అనుభవం Vs మార్పు.. అలుపెరుగని బాటసారికి మళ్లీ గెలుపు ఖాయమా?

జాతీయ రాజకీయాల్లో ఈసారి మరింత కీలకంగా వ్యవహరిస్తున్న, కుప్పం నియోజకవర్గం నుంచి వరసగా ఏడోసారి పోటీ చేస్తున్న చంద్రబాబు.. ఈసారి ఎన్నికల ఫలితాల్లో మెజార్టీని పెంచుకుంటారా? ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీస్తున్న తరుణంలో ఆధిక్యం తగ్గుతుందా?

చంద్రబాబు నాయుడు

సుదీర్ఘ రాజకీయ అనుభవం.. అనేక అంశాలపై పట్టు.. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం, పాలనలో అందెవేసిన చేయి.. అంతకంటే మించి గ్రేట్ పొలిటికల్ మేనేజ్‌మెంట్.. ఇవన్నీ సంక్షిప్తంగా చెబితే టీడీపీ అధినేత ‘చంద్రబాబు నాయుడు’. జాతీయ రాజకీయాల్లో ఈసారి ఆయన మరింత కీలకంగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా కుప్పంనియోజకవర్గం నుంచి ఆయన వరసగా ఏడోసారి తన అదృష్టం పరీక్షించుకుంటుండటం విశేషం. ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికల ఫలితాల్లో చంద్రబాబు తన మెజార్టీని పెంచుకుంటారా? ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీస్తున్న తరుణంలో ఆధిక్యం తగ్గుతుందా? చంద్రబాబు నేతృత్వం వహిస్తున్న టీడీపీ రాష్ట్రంలో వరసగా రెండోసారి అధికారంలోకి వస్తుందా? అనేవి చర్చనీయాంశాలుగా మారాయి.

విభజనతో గడ్డు స్థితిలో నిలిచిన ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు తమకు అండగా, పెద్ద దిక్కుగా 2014లో చంద్రబాబు నాయుడికే పట్టం కట్టారు. తనదైన దార్శనికత, పాలనాదక్షత, దూరదృష్టి, అనుభవంతో.. లోటు బడ్జెట్‌లోనూ రాష్ట్రాన్ని అనేక రంగాల్లో ప్రగతి పథంలో నిలిపారు. రాజధాని అమరావతి నిర్మాణం, పరిశ్రమల ఏర్పాటు కోసం అహర్నిశలూ శ్రమించారు.

చూస్తుండగానే ఐదేళ్లు గడిచాయి. ఎన్నికలు రానే వచ్చాయి. పూర్తి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అటు తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని పునికిపుచ్చుకొని తొమ్మిదేళ్లుగా ప్రజా సమస్యలపై పోరాడుతూ.. ప్రజల్లో వైఎస్ జగన్ మరింత బలం సంపాదించుకున్నారు. ప్రజా సంకల్ప యాత్ర ద్వారా రాష్ట్రమంతా చుట్టివచ్చారు. ప్రత్యేక హోదాపై గళం పెంచారు. చంద్రబాబు నాయుడికి దీటుగా నిలిచారు.

ఇప్పుడు ఏపీ ఎన్నికల ముందు ఉన్న ప్రశ్న ఒకటే. ప్రజలు తిరిగి అనుభవానికే పెద్ద పీట వేస్తారా? లేదా అందరూ అనుకుంటున్నట్టు మార్పుకు నాంది పలుకుతారా? ఏది జరిగినా సంచలనమే.

2002లో గుజరాత్ అల్లర్ల సమయంలో సీఎం పదవి నుంచి నరేంద్ర మోదీ వైదొలగాలని డిమాండ్ చేసిన చంద్రబాబు.. 2014 ఎన్నికల్లో అదే మోదీతో చేయి కలపడం గమనార్హం. అంతేకాకుండా రాష్ట్రాన్ని విభజించినందుకు కాంగ్రెస్‌ పార్టీని తీవ్రంగా విమర్శించారు. ఆ తర్వాత ఏపీకి ప్రత్యేక హోదా కోసం జరిగిన పోరులో కమలం పార్టీకి కటీఫ్ చెప్పి ఆది నుంచి వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీతో చేయి కలిపారు. ఏపీ రాజకీయాల్లో ఇది పెను సంచలనం. దీన్ని ఊసరవెల్లిలా రంగులు మార్చడం అని కొంత మంది విమర్శిస్తే.. చంద్రబాబు మాత్రం ‘ప్రజాస్వామ్య అనివార్యత’గా అభివర్ణించారు.

మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా బీజేపీయేతర పార్టీలను ఏకం చేసేందుకు చంద్రబాబు నడుంకట్టారు. ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, దేశాన్ని కాపాడండి’ నినాదంతో విమర్శలకు పదునుపెట్టారు. ఈ క్రమంలో రాజకీయ కుట్రలు, కక్ష సాధింపు చర్యలను దీటుగా ఎదుర్కొంటున్నారు. మమతా బెనర్జీ, దేవెగౌడ, శరద్ పవార్, మాయావతి, ఫరూఖ్ అబ్దుల్లా, అఖిలేశ్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్ లాంటి వారితో మంచి సంబంధాలు కొనసాగిస్తూ అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చారు.

ఏపీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా..

ఏపీలో ఈసారి జరుగుతున్న ఎన్నికలను చంద్రబాబు నాయుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అన్నీ తానై పార్టీ నేతలను, శ్రేణులను ముందుండి నడిపించారు. అభ్యర్థులు ఎవరున్నా.. తనను చూసే ఓటేయాలని కోరారు. సుమారు నెల రోజులుగా విరామం లేకుండా ఎన్నికల ప్రచార పర్వంలో నిమగ్నమయ్యారు. రాష్ట్రమంతా సుడిగాలి పర్యటన చేశారు.

సుమారు 110 ప్రచార సభల్లో పాల్గొన్న చంద్రబాబు ప్రతిపక్షాలపై ఘాటు విమర్శలు చేశారు. ఈసారి ఎన్నికల క్యాంపెయినింగ్ కూడా సరికొత్తగా నిర్వహించారు. మోదీ, కేసీఆర్ నుంచి జగన్ వరకూ అందరు నేతలపై విమర్శలు గురిపెడుతూనే.. స్థానిక సమస్యలను ప్రస్తావించారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో చేసిన పనులను వివరించారు.

రోజూ ఉదయం టెలికాన్ఫరెన్స్‌ల ద్వారా పార్టీ శ్రేణులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేసిన చంద్రబాబు.. ఆ వెంటనే ఎన్నికల కదన రంగంలోకి దూకారు. చివరి నిమిషం వరకూ ప్రచారం నిర్వహించారు. అటు సోషల్ మీడియాలోనూ తాజా సందేశాలతో ప్రచారాన్ని ఉరకలెత్తించారు.

ఎండ తీవ్రతను లెక్కచేయక.. కుర్రాడిలా కదిలి..

తన వయసు 70 ఏళ్లకు చేరువవుతున్నా కుర్రాడిలా కదిలారు చంద్రబాబు. ఎండ తీవ్రతకు యువకులే కుదేలవుతున్న వేళ ఉత్సాహంగా ప్రచారం నిర్వహించారు. ఎండ దెబ్బకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. అటు వైఎస్ జగన్ కూడా విరామం తీసుకుంటూ ప్రచారం సాగించారు. కానీ, చంద్రబాబు ఒక్కరే అలుపెరగని బాటసారిలా ప్రచారం నిర్వహించారు.

టీడీపీ అధినేత

తనకు తానే సాటి..

ఎన్నికల్లో సమీకరణాలను లెక్కేసి కూటములు, పొత్తులు కట్టడంలో.. జనం నాడిని పసిగట్టి వ్యూహాలు వేయడంలో చంద్రబాబు తనకు తానే సాటి. చివరి నిమిషం వరకూ పోరాడతారు. ఓటమిని అంగీకరించరు. అదే ఆయన బలం. అయితే.. ఆయన ఒకప్పటి చంద్రబాబు కాదని, చాలా మారారని కొంత మంది వాదన. ఈ నేపథ్యంలో టీడీపీని మరోసారి గెలిపించి ఆయన చరిత్ర సృష్టిస్తారా.. లేదా మార్పు ముందు తలొంచుతారా అని తెలుగువారితో పాటు యావత్ దేశం ఆసక్తిగా గమనిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *