిన గుల్జార్ మహ్మద్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఇదే ఎదురుకాల్పుల్లో ఇద్దరు పౌరులు సైతం మృతిచెందారు.

ఈ ఇద్దరూ తీవ్రవాదులు తలదాచుకున్న ఇంటి యజమానులు. పుల్వామా ఆత్మాహుతి దాడిలో 49 మంది సైనికులు అమరులు కాగా, అనేక మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *